
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఒకే పరీక్ష నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయానికి వచ్చింది. గురుకుల పోస్టుల తరహాలో ప్రిలిమ్స్, మెయిన్స్ విధానం కాకుండా గతంలో డీఎస్సీ నిర్వహించిన విధంగానే ప్రతి సబ్జెక్టుకూ ఒకే పరీక్ష చొప్పున నిర్వహించాలని నిర్ణయించింది. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అధ్యక్షతన గురువారం కమిషన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పరీక్ష విధానంపై సమగ్రంగా చర్చించారు. పరీక్ష విధానాన్ని ఖరారు చేసే బాధ్యత ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీకే ఇచ్చిన నేపథ్యంలో.. పాత పద్ధతిలోనే ఉపాధ్యాయ నియామక పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ ఇవ్వనుంది. ప్రస్తుతం పాఠశాలల్లో బోధిస్తున్న పాఠ్యాంశాల ఆధారంగా ఆయా సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్‌ను ఖరారు చేయనుంది. ఈ బాధ్యతను రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలికి (ఎస్‌సీఈఆర్‌టీ) అప్పగించింది. ఎస్‌సీఈఆర్‌టీ ఇచ్చే సిలబస్ ప్రకారమే పరీక్షలను నిర్వహించనుంది.
అన్ని జిల్లాల్లో పోస్టులు ఉండేలా కసరత్తు
విద్యా శాఖ పాత పది జిల్లాల ప్రకారం పోస్టులను గతంలో ఖరారు చేసింది. అయితే ఇపుడు 31 జిల్లాల ప్రకారం పోస్టులను ఇవ్వాల్సి ఉంది. ప్రాథమికంగా 31 జిల్లాల ప్రకారం కూడా పోస్టులు ఇచ్చినప్పటికీ వాటిలో కొన్ని మార్పులు అవసరమని విద్యా శాఖ భావించింది. కొత్త జిల్లాల ప్రకారం చూస్తే కొన్ని జిలాల్లో టీచర్ పోస్టుల్లేవు. నోటిఫికేషన్ జారీ చేస్తే పోస్టులు లేని జిల్లాల్లోని అభ్యర్థుల నుంచి ఆందోళన వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా జిల్లాల్లో కూడా పోస్టులను ఇచ్చేందుకు విద్యా శాఖ చర్యలు చేపట్టింది. 8,792 పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, మరో 2,500కు పైగా పోస్టులు పెరిగే అవకాశం ఉంది. పోస్టులు లేని జిల్లాల్లో 2018 వరకు రిటైర్‌మెంట్ ద్వారా ఏర్పడే ఖాళీలను కూడా భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఆ ప్రకారం లెక్కలను ఖరారు చేసే పనిలో పడింది. అయితే వాటిని ఈ నోటిఫికేషన్ పరిధిలోకే తెస్తారా, తర్వాత సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదల చేస్తారా, అన్నది నాలుగైదు రోజుల్లో తేలనుంది. మొత్తానికి పోస్టుల సంఖ్య 8,792 కాకుండా 11,500 దాటే అవకాశం ఉంది. ఈ అదనపు పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి ఉత్తర్వులు పొందాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని విద్యా శాఖ టీఎస్‌పీఎస్సీకి తెలియజేసింది.
కొత్త జిల్లాలు.. కొత్త రోస్టర్
మరోవైపు కొత్తగా ఏర్పడిన 31 జిల్లాల ప్రకారమే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టనున్న నేపథ్యంలో కొత్త రోస్టర్ విధానాన్ని అనుసరించేందుకు విద్యా శాఖ చర్యలు చేపట్టింది. పాత పది జిల్లాలకు సంబంధించిన రోస్టర్ కొత్త జిల్లాల్లో వర్తింపజేయడం సాధ్యం కానుక కొత్తగా రోస్టర్ విధానాన్ని అమలు చేయనుంది. అయితే ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల విషయంలో మాత్రం వారి పాత రోస్టర్ విధానాన్ని కొనసాగించనుంది. గతంలో ఏ రోస్టర్ పాయింట్ వద్ద ఆగిపోయిందో.. ఆ తర్వాత పాయింట్ నుంచి ప్రస్తుత రోస్టర్‌ను కొనసాగించే అవకాశం ఉంది.
23వ తేదీలోగా నోటిఫికేషన్!
ఇక పరీక్షను పాత పద్ధతిలోనే చేపట్టాలని నిర్ణయించినందున గతంలో జారీ చేసిన జీవోలను అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరాలని విద్యా శాఖ నిర్ణయించింది. మొత్తానికి నోటిఫికేషన్ జారీ సహా ఈ ప్రక్రియ అంతా ఈనెల 23వ తేదీలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కమిషన్ సభ్యులతోపాటు విద్యా శాఖ అదనపు డైరెక్టర్ పీవీ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment