బేడీ వైపు ఢిల్లీవాలా మొగ్గు
ఢిల్లీ మహిళలు కిరణ్‌బేడీ వైపు అధికంగా మొగ్గుతున్నారు. రకరకాల చింతలతో నిత్యం కుతకు తలాడే దేశ రాజధానిలో లోతుగా విస్తరించిన అభద్రతా భావాన్ని ఆమె అయితేనే అర్థం చేసుకోగలరని భావిస్తున్నారు. అవినీతి నిర్మూలన, భద్రత, మెరుగైన జీవితం అనే మూడే ఢిల్లీ ఓటర్ల ప్రాథమిక డిమాండ్లు. మోదీ నాయకత్వం, బేడీ పరిపాలనాధికారం కలసి ఓటర్లకు నమ్మిక కలిగిస్తున్నాయి. ఇందుకు భిన్నంగా ఆమ్ ఆద్మీ పార్టీకి ఉద్వేగభరితమైన ఓటర్ల నుంచి లేదా భయం రాజకీయాలతో బాధపడుతున్న వారి నుంచి ప్రధానంగా మద్దతు లభిస్తోంది.
శాసనసభ ఎన్నికలకు ముందు ఢిల్లీలోని ఓ గోదాములోకి ఐదు వేల విస్కీ సీసాలను తరలించడానికి ఎంత మంది కావాలి? నిస్సందేహంగా సీసాలతో ప్రభావితం చేయాలనుకునే వారికంటే చాలా తక్కువే. ఎన్నికల కమిషన్ జరిపిన దాడిలో దొరికిన ఆ సీసాలు అక్రమంగా నిల్వచేసినవి. అంటే ఓటర్ల ను ప్రభావితం చేయడానికి దాచినవేననేది స్పష్టమే. చట్టబద్దంగా మద్యాన్ని అమ్ముకునేవారెవరికీ అక్రమంగా నిల్వచేయాల్సిన అవసరం ఉండదు.
అవినీతికి కూడా మంచి నిర్వహణా నైపుణ్యాలు కొన్ని ఉండటం అవసరమనడానికి ఇదే ఆధారం. దోషిగా ఆరోపణకు గురైన వ్యక్తి, తనను తాను పవిత్రమూర్తిగా భావించుకునే ఒక పెద్దమనిషి పార్టీకి చెందినవారు. తానేతప్పూ చేసి ఎరుగనని సదరు అభ్యర్థి ఖండిస్తారనడంలో సందేహం లేదు. తప్పును అంగీకరించడమంటే ఎన్నికల కమిషన్ విధించే శిక్షను ఆహ్వానించడమే. ఇలాంటి వ్యవహారాల విచారణకు సమయం పడుతుంది. అది పూర్తయ్యేసరికి ఎన్నికలు జరిగిపోయి చాలా కాలమే అయిపోతుంది. ఆలోగా ఈ పొగమంచులో నిజాన్ని మీడియా నుంచి దాచేసి, నిస్సిగ్గుగా ఎన్నికల ప్రచారం కొనసాగించవచ్చు. అయిచే నిజాన్ని ఎరిగిన బాపతు కూడా ఉన్నారు... వారు ఓటర్లు. ఎంతైనా మందు కొట్టడమమేది మహోత్సాహంగా సాగే వ్యవహారం. తాగుబోతులో లేదా మానసికంగా కుంగిపోయినవాళ్లో మాత్రమే ఒంటరిగానే ఆ పని కానిచ్చేస్తారు.
శ్రీమాన్ ఐదు వేల సీసాల వారు కాస్త పాత కాలపు సజ్జు అని ఓ మోస్తరు విచారణ జరిపినా తెలిసిపోతుంది. అదే లక్ష్య సాధన కోసం ఇంతకంటే తెలివైన పద్ధతిని కనిపెట్టిన వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వాళ్లు ప్రత్యక్ష పంపిణీ కిందకు వచ్చే సీసాలను పంపిణీ చేయరు. సంతకాలు, ఆనవాలు లేని చిట్టీలను పంపిణీ చేస్తారు. ఆచూకీ కనిపెట్టడం కష్టమయ్యే ఆ చిట్టీలను పుచ్చుకుని సంబంధిత మద్యం వ్యాపారి మందు సీసా అప్పగించేస్తాడు.
ఈ ఘటన ఒకటి రెండు ప్రశ్నలను రేకెత్తిస్తోంది. ఇప్పుడు దొరికినది మొత్తం నిల్వ చేసిన దాన్లో ఓ చిన్న భాగమే అనే సమంజసమైన సూత్రాన్ని బట్టి చూద్దాం. శ్రీమాన్ ఐదువేల సీసాల వారి అవసరం పట్టుబడ్డ వాటికంటే తేలికగానే రెండు లేదా మూడున్నర రెట్లు ఉండవచ్చు. కాబట్టి ఆయన రాజకీయ విస్కీ వ్యయం కనీసం రూ. 20 లక్షలు. అంతకంటే ఎక్కువేనని దాదాపు నిశ్చయంగా చెప్పొచ్చు. అంటే ఏ ప్రమాణాల ప్రకారం చూసినా ఆ అభ్యర్థి మొత్తం ఎన్నికల వ్యయం రెండు కోట్ల రూపాయలకు పైనే. ప్రజా జీవితంలోని నిజాయితీయే తమ అత్యంత మౌలిక సూత్రమని చెప్పుకునే పార్టీ అభ్యర్థి ఆయన.
అలాంటి నిజాయితీ నుంచి ఢిల్లీని ఆ భగవంతుడే కాపాడాలి.
ఇంతకు ఈ లంచం పనిచేస్తుందా? మహా అయితే పాక్షికంగా పనిచేస్తుంది. మన సమాజం స్థిరంగానూ, ప్రగతిశీలంగానూ పరిణామం చెందుతోంది. కులం, మతం ప్రాతిపదికగా కలిగిన సంప్రదాయకమైన గెలుపు లెక్కలకు అతీతంగా ఓటు చేసే వర్గం ఒకటి దేశంలో ఆవిర్భవించిం దని తాజా ఎన్నికల జనాభా లెక్కలు తెలుపుతున్నాయి. ఇది ఒక ఆరోగ్యకర పరిణామం. సంప్రదాయకమైన పాత లెక్కలూ ఇంకా ఉన్నాయి, ఢిల్లీ ఎన్నికల్లోనూ అవి కనిపిస్తాయి. కానీ ఎన్నికల ప్రక్రియలో వాటికి ఇప్పుడు అంత ప్రాధాన్యం లభించడం లేదు.
ఇటీవలి జమ్మూకశ్మీర్ ఎన్నికలకు సంబంధించిన గణాంకాలలో ఒక అంశం ప్రత్యేకించి ఆసక్తికరం. శ్రీనగర్ అంచున, దాల్ లేక్ ఒడ్డునున్న హజరత్‌బల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మసూద్ అల్ హస్సన్‌కు 2,635 మంది కశ్మీరీలోయ ఓటర్లు ఓటు చేశారు. ఇదేమంత పెద్ద సంఖ్య కాదనిపిస్తుంది. కానీ అవి మొత్తం పోలైన ఓట్లలో దాదాపు 10 శాతం, కాంగ్రెస్‌కు లభించిన వాటికి రెండున్నర రెట్ల కంటే ఎక్కువ.
హజరత్‌బల్ చాలా ప్రత్యేకమైన స్థలం. మొహమ్మద్ ప్రవక్త శిరోజం మె-ఎ ముకద్దాస్ అనే పవిత్ర అవశేషం ఉన్న ప్రపంచ ప్రసిద్ధ ప్రార్థనా స్థలం. అక్కడ కమలం గుర్తుకు అనుకూలంగా ఓటింగ్ మిషన్ మీటను నొక్కిన ఓటర్లు ఎవరు? వాళ్లదొక కొత్త వర్గం. జాతి లేదా భావోద్వేగాలపరమైన అంశాలకంటే అభివృద్ధి, ఉద్యోగాలను మరింత ముఖ్యమైనవిగా భావించే బాపతు. దేశంలో ఇతర చోట ్లకూడా అభివృద్ధికి ప్రాముఖ్యతనిచ్చే ఇలాంటి వర్గం ఓటర్లలో అధిక భాగంగా మారుతోంది.
ఈ ఓటర్లలో మహిళలు, యువతదే అగ్రశ్రేణి. రెండు కారణాల వల్ల ఢిల్లీ మహిళలలో అత్యధికులు బీజేపీ వైపు మొగ్గుతున్నారు. లైంగిక సమానత్వం, మహిళా సాధికారతలను ప్రధాని నరేంద్ర మోదీ తన పరిపాలనలోని విలక్షణ ఇతివృత్తంగా మలచారు. శక్తివంతమైన ఆయన ఉపన్యాసాలలోనూ, ‘‘బేటీ బచావో, బేటీ పడావో’’ ఉద్యమం వంటి విధానాలలోనూ కూడా ఇది కనిపిస్తుంది. అప్పుడే అది ప్రబల స్థాయి సహానుభూతిని కలగజేసింది. ఇక రెండవది, రకరకాల చింతలతో నిత్యం కుతకుతలాడే దేశ రాజధాని నగరంలో లోతుగా విస్తరించిన అభద్రతా భావాన్ని కిరణ్‌బేడీ అర్థం చేసుకోగలరని వారికి నమ్మిక కలిగింది. అనుభవంగల పోలీసు అధికారిణి అయిన ఆమె అయితేనే మాటల హామీలకు మించి మరేమైనా చేస్తారని కూడా వారు విశ్వసిస్తున్నారు.
అవినీతి నిర్మూలన, భద్రత, మరింత మెరుగైన జీవితం అనే మూడు అంశాలే ఢిల్లీ ఓటర్ల ప్రాథమిక డిమాండ్లు. నరేంద్ర మోదీ నాయకత్వం, ఢిల్లీలో బేడీ పరిపాలనాధికారం కలసి ఆ మూడు అంశాలకు సంబంధించి ఓటర్లకు తిరిగి నమ్మిక కలిగిస్తున్నాయి. ఇందుకు భిన్నంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి ఉద్వేగభరితమైన ఓటర్ల నుంచి లేదా భయం రాజకీయాలు సోకి బాధపడుతున్న వారి నుంచి ప్రధానంగా మద్దతు లభిస్తోంది. ఇది క్షేత్రస్థాయి వాస్తవికతను ప్రతిఫలించే అంచనాయే తప్ప తీర్పు కాదు. ఆ అర్థంలో ఆప్ గతించిన కాలానికి ప్రాతినిధ్యం వహిస్తోంది.
ఢిల్లీ ఓటర్లది అత్యంత మిశ్రమ సంపుటి. ఆ అంశమే దే శంలోని ఇతర ప్రాంతాలకు ఆ నగరం సూక్ష్మ రూపమని వ్యాఖ్యానించేట్టు ప్రేరేపిస్తుంది. అయితే అది కట్టుకథ. ప్రతి ఓటరూ తన తక్షణ ఆవరణంలోని సమస్యల ప్రాతిపదికపైనే ఒక నిర్ణయానికి వస్తాడు. కాబట్టి బిహార్‌లో జనతాదళ్ (యూ) కొంత వరకు పనిచేయవచ్చు. కానీ ఢిల్లీలోని బిహార్ సంతతి ఓటర్లలో సైతం అది పనిచేయదు.
మనం కోరుకునే పార్టీయే గెలవాలని అంతా ఆశిస్తాం. శ్రీమాన్ ఐదు వేల సీసాలవారు ఓటమిపాలు కావాలని కూడా అంతగానూ మనం అంగీకరిస్తాం.