ముంబ్రాలో కుప్పకూలుతున్న భవనాలు | Yet another building collapse in Mumbra | Sakshi
Sakshi News home page

ముంబ్రాలో కుప్పకూలుతున్న భవనాలు

Published Sun, Sep 22 2013 3:19 AM | Last Updated on Fri, Sep 1 2017 10:55 PM

ఠాణే జిల్లా ముంబ్రా ప్రాంత వాసులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఎక్కడ ఏ భవనం కూలిపోతుందోనని క్షణక్షణం బిక్కుబిక్కుమంటున్నారు. |Building Collapsed In Mumbra

సాక్షి, ముంబై: ఠాణే జిల్లా ముంబ్రా ప్రాంత వాసులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఎక్కడ ఏ భవనం కూలిపోతుందోనని క్షణక్షణం బిక్కుబిక్కుమంటున్నారు. దీనికి కారణం.. అక్కడి భవనాలు పేకమేడల్లా కూలిపోతుండటమే.. చూస్తూండగానే కళ్లముందే అవి కుప్పకూలిపోతుండటంతో ఏమీ చేయలేక చేష్ఠలుడిగి చూస్తూ ఉండిపోతున్నారు. ఈ ఏడాది ఇక్కడ భవనాలు కుప్పకూలిన సంఘటనల్లో సుమారు 90 మంది దుర్మరణం పాలవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని చెప్పవచ్చు. ఎప్పుడు తాము శిథిలాల మధ్య చిక్కుకుపోతామోనని స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. కుప్పకూలుతున్న భవనాల్లో ఎక్కువ భాగం అక్రమ నిర్మాణాలే. సాధారణంగా వర్షాకాలంలో భారీవర్షాలకు నగరాల్లోని శిథిలావస్థలో ఉన్న భవనాలు నాని, కుప్పకూలే అవకాశాలుంటాయి. కాని ముంబ్రాలో ఇటీవల కట్టిన భవనాలు సైతం కుప్పకూలిపోతుండటంతో ప్రజలు అవాక్కవుతున్నారు.
 
 నిర్మాణాల్లో నాణ్యతలోపం తమ ప్రాణాలను హరిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భవన నిర్మాణాల్లో నిబంధనలను గాలికొదిలేసి, ఇష్టానుసారం కట్టడాలను పూర్తిచేస్తుండటంతో అవి అనతికాలంలోనే కూలిపోతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభానికి ముందే ఏప్రిల్ నాలుగవ తేదీన ఠాణే ముంబ్రా శిల్‌ఫాటా వద్ద అక్రమంగా నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం కుప్పకూలింది. శిల్‌ఫాటా లక్కి కాంపౌండ్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో 72 మంది మరణించగా అనేక మంది గాయపడ్డ విషయం విదితమే. ఈ సంఘటన అనంతరం ముంబై, ఠాణేలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అక్రమకట్టడాలు, శిథిలావస్థకు చేరిన భవనాల్లో నివసించేవారి భద్రత అంశం తెరపైకి వచ్చింది. దీనిపై ముఖ్యమంత్రితోపాటు రాష్ట్ర యంత్రాంగమంతా తీవ్రంగా స్పందించారు. అక్రమ భవనాలతోపాటు శిథిలావస్థకు చేరిన భవనాలను ఖాళీ చేయించాలని నిర్ణయం తీసుకున్నాయి.
 
 దీంతోపాటు వర్షాకాలంలో మరింత ఆస్తి ప్రాణనష్టం జరగకుండా ముందుజాగ్రత్తగా స్ట్రక్చర్ అడిట్‌తోపాటు ఇతర చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావించింది. అయితే ఇప్పటికీ ఎలాంటి ముందుజాగ్రత్త చర్యలు చేపట్టలేదు. మరోవైపు శిథిలావస్థకు చేరిన భవనాలు, అక్రమ కట్టడాలు నేలకూలుతూనే ఉన్నాయి. ఏప్రిల్ నెలలో భవనం కూలిన సంఘటనను మరిచిపోకముందే జూన్ 21వ తేదీ తెల్లవారు జామున మరోసారి ముంబ్రా రైల్వేస్టేషన్ సమీపంలోని స్మృతి భవనం నేలకూలింది. ఈ సంఘటనలో పది మంది మృతి చెందారు. ఈ సంఘటన అనంతరం గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు శనివారం తెల్లవారుజామున ముంబ్రా రైల్వే సమీపంలోని బానోపార్క్ కుప్పకూలిపోయి ఒకరు మృతి చెందారు. భవనం కూలడానికి కొద్ది సమయం ముందు అక్కడ ప్రకంపనలు రావడం, భవనం ప్లాస్టింగ్ ఊడిపడటంతో అందులో ఉంటున్నవారు ప్రమాదాన్ని పసిగట్టి కట్టుబట్టలతో బయటకు పరుగులు దీసి ప్రాణాలు దక్కించుకున్నారు. ఏమాత్రం ఆలస్యమైనా భారీ ప్రాణనష్టం జరిగి ఉండేదేనని వారు వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి స్థానికంగా అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరముందని స్థానికులు అంటుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement