మంచి వార్తలు రాయండి
కోలారు : పత్రికలు, టీవీల్లో నేర వార్తలను విశేషంగా రాయడం తగదని, దీని వల్ల యువత పక్కదోవ పట్టే ప్రమాదం ఉందని జిల్లా సెషన్స్ న్యాయమూర్తి రేణుకా ప్రసాద్ అన్నారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన కానూను అరివు - నెరవు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న మంచి విషయాలను తక్కువ చూపించి నేరాలు, తదితరాలను పెద్దగా చూపుతున్నారని తెలిపారు. అవి యువతపై తీవ్రమైన పరిణామాలు చూపిస్తున్నాయని పేర్కొన్నారు. నేరాలను ఎక్కువగా చూపించే బదులు.. వాటికి పాల్పడితే ఎలాంటి శిక్ష పడుతుందో వివరించాలని సూచించారు.
నేరాలను అదుపు చేయడంలో పోలీసులతో పాటు ప్రజల పాత్ర కూడా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ చట్టాల గురించి తెలుసుకోవాల్సి ఉందన్నారు. అప్పుడే నేరాల సంఖ్య తగ్గుతుందని వివరించారు. అసంఘటిత కార్మికులకు జాతీయ పింఛను పథకం వరంలా మారిందని, తాము కష్టపడి సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని పొదుపు చేస్తే భవిష్యత్తు బాగుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా జాతీయ పింఛను పథకాన్ని పాత్రికేయులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి మల్లికార్జున కిణికేరి, జాగృతి సేవా సంస్థ అధ్యక్షుడు ధన్‌రాజ్, పాత్రికేయుల సంఘం జిల్లాధ్యక్షుడు కేఎస్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.