
చిన్నారులు శవమయ్యారు..
పెళ్లి వేడుకలు చూసేందుకు వెళ్లి అదృశ్యమైన చిన్నారులు ఇద్దరు బావిలో శవమై తేలారు.
బావిలో మృతదేహాలు లభ్యం..
- మృతిపై అనుమానాలు
- శోకసంద్రంలో కుటుంబ సభ్యులు
- ధర్మారావుపేటలో విషాదం
కాసిపేట : పెళ్లి వేడుకలు చూసేందుకు వెళ్లి అదృశ్యమైన చిన్నారులు ఇద్దరు బావిలో శవమై తేలారు. కొడుకులు తిరిగొస్తారనుకున్న ఆశలు ఆవిరై.. తల్లిదండ్రులకు గర్భశోకం మిగిలింది. వీరి మరణం మిస్టరీగా మారింది. మండలంలోని ధర్మరావుపేటకు చెందిన సంగెపు బాపు, లక్ష్మి దంపతుల కుమారుడు సంతోష్(8), మంచిర్యాల మండలం రాపల్లికి చెందిన ఆనె స్వామి, అమృత దంపతుల కుమారుడు విజయ్(8) బుధవారం రాత్రి గ్రామంలో జరి గిన ఓ వివాహ వేడుక చూసేందుకు వెళ్లి అదృశ్యమైన విషయం తెలిసిందే.
సంగెపు లక్ష్మి తమ్ముడి కుమారుడు విజయ్. సంతోష్, విజ య్‌లు వరుసకు బావబావమరిది అవుతారు. ఇద్దరు కలిసి పెళ్లి వేడుక చూసేందుకు వెళ్లి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు గురువా రం రోజంతా గాలించారు. అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గ్రామంలో విచారణ జరిపినా ప్రయోజనం లేకపోయింది. వివాహ వేడుక జరిగిన ఇంటి సమీపంలో ఉన్న పాడుబడిన బావిలో శుక్రవారం సంతోష్, విజయ్ మృతదేహాలు లభ్యమయ్యారు. కాగా, బాపు కాసిపేట గనిలో సింగరేణి కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు.
ఆయనకు ఇద్దరు భార్యలు కాగా.. సంతోష్ చిన్న భార్య కుమారుడు. పెద్ద భార్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. సంతోష్ కాసిపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. రాపల్లికి చెందిన స్వామి కూలీ పనులు చేస్తున్నాడు. విజయ్ రాపల్లిలోని పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని దేవాపూర్ ఎస్సై కర్ర స్వామి తెలిపారు. కాగా, చి న్నారుల మృతితో గ్రామంలో విషాదం నెల కొంది. కుటుంబ సభ్యుల రోదన మిన్నంటింది. మృతుల కుటుంబాలను ఎంపీపీ ముదం శంకరమ్మ, జెడ్పీటీసీ సభ్యుడు రౌతు సత్తయ్య, సర్పంచు జాదవ్ లలిత పరామర్శించారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
చిన్నారులు మృతిచెందిన బావిని, మృతదేహాలను బెల్లంపల్లి డీఎస్పీ రమణారెడ్డి, మందమర్రి సీఐ సదయ్య శుక్రవారం పరిశీలించారు. సంఘటనపై కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు.
మృతిపై అనుమానాలు
చిన్నారుల మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులను ఎవరో బావిలోకి తోసి ఉంటారని, లేదా చంపి పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కుటుంబ కలహాలూ కారణమై ఉండొచ్చని, పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని అంటున్నారు. మృతదేహాలు లభించిన బావిలో గురువారం ఉదయం కుటుంబసభ్యులు, స్థానికులు, మధ్యాహ్నం పోలీసులు పాతళగరిగె వేసి వెతికినా దొరకలేదు. కానీ శుక్రవారం అదే బావిలో మృతదేహాలు లభించడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది.