హైదరాబాద్: ఓ వృద్ధురాలిని నమ్మించి... బంగారు నగలు మాయం చేసిన ఉదంతమిది. రామంతపూర్‌లో నివాసం ఉండే రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి విజయలక్ష్మి(60) మూసారంబాగ్ డివిజన్ శాలివాహన నగర్‌లో ఉంటున్న తన కూతురు చంద్రకళ ఇంటికి వచ్చారు. చంద్రకళ స్థానికంగా పతంజలి మెడికల్ జనరల్ స్టోర్స్ నిర్వహిస్తున్నారు. ఆదివారం విజయలక్ష్మి మెడికల్ షాపులో కూర్చుని ఉండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమె వద్దకు వచ్చి, మాటల్లో పెట్టారు. త్వరలో బంగారు నగల దుకాణం పెడుతున్నామని, పక్కనే ఉన్న దేవాలయంలో మొక్కు తీర్చుకోవడానికి వచ్చామని చెప్పారు. బంగారాన్ని తాకి, డబ్బులు హుండీలో వేస్తే మంచి జరుగుతుందని ఆమెకు నమ్మబలికారు.
విజయలక్ష్మి వద్ద ఉన్న బంగారు గొలుసు, చేతులకు ఉన్న బంగారు గాజులను తీయించి రూ.200, నగలు పేపర్‌లో చుట్టి నగదు గల్లాపెట్టెలో పెట్టారు. అనంతరం దీవించమని ఆమె కాళ్లపై పడ్డారు. డబ్బులు కూడా మీరే ఆలయ హుండీలో వేయమని చెప్పి..అక్కడ నుంచి ఉడాయించారు. తరువాత గల్లా పెట్టెను చూడగా అందులో 10 తులాల బంగారు నగలు కన్పించలేదు. దీంతో ఆందోళనకు గురైన విజయలక్ష్మి మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.