వికారాబాద్ సమీపంలో..ప్రకృతి రమణీయత మధ్య కొలువుదీరిన అనంతపద్మనాభ స్వామివారి ఆలయంలో అప్పట్లో ధూప, దీప నైవేద్యాల కోసం పలువురు భక్తులు కానుకల రూపంలో భూములను అందజేసేవారు.
వికారాబాద్: వికారాబాద్ సమీపంలో..ప్రకృతి రమణీయత మధ్య కొలువుదీరిన అనంతపద్మనాభ స్వామివారి ఆలయంలో అప్పట్లో ధూప, దీప నైవేద్యాల కోసం పలువురు భక్తులు కానుకల రూపంలో భూములను అందజేసేవారు. అనంతపద్మనాభస్వామి పేరిట దస్తావేజులు రాసి ఆలయ అర్చకులకు అందచేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో స్వామివారికి అందచేసిన భూములు సుమారు 1500 ఎకరాల వరకు ఉండేదని భక్తులు చెబుతున్నారు. అవి ప్రస్తుతం 140 ఎకరాల వరకే ఉన్నట్లు ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. వీటికి సంబంధించి ధ్రువీకరణ పత్రాలు మాత్రమే తమ వద్ద ఉన్నాయని అంటున్నారు.
2001లో దే వాదాయ శాఖ పరిధిలోకి..
అనంతపద్మనాభస్వామి ఆలయం 2001లో దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చిందని.. అప్పటి వరకు స్వామి వారికి ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులు ఉన్నాయనే విషయం తమకు తెలియదని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. భూములకు సంబంధించిన రికార్డులు ఎవరూ ఇవ్వలేదని.. స్వామివారికి ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులున్నాయనే విషయాన్ని కొన్నింటిని ఆలయ అర్చకులు తమకు తెలిపితే.. మరికొన్ని తామే భక్తుల ద్వారా తెలుసుకున్నామని వారు పేర్కొంటున్నారు.
2001 కంటే ముందు ఆయా ప్రాంతాల్లోని స్వామివారి మాన్యాలను సాగు చేసుకుంటున్న రైతులు వారు పండించిన పంటలో కొంత భాగాన్ని ఆలయ అర్చకులకు అప్పగించేవారు. భూముల వివరాలు కొంత వరకే తమకు తెలుసని తమ తాతలు, తండ్రులకు పూర్తి స్థాయిలో తెలిసి ఉండవచ్చు. కానీ తమకు తెలిసినవాటి వివరాలు దేవాదాయ శాఖ అధికారులకు తెలియచేసినట్లు ఆలయ ధర్మకర్త ఫౌండర్ సీతారామాచార్యులు పేర్కొంటున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలోని
భూములు స్వాధీనం..
స్వామివారికి మహబూబ్‌నగర్ జిల్లా కేశవపూర్‌లో ఆస్తులు ఉన్నట్లు ఆ జిల్లాకు చెందిన ఓ భక్తుడు ఆలయ అధికారులకు అప్పట్లో సమాచారం ఇచ్చారు. ఈ మేరకు స్పందించిన ఆలయ అధికారులు మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌కు వెళ్లి స్వామివారి ఆస్తులు సదరు గ్రామంలో ఉన్నట్లు ఆ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన స్పందించి రికార్డులను పరిశీలించారు.
ఆ భూములను స్వామివారికి పూర్తి స్థాయిలో కేటాయిస్తూ అనంత పద్మనాభస్వామి పేరిట దస్తావేజులు తయరు చేసి ఆలయ అధికారులకు అందచేశారు. ఈ మేరకు మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలం కేశవపూర్‌లోని సర్వే నంబర్ 105లోని 8.03 ఎకరాల భూమిని ఇటీవల స్వాధీనం చేసుకున్నట్లు దేవాలయ ఈవో శేఖర్ గౌడ్ చెప్పారు. కొంత కాలంగా కబ్జాలో ఉన్న వారే ఆ భూములను మూడేళ్లపాటు కౌలుకు తీసుకొని డబ్బులు చెల్లించారు.
కాగా.. స్వామివారికి చెందిన మరికొన్ని ఆస్తులు ఇటీవల రంగారెడ్డి జిల్లాలోని షాబాద్, ధారూరు మండలం అల్లీపూర్‌లో ఉన్నట్లు ఆలయ అధికారుల దృష్టికి వచ్చినట్లు సమాచారం. వీటిని స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అనంతపద్మనాభుడికి జిల్లాలోనే కాకుండా మెదక్, హైదరాబాద్, మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఉన్నట్లు భక్తులు చెబుతుండడం గమనార్హం. ఈ విషయంపై ఉన్నతాధికారుల దృష్టి సారిస్తే మరిన్ని ఆస్తులు వెలికి వచ్చే అవకాశం ఉందని భక్తులు అంటున్నారు.