మధును రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పిస్తున్న అధికారులు
దేవరకద్ర : తాను పనికి పోనని.. చదువుకుంటానని ఓ బాలుడు మంగళవారం పోలీసులను ఆశ్రయించాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో చోటుచేసుకుంది. దేవరకద్ర మండలం బల్సుపల్లికి చెందిన మధు (12) తల్లి మృతి చెందగా తండ్రి కృష్ణయ్య ఉన్నాడు. కూలీ అయిన కృష్ణయ్య మూడో తరగతి చదువుతున్న తన కుమారుడు మధును మూడేళ్ల క్రితం చదువు మాన్పించి మిర్యాలగూడ ప్రాంతంలో కూలీ పనులకు పంపించాడు. అయితే మధు ఇటీవల తిరిగి ఇంటికి రావడంతో తండ్రి కృష్ణయ్య మళ్లీ పనికి పోవాలని బాలుడిపై ఒత్తిడి తెచ్చాడు. అయితే తాను చదువుకుంటానని, పనికి వెళ్లనని మధు మొండికేయడంతో కృష్ణయ్య కోపంతో చితకబాది ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. దిక్కు తోచని మధు మంగళవారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తనకు ఎవరూ లేరని, చదువుకుంటానని చెప్పాడు. స్పందించిన పోలీసులు వెంటనే ఈ విషయం ఎంఈఓ నారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన మధును తీసుకువెళ్లి జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో 5వ తరగతిలో చేర్పించారు. చదువుకోవాలనే తన కోరిక నెరవేరడంతో మధు ఆనందం వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment