హస్తిన పీఠం కమలానికే!
ది వీక్-ఐఎంఆర్‌బీ సర్వేలో వెల్లడి
ఎన్నికల్లో ఆప్-బీజేపీ పోటాపోటీ: ఏబీపీ న్యూస్-నీల్సన్ సర్వే
బీజేపీ వైపే ఓటరు చూపు: ఇండియా టీవీ-సీటీవీ
న్యూఢిల్లీ: ఢిల్లీ అధికార పీఠాన్ని దక్కించుకునే అసెంబ్లీ ఎన్నికల రేసులో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు పోటాపోటీగా దూసుకుపోతున్నాయి. దాంతో ఓటరు ఏ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టనున్నాడో తెలుసుకునేందుకు సర్వే సంస్థలు రంగంలోకి దిగాయి. ఢిల్లీ అసెంబ్లీలోని 70 స్థానాల్లో 36 సీట్లను బీజేపీ కైవసం చేసుకోనుందని ‘ది వీక్-ఐఎంఆర్‌బీ’ సర్వేలో తేలింది. ఆప్‌కు 29 సీట్లు, కాంగ్రెస్‌కు కేవలం నాలుగు సీట్లు వస్తాయని తెలిపింది.
39 శాతం మంది ఓటర్లు బీజేపీకి జై కొడుతున్నారని తేల్చింది. ఆప్ నేత కేజ్రీవాల్ సీఎం కావాలని 40 శాతం మంది ఓటర్లు, బీజేపీ నాయకురాలు కిరణ్ బేడీ సీఎం కావాలని 39 శాతం మంది ఓటర్లు కోరుకుంటున్నారు. కేజ్రీవాల్, బేడీ, మనీష్ సిసోడియాలు స్పష్టమైన మెజారిటీతో నెగ్గుతారని సర్వే తెలిపింది. ఎన్నికల్లో బీజేపీకి 37 సీట్లు, ఆప్ 28 సీట్లు, కాంగ్రెస్‌కు 5-8సీట్లు రావొచ్చని ఇండియా టీవీ-సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో తేలింది. ఇక, బీజేపీ 37 సీట్లు, ఆప్ 29, కాంగ్రెస్ 4 సీట్లు పొందొచ్చని తలీమ్ రీసెర్చ్ ఫౌండేషన్-జీ న్యూస్ సర్వేలో వెల్లడైంది.
సీఎం పదవికి కేజ్రీవాల్, బేడీల మధ్యే పోటీ నెలకొందని ఏబీపీ న్యూస్-నీల్సన్ ‘స్నాప్ పోల్’లో వెల్లడైంది. సీఎం పదవికి ఉత్తమ అభ్యర్థిగా కేజ్రీవాల్ 47 శాతం ఓట్లతో ప్రథమ స్థానంలో నిలవగా, 44 శాతం ఓట్లతో బేడీ రెండోస్థానంలో నిలిచారు. మహిళా ఓటర్లలో 50 శాతం మంది కేజ్రీవాల్ వైపు మొగ్గుచూపగా, బేడీకి 41.4 శాతం మద్దతు తెలిపారు. ఢిల్లీలో మరోసారి హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని న్యూస్ నేషన్ నిర్వహించిన మరో ఒపీనియన్ పోల్‌లో వెల్లడైంది.