ప్రపంచ బ్యాంక్ నిధులతో రహదారుల అభివృద్ధి
- బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు యడ్యూరప్ప
శివమొగ్గ : శివమొగ్గ-హానగల్, శికారిపుర-ఆనందపురం మధ్య ఉన్న రాష్ట్ర రహదారులను రూ.425 కోట్ల ప్రపంచబ్యాంకు నిధులతో అభివృద్ధి చేయడానికి ఆమోదం లభించినట్లు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప తెలిపారు. త్వరలోనే ఇందుకు సంబంధించి టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు.
ఆదివారం శివమొగ్గలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శివమొగ్గ నగర, గ్రామీణ, హొన్నాళి, శికారిపుర, సాగర, సొరబ, హనగల్ అసెంబ్లీ నియోజకవర్గాలు, శివమొగ్గ, దావణగెరె, హవేరి లోకసభ నియోకవర్గ పరిధిలోని రాష్ట్ర రహదారుల అభివృద్ధికి నిర్ణయాలు తీసుకున్నట్లు గుర్తు చేశారు.
ఇందుకు సంబంధించి రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ ద్వారా నివేదికను కూడా రూపొందించినట్లు తెలిపారు. ప్రపంచ బ్యాంక్ మార్గదర్శకాల మేరకు ఇప్పటికే రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాలను, అడ్డుగా ఉన్న చెట్లను తొలగించడం జరిగిందని అన్నారు. రోడ్డు విస్తరణకు అవసరమైన భూస్వాధీన ప్రక్రియ పూర్తి అయిన తర్వాత నిధుల కోసం ప్రపంచ బ్యాంక్‌కు నివేదిక సమర్పించడం జరిగిందని చెప్పారు.
ఇటీవలె ఈ పనులకు ప్రపంచబ్యాంక్ ఆమోదం లభించిందని, రెండు ప్యాకేజీల్లో నిధులు విడుదల చేసేందుకు బ్యాంక్ అంగీకరించిందని తెలిపారు. వారంలోపు టెండర్ ప్రక్రియ పూర్తి చేసి మూడు నెలల్లోపు పనులు ప్రారంభించేలా చర్యలు చేపడతామని అన్నారు. బైందూరు, హొసనగర, బట్టేమల్లప్ప, ఆనందపుర, శికారిపుర, మాసూరు రోడ్డు, శిరసి, బనవాసి, శిరాళకొప్ప, హొన్నాళి, హరిహర రోడ్డు, శివమొగ్గ, హనగల్ రహదారులను జాతీయ రహదారులుగా మార్పు చేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు పేర్కొన్నారు.