ఇంటర్నెట్.. అదో మాయాజాలం.. మనసు కన్నా వేగంగా ఆలోచించేది.. మనిషికన్నా ఎక్కువ విజ్ఞానాన్ని నింపుకున్నది ఇంటర్నెట్. ఇదో విజ్ఞాన సర్వస్వం. క్లిక్ చేస్తే చాలు.. ప్రపంచంలోని వింతలు విశేషాలు కళ్ల ముందుంటాయి. క్లిక్ చే స్తే చాలు.. ప్రపంచంలోని దేని గురించిన సమాచారం అయినా ఇట్టే తెలిసిపోతుంది. ఇప్పుడు యువతకు ఇంటర్నెట్ ఆరోప్రాణంగా మారింది. నిత్యావసరమై పోయింది. ఇంటర్నెట్ యువతకు ఏ మేరకు ఉపయోగపడుతోందో, ఎంత చెడుపు చేస్తోందో తెలిపే కథనమే ఇది..
న్యూఢిల్లీ: మారుతున్న కాలంలో సాంకేతిక పరిజ్ఞానం మన జీవితాల్లోకి దూసుకొస్తోంది. ఇంటర్నెట్ వాడకం నిత్యావ సరంగా మారిపోయింది. పిల్లలను ఎల్‌కేజీలో చేర్పించేందుకు దరఖాస్తు చేయడంతో మొదలయ్యే ఇంటర్నెట్ వాడకం ఉద్యోగాలు పొందే ప్రవేశ పరీక్షల వరకూ, ప్రతి సందర్భంలోనూ తప్పనిసరి అయింది. అందులో యువత మరీ ముఖ్యంగా ఇంటర్నెట్‌ను అధికంగా వాడుతున్నారు. వీరిలో ప్రతి ఒక్కరూ సామాజిక వెబ్‌సైట్లను ఉపయోగించుకుంటున్నారు.
ఇలా ఉపయోగపడుతోంది..
ముఖ్యంగా ఇంజనీరింగ్ ఎంబీఏ, ఎంసీఏ, వైద్య విద్యార్థులతో పాటు ఆయా డిగ్రీ, పీజీ, విద్యార్థులు ఎక్కువగా ఇంటర్నెట్ వినియోగించుకుని వారికి కావాల్సిన విషయ పరిజ్ఞానాన్ని పెంచుకుంటున్నారు. ఆంగ్ల వ్యాకరణం, భావ వ్యక్తీకరణ నైపుణ్యాల మొదలు ఆయా సబ్జెక్టులకు సంబంధించిన ప్రామాణిక గ్రంథాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అలాగే ఉద్యోగ వివరాలను తెలియజేసే వెబ్‌సైట్లూ ఇందులో కోకొల్లలు.
ఇవీ నష్టాలు
ప్రతి వస్తువులోనూ మంచీచెడూ రెండూ ఉంటాయి. మనం ఉపయోగించే విధానంతో అవి వెలుగులోకి వస్తాయి. ఇంటర్నెట్ యువతకు ఎంత ఉపయోగపడుతోందో అంతే స్థాయిలో చెడు కూడా చేస్తోంది. యువతలో దాదాపు 70 శాతం మంది ఇంటర్నెట్‌కు బానిసలవుతున్నారు. వీరిలో చాలా మంది అర్ధరాత్రి వరకు కంప్యూటర్ ముందు కూర్చుని ఉంటున్నారు. కొందరు అశ్లీల చిత్రాలను చూసేందుకు, వాటిని బయటివారితో షేర్ చేసుకునేందుకు కూడా వెనుకాడ్డం లేదు. ఇటీవల జిల్లాలో ఫేస్‌బుక్‌ల ద్వారా కొందరు అశ్లీల మెసేజ్‌లు పోస్ట్ చేయడంపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కొందరిలో ఇంట ర్నెట్ చూడ్డం కూడా వ్యసనంలా మారుతోంది. మంచి కూడా మితంగా ఉన్నంత వరకే బాగుంటుంది. పరిమితి దాటితే చెడుగా మారుతుంది.
ఇటీవల సర్వేలో వెలుగు చూసిన నిజాలు
ఇంటర్నెట్ వాడకంపై ఇంజనీరింగ్, డిగ్రీ, బీఈడీ విద్యార్థుల్లో ఇటీవల ఓ సంస్థ సర్వే నిర్వహించింది. తమకు విషయ సేకరణకు, దరఖాస్తులు పంపడానికి ఇంటర్నెట్ ఉపయోగపడుతోందని 95 శాతం మంది తెలిపారు. యువత పెడతోవ పట్టేందుకు ఇంటర్నెట్ ప్రధాన కారణమని 60 శాతం మంది తెలిపారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం మనుషులను సోమరులుగా మారుస్తోందని 65 శాతం మంది తెలిపారు. జ్ఞాపక శక్తిని తగ్గిస్తోందని 35 శాతం మంది అన్నారు.
ఇంటర్నెట్‌కు బానిసలవుతున్న యువత
Published Wed, Sep 3 2014 10:32 PM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement