13,357ఉద్యోగాల భర్తీ
- విద్యుత్ సంస్థలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్
- కొత్త నియామకాలు.. భారీగా పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ శాఖలో ఒకేసారి భారీ ఎత్తున రికార్డు స్థాయిలో ఉద్యోగాల నియామకాలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలిపారు. 2012 నుంచి ఉన్న ఖాళీలతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఒకేసారి నియామకాలు చేపట్టాలని అధికారులను మంగళవారం సీఎం ఆదేశించారు. జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కమ్‌ల పరిధిలో జూనియర్ లైన్‌మెన్ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరకు మొత్తం 13,357 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఇందులో 1,500 వరకు నాన్ టెక్నికల్ పోస్టులు కూడా ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీ నేపథ్యంలో విద్యుత్ శాఖలోని దాదాపు పది వేల మందికి వెంటనే పదోన్నతులు కల్పించాలని కూడా ఆదేశించారు. జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు నేతృత్వంలో జేఎండీ శ్రీనివాసరావు, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తదితరులు చేసిన విజ్ఞప్తి మేరకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంల పరిధిలో ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడం ద్వారా దశల వారీగా ఈ పోస్టులను భర్తీ చేస్తామని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్ రావు ‘సాక్షి’కి తెలిపారు.
ఉద్యోగులకు పదోన్నతులు కల్పించిన అనంతరం ఏర్పడే ఖాళీల్లో కొత్త ఉద్యోగుల నియామకం జరుపుతామన్నారు. కాగా, ఖాళీలను భర్తీ చేసుకోవడంతో పాటు విద్యుత్ రంగంలో రాష్ట్రం ఎంతో ముందుకు పోతోందని, ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్యం, గృహావసరాలకు 24 గంటల పాటు విద్యుత్ అందిస్తున్నామని, వచ్చే ఏడాది నుంచి వ్యవసాయానికి కూడా 24 గంటల విద్యుత్ అందించే ప్రయత్నం చేస్తున్నామని సీఎం చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ శాఖను బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున నియామకాలకు అనుమతి ఇచ్చినట్లు సీఎం వెల్లడించారు.