న్యూఢిల్లీ: కృష్ణానగర్ నియోజకవర్గ ఓటర్లు కిరణ్‌బేడీ విషయంలో ఎంతమాత్రం సుముఖంగా లేరంటూ వచ్చిన వార్తలు బీజేపీలో కలవరం రేకెత్తించాయి. దీంతో ఈ పరిస్థితిని అధిగమించేందుకుగాను స్థానికంగా ఎంతో ప్రాబల్యం కలిగిన కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర ్ధన్‌ను ఆమెకు మద్దతుగా రంగంలోకి దించింది. బేడీ సునాయాస విజయం కోసం ఆమెకు మద్దతుగా పనిచే యాల్సిందిగా హర్షవర్ధన్‌ను అధిష్టా నం ఆదేశించిందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ సంప్రదాయ సీటుగా భావించే ఈ నియోజక వర్గంలో 1993 నుంచి 2013 ఎన్నికల వరకూ హర్షవర్ధన్ విజయపరంపరను కొనసాగించారు.
ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన చాందినీచౌక్ స్థానంలో విజయకేతనం ఎగురవేశారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో హర్షవర ్ధన్ కు బదులు కిరణ్‌బేడీని బీజేపీ రంగంలోకి దించడంతో పార్టీ కార్యకర్తలు నిరాశకు లోనయ్యారని, ఆమెను వారంతా బయటి వ్యక్తిగా భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ నియోజక వర్గంలో కిరణ్‌బేడీ చేపడుతున్న రోడ్‌షోలు, ఎన్నికల ప్రచార సభలకు స్పందన ఆశించినరీతిలో ఉండడం లేదంటున్నారు. ఈ పరిస్థితి మెరుగుపడాల్సిన అవసరం ఉందని తమ పార్టీ భావించిందన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి కిరణ్‌బేడీ బరిలోకి దిగినప్పటికీ ఆమెకు మద్దతుగా హర్షవర ్ధన్ తోనూ ప్రచారం చేయాలని నిర్ణయించిందంటున్నారు. కిరణ్‌బేడీ ఎట్టిపరిస్థితుల్లోనూ విజయకేతనం ఎగురవేసేలా చూడాలంటూ హర్షవర ్ధన్ ను ఆదేశించిందని చెబుతున్నారు.
ఇరువురి మధ్య విభేదాలు
ఇదిలాఉంచితే కిరణ్‌బేడీ, హర్షవర ్ధన్ మధ్య సత్సంబంధాలు లేవనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గత నెల 15వ తేదీన బేడీ... బీజేపీలో చేరారు. అదే నెల 20వ తేదీన నగరానికి చెందిన ఏడుగురు ఎంపీలను తేనీటి విందుకు ఆహ్వానించారు. ఆ విందుకు హర్షవర ్ధన్ ఆలస్యంగా వచ్చారు. బేడీ ఆయనను కలవకుండానే అక్కడ నుంచి నిష్ర్కమించారు. వీరిరిరవురి మధ్య దూరం నానాటికీ పెరుగుతుండడం అధిష్టానాన్ని ఆందోళనకు లోనుచేసింది. ఈ నియోజకవర్గంలో బేడీ అత్యధిక మెజారిటీతో విజయం సాధించాలని బీజేపీ ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో బేడీకి అన్నివిధాలుగా అండదండగా నిలవాలని, ఆమె నిర్వహించే రోడ్‌షోలు, ఎన్నికల సభల్లో పాల్గొనాలని ఆదేశించింది.
ఆప్ దూకుడుకు కళ్లెం వేసేదెలా?
ప్రస్తుత ఎన్నికల్లో తమ ప్రత్యర్థి అయిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని ఎంతమేరకు ఎదుర్కోగలమనే సందేహాలు బీజేపీని వేధిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఆప్ కంటే ఎక్కువ స్థానాల్లో గెలుపొందినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్‌ను చేరుకోవడంలో బీజేపీ విఫలమైంది. దీంతో ఈసారి ఎలాగైనా ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తోన్న బీజేపీ... ఆప్‌పై విమర్శల వర్షం కురిపిస్తోంది. ఇందులో భాగంగానే ఆ పార్టీని ఓఅరాచకవాది నడిపిస్తున్నాడంటూ ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిరోజుల క్రితం నగరంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఘాటుగా వ్యాఖ్యానించారు. అలాగే పార్టీ యంత్రాంగంతో పాటు కేంద్ర మంత్రులను కూడా కమలదళంప్రచారంలోకి దింపింది. ఎనిమిది మంది మినహా మిగిలిన కేంద్ర మంత్రులు, ఎంపీలంతా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యేలా పార్టీ చర్యలు తీసుకుంది.
అంతేకాకుండా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) కూడా తమ కార్యకర్తలను ప్రచారానికి పంపింది. గత ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొని ఆప్ 28 చోట్ల గెలుపొంది రెండో స్థానంలో నిలిచింది. అయినప్పటికీ ఇప్పటికీ ఆప్ పరిస్థితి అంతంతగానే ఉంది. రాజకీయ అనుభవం లేని వ్యక్తి ఆధ్వర్యంలో ఔత్సాహికులతో గజిబిజి భావాజాలంతో ఆ పార్టీ నడుస్తోంది. అంతే కాకుండా షాజియా ఇల్మీలాంటి ముఖ్యనాయకులు కూడా ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆప్ 49 రోజుల పాలన తర్వాత ఆ పార్టీ నాయకులపై ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్‌పై వ్యంగ్య వ్యాఖ్యలు, వేళాకోళాలు అధికమయ్యాయి. కేజ్రీవాల్‌ను... మోదీ వ్యంగ్యంగా ఏకే-47 అని పిలవడం మొదలుపెట్టారు.
ఇలాంటి ప్రతికూలతలను పక్కన పెడితే నగరంలోని పేదలు, మైనారిటీలు ఆప్ వైపు మొగ్గుచూపుతున్నారు. దిగువ మధ్యతరగతి ప్రజలు, మురికి వాడల్లో నివశించే జుగ్గీజోపడీ సమూహాలను నైపుణ్యంతో కేజ్రీవాల్ ఆకట్టుకున్నారు. పోలీసుల చేతివాటాన్ని, అధికారుల ఉదాసీనత వల్ల వీరంతా అనేక బాధలను ఎదుర్కొంటున్నారు. అలాగే హిందుత్వ సంప్రదాయవాదుల మతతత్వ అజెండా కారణంగా మైనారిటీలు ఒంటరివారయ్యారు. అలాంటి వారికి ప్రత్యామ్నాయంగా ఆప్ కనిపించింది. ఆ వర్గాలన్నీ ఇప్పుడు ఆ పార్టీపైనే ఆశలు పెట్టుకున్నాయి. అయితే కాంగ్రెస్ మరీ అంత బలహీనంగా లేదని, ఆ పార్టీ బీజేపీ ఓట్లను చీల్చే అవకాశం ఉందని, అది తమకు లాభిస్తుందని బీజేపీ మంత్రి ఒకరు ఆశాభావం వ్యక్తం చేశారు.
కిరణ్‌బేడీకి వెన్నుదన్నుగా హర్షవర్ధన్
Published Mon, Feb 2 2015 12:08 AM | Last Updated on Sat, Sep 2 2017 8:38 PM
Advertisement
Advertisement