జియో మరో సూపర్ ఆఫర్
న్యూఢిల్లీ : దేశీయ మేజర్ టెలికాం ఆపరేటర్ల గుండెల్లో దడ పుట్టిస్తున్న రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్‌తో ముందుకొచ్చింది. మొబైల్ పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్ రీచార్జిలపై ఉత్తేజకరమైన ఆఫర్లను లాంచ్ చేసింది. పేటీఎం, ఫోన్ పే ద్వారా క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది.
తాజా నివేదికల ప్రకారం ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ జియో పేటీఎం, ఫోన్ పే యాప్‌ల ద్వారా రీచార్జిలపై క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. పేటీఎం ద్వారాఅయితే రూ.300 ఆఫర్‌పై రూ.76ల క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఫోన్‌పే ద్వారా రీచార్జి చేసుకుంటే రూ.75 క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. అయితే దీనికి జియో యూజర్లకు కంపెనీ పంపిన ఒక ప్రోమో కోడ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పేటీఎం యాప్‌లో 'మొబైల్ ప్రీపెయిడ్' లేదా 'మొబైల్ పోస్ట్ పెయిడ్' అప్షన్స్‌ను ఎంచుకుని జియో ఫోన్ నెంబర్‌ను ఎంటర్ చేసి 'ప్రోగ్రెస్ టు రీఛార్జ్'పై క్లిక్ చేయాలి. ఆ తరువాత ప్రోమో కోడ్‌నుకూడా జతచేయాలి. దీంతో రీచార్జ్ పూర్తవుతుంది. అయితే ఈ ప్రోమో కోడ్ ఎంట్రీ పై కొంత గందరగోళం నెలకొంది.
ముఖ్యంగా ఇప్పటికే జియో వినియోగదారుల ప్రోమో కోడ్ జాబితాలో ఉందనీ, అందుకనీ పేటీఎం ద్వారా రీచార్జ్ సందర్భంగా ఈ ప్రోమో కోడ్ ఎంటర్ అవసరం లేదని తెలుస్తోంది. రీఛార్జ్ పూర్తి అయిన 24 గంటల్లో ఈక్యాష్ బ్యాక్ ఆఫర్ రూ. 76 కస్టమర్ల ఖాతాలో చేరుతుంది. మరిన్ని వివరాలను అధికారిక జియో వెబ్‌సైట్‌లో పరిశీలించవచ్చు.
మరోవైపు మరికొన్ని రోజుల్లోనే ఉచిత ఫీచర్ ఫోన్ వినియోగదారుల చేతుల్లోకి రానుంది. దీంతో దేశీయ సర్వీసు ప్రొవైడర్లు ఆందోళనలో పడిపోయారు. రిలయన్స్ జియో ఉచిత ఫీచర్ల ఫోన్ల వల్ల టెలికం పరిశ్రమపై ప్రతికూల ప్రభావం పడుతుందని దేశీ రెండో అతిపెద్ద టెలికం ఆపరేటర్ వొడాఫోన్ ఫిర్యాదు కూడా చేసింది. జియో ఫోన్ల వల్ల ఆపరేటర్ల ఆదాయాలు మరింత తగ్గే ప్రమాదముందని పేర్కొంది. ఈ నేపథ్యంలో తాజా ఆఫర్‌తో ప్రధాన టెలికాం సంస్థలకు గుండెల్లోగుబులే. కాగా జియో తారిఫ్ ప్లాన్స్ రూ.19 నుంచి రూ.309మధ్య ఉన్న సంగతి తెలిసిందే.