బళ్లారిలో స్నేహితులతో యువ వైఎస్సార్ (ఎడమవైపు)
వైఎస్ రాజశేఖరరెడ్డి అంటేనే ఓ భరోసా. ఆయన చెంత ఉంటే తరగని సంతోషం. స్నేహమంటే ఏమిటో చాటిన మహామనీషి వైఎస్సార్.. అని ఆయన చిన్ననాటి మిత్రులు నేటికీ చెమ్మగిల్లిన కళ్లతో నెమరు వేసుకుంటారు. ఆయనతో గడిపిన మధుర క్షణాలు చిరస్మరణీయమని కథలు కథలుగా చెప్పుకుంటారు. మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి బళ్లారి నగరంతో విడదీయలేని అనుబంధం దాగి ఉంది.
సాక్షి, బళ్లారి: కడప గడ్డమీద పుట్టి తిరుగులేని నాయకునిగా ఎదిగి అవిభక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సంక్షేమ పాలనకు కొత్త నిర్వచనం చెప్పిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు తలచుకోగానే ప్రతి తెలుగు గుండె పులకితమవుతుంది. తెలుగుదనానికి నిండెత్తు నిదర్శనంగా నిలిచిన ఆయన జన్మదినం నేడు. మహానేతతో కలిసి చదువుకున్న పాత మిత్రులకు బళ్లారి నగరం నెలవు. మా వైఎస్సార్ అని ఆయన మిత్రులు సగర్వంగా చెప్పుకుంటూ ఉంటారు.
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పుట్టి పెరిగింది, రాజకీయంగా రాణించి మహానేతగా ఖ్యాతి పొందింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అయితే, విద్యాభ్యాసం దాదాపు కర్ణాటకలో సాగడంతో కర్ణాటకతో కూడా అంతే బంధం పెనవేసుకుంది. వైఎస్సార్ తండ్రి రాజారెడ్డి కాంట్రాక్టర్‌గా పని చేస్తున్న సమయంలో ఆయన బళ్లారిలో కుటుంబంతో సహా కొంతకాలం ఉన్నారు.రాజారెడ్డి తన కుమారులను, కుమార్తెను బళ్లారిలో చదివించేందుకు ఏర్పాట్లు చేశారు. రాజారెడ్డి బళ్లారిలో కుటుంబంతో సహా రాకముందే వైఎస్సార్ కొన్ని నెలలు బళ్లారిలోనే హాస్టల్‌లో ఉండి చదువుకున్నారు. వైఎస్సార్ బళ్లారిలో 7వ తరగతి నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌సీతో పాటు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంటే ఆరేళ్ల పాటు విద్యాభ్యాసం చేశారు. వైఎస్సార్ హైస్కూల్ విద్యను సెయింట్ జాన్స్ పాఠశాలలో çపూర్తి చేసుకొని, అనంతరం పీయూసీ తర్వాత 1964లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ బళ్లారిలో చదివారు. ముఖ్యంగా వైఎస్సార్ బళ్లారిలో హైస్కూల్‌లో చదువుకునే రోజుల్లో సెయింట్ జాన్స్ హైస్కూల్‌కు హెడ్మాస్టర్‌గా ఉన్న ఫ్రాన్సిస్ జేవియర్ వైఎస్సార్ వ్యక్తిత్వం గురించి ఎంతో గొప్పగా చెబుతారు.
ముఖ్యమంత్రి అయ్యాక వైఎస్సార్‌ను హైదరాబాద్‌లో కలిసిన బళ్లారి బాల్యమిత్రులు
వైఎస్సార్ రాజకీయాల్లోకి చేరిన తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. కొంతకాలానికి ఆయనను కలవడానికి వెళ్తే ఎంతో అభిమానంగా పలకరించారు. పాత స్నేహాన్ని గుర్తుపెట్టుకుని పేరుపేరునా పిలవడం ఆశ్చర్యపరచింది. మాకు ఆనంద భాష్పాలు వచ్చాయి అని పలువురు పాతమిత్రులు గుర్తుచేసుకున్నారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్సార్‌ను క్యాంప్ ఆఫీస్‌లో కలిసేందుకు వెళ్లాం. సార్ బిజీగా ఉన్నారు, కలవడం ఇబ్బందిగా ఉంటుందని అక్కడి అధికారులు మాకు చెప్పారు. అయితే ఎంతో కష్టంతో తమ పేర్లను వైఎస్సార్‌కు చేర్చాం. తమ పేర్లు వైఎస్సార్‌కు చేరిన ఐదు నిమిషాల్లో తమ వద్దకే ఆయన లోపల నుంచి వచ్చి పలకరించడంతో పాటు తన వెంట లోపలికి తీసుకెళ్లడంతో పాటు తమనే కాకుండా అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. సీఎం క్యాంపు ఆఫీస్‌లో కూర్చొన్న తర్వాత ప్రతి ఒక్క క్లాస్‌మేట్‌లను పేరుపేరునా గుర్తు చేసుకుంటూ వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. సీఎం అయిన తర్వాత ఎప్పుడు హైదరాబాద్ లేక ఆయన ఎక్కడ ఉన్న తాము అక్కడికి వెళితే ముందుగా తమకు అపాయింట్‌మెంట్ ఇచ్చేవారు. స్నేహితులు అంటే ఆయనకు పంచప్రాణాలు. చిన్నప్పుడు హాస్టల్, పాఠశాలలో ఎలా మాట్లాడేవారు ఏ కష్టమొచ్చినా తనకు చెప్పాలని సూచించారు. స్నేహానికి ప్రతిరూపంగా, నమ్మిన వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడే ధీరత్వం ఆయన సొంతం అని గుర్తు చేసుకున్నారు.
వైఎస్సార్ కొంతకాలంపాటు డిగ్రీ చదివిన బళ్లారి వీరశైవ కాలేజ్
గుల్బర్గాలో వైద్యవిద్య
బళ్లారిలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ ముగిసిన తర్వాత పీయూసీ చదవడానికి విజయవాడలోని లయోలా కాలేజీకి వెళ్లారు.తరువాత డిగ్రీ బళ్లారిలోని వీరశైవ కళాశాలలో చదువుతుండగానే గుల్బర్గాలోని వైద్యకళాశాలలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. ఎంబీబీఎస్ కూడా కర్ణాటకలోనే పూర్తి చేయడంతో ఆయన విద్యాభ్యాసంలో అధిక భాగం కన్నడనాట కొనసాగిందని చెప్పవచ్చు. మహానేత వైఎస్‌ఆర్ కూడా ఎంత ఎత్తుకు ఎదిగినా చిన్ననాటి మిత్రులను, చదివిన పాఠశాలను ఆయన ఎప్పుడూ గుర్తు చేసుకునేవారు.
రాత్రి ఒంటిగంట వరకూ చదువే
వైఎస్ రాజశేఖరరెడ్డి నాకు డిగ్రీలో పరిచయం అయ్యారు. నగరంలోని వీరశైవ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదివే రోజుల్లో వైఎస్సార్ తనతో ఎంతో స్నేహంగా మెలిగేవారు. వారి ఇంటికి వెళ్లేవారం. వైఎస్సార్ తండ్రి రాజారెడ్డి కూడా తమను ఎంతో అప్యాయంగా పలకరించేవారు. హెచ్‌ఎల్‌సీ క్వార్టర్స్‌లో ఎప్పుడూ కలుసునేవాళ్లం. సీఎం అయిన తర్వాత కూడా కలిస్తే చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. వైఎస్సార్‌కు ఎంతో జ్ఞాపకశక్తి ఉండేది. రాత్రి 1 గంట వరకు పుస్తకాలను చదివేవారు. తెలుగుతో పాటు ఇంగ్లిష్‌లో మంచి పట్టు సంపాదించారు. ఎల్లప్పుడు చిరునవ్వులు చిందిస్తూ అందరిని పలకరించేవారు.అలాంటి మహానుభావుడు మన మధ్య లేకపోవడం ఎంతో బాధగా ఉంది. – గాజుల మురళీధర్, బళ్లారి
సద్గుణాల సమాహారం
పువ్వు పుట్టగానే పరమళిస్తుందని అన్నట్లు బాల్యం నుంచే ఆయనలో ఎన్నో సుగుణాలు అందరినీ ఆకర్షించేవి. బళ్లారిలో చదువుతున్న రోజుల్లోనే చిన్నప్పటి నుంచి సేవ చేయాలనే తపన, తోటి విద్యార్థులకు అండగా ఉంటూ వారి కష్టాలను పంచుకోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంచి నడవడికతో చెరగని ముద్ర వేసుకున్నారు. తోటి విద్యార్థులకు హాస్టల్‌లోను, స్కూల్‌లోను ఎంతో అండగా ఉండటమే కాకుండా పేద విద్యార్థులకు ఫీజులు కూడా చెల్లించేవారని స్నేహితులు చెప్పుకుంటారు. తండ్రి రాజారెడ్డి ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బుల్లో ఆయన తోటి విద్యార్థులకు ఫీజులు కట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎవరికి ఇబ్బంది వచ్చినా నేనున్నానంటూ భరోసా ఇచ్చే నాయకత్వ లక్షణాలు ప్రస్ఫుటంగా వ్యక్తమయ్యేవి.
అందరూ కావాలనుకునే వ్యక్తి
బళ్లారిలో సెయింట్‌జాన్స్ హైస్కూల్‌లో కలిసి చదువుకోవడంతో పాటు హాస్టల్‌లో రెండేళ్ల పాటు ఒకే చోట ఉండి చదువుకున్నాం. ఆయన చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలతో కనిపించేవారు. తోటి విద్యార్థులకు ఎలాంటి కష్టమొచ్చినా తనవిగా భావించి సమస్యలు పరిష్కరించేవారు. అందరి మిత్రుల్లో వైఎస్సార్ రూటే సపరేటు. అందరినీ కలుపుకుని పోయే వ్యక్తి. వైఎస్సార్ ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక మేము ఇంటికి వెళ్లి కలిశాము. ఎంతో ఆప్యాయంగా పలకరించారు.
– బాల్యమిత్రుడు అశ్వర్థసింగ్, కమలాపురం
Comments
Please login to add a commentAdd a comment