
సాక్షి, హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సిన వైద్య పోస్టులను డిపార్ట్‌మెంట్ సెలక్షన్ కమిటీ ద్వారా భర్తీ చేసేలా వైద్యారోగ్య శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. టీఎస్‌పీఎస్‌సీకి అప్పగిస్తూ గతంలో జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిర్ణయంతో 1,463 పోస్టులను డిపార్ట్‌మెంటల్ సెలక్షన్ కమిటీ ద్వారా భర్తీ చేయనున్నారు. సాధారణంగా తెలంగాణలో దాదాపు అన్ని శాఖల పోస్టులూ టీఎస్‌పీఎస్సీ ద్వారానే భర్తీ చేస్తున్నారు. ఆయా శాఖలకు భర్తీ అవకాశం కల్పిస్తే పైరవీలు జోరందుకుంటాయని టీఎస్‌పీఎస్సీకి బాధ్యతలిస్తున్నారు.
ఈ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ సిద్ధమైనా పోస్టుల అర్హతలు, రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్ల సమాచారం టీఎస్‌పీఎస్సీకి వైద్యారోగ్య శాఖ ఇవ్వక ఇన్నాళ్లూ ఆలస్యమైంది. కానీ టీఎస్‌పీఎస్సీ ఆలస్యం చేస్తోందంటూ వైద్యారోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకోవడంపై ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి కీలక పోస్టులను నేరుగా, శాఖా పరంగా భర్తీ చేస్తేభారీగా ముడుపులు చేతులు మారుతాయని, అర్హులకు అన్యాయం జరుగుతుందన్న విమర్శలొస్తున్నాయి.
అన్నీ కీలక పోస్టులే..
తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ)లోని 1,280 పోస్టులు, ఆయుష్ పరిధిలోని 183 పోస్టులన్నీ కీలకమైనవే. వీటిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు పోస్టులే 1,175 ఉన్నాయి. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 91 ఉన్నాయి. ఆయుష్‌లో 183 మెడికల్ ఆఫీసర్లు, లెక్చరర్ల పోస్టులున్నాయి. ఇవిగాక ఇతర పోస్టులూ ఉన్నాయి.
సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు విభాగంలో అనెస్థీషియా పోస్టులు 176, పిల్లల వైద్య నిపుణుల పోస్టులు 172 ఉన్నాయి. జనరల్ సర్జరీ పోస్టులు 107, గైనకాలజీ పోస్టులు 149 ఉన్నాయి. రేడియాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, ఆఫ్తమాలజీ, ఈఎన్‌టీ, డెర్మటాలజీ వంటి స్పెషలిస్టు పోస్టులు.. సూపర్ స్పెషలిస్టు పోస్టుల్లో నెఫ్రాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, మెడికల్ ఆంకాలజీ, న్యూరో సర్జరీ, యూరాలజీ పోస్టులు ఉన్నాయి. ఉద్యోగాల భర్తీకి వైద్యారోగ్య శాఖ ఇప్పటికే ఓ సెల్ ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment