
పెంపకం కష్టమే.బ్యాలెన్స్ చాలా అవసరం. మొక్కను నిటారుగా నిలబెట్టడానికి ముళ్ల కర్ర అవసరమే. మొక్క బలంగా ఉండడానికి గారాబమూ అవసరమే. వీటిలో ఏది అదుపు తప్పినా పిల్లలు.. ఇల్లు పీకి విడాకులు వేయొచ్చు!
‘తాతీ’...‘ఏంటి చిన్నా’...‘ఐస్‌క్రీమ్ కావాలి’‘చలో’‘తాతీ..’‘ఏం కావాలి?’‘బ్యాటరీ కార్’‘చిన్నదేగా’‘కాదు.. మొన్న విశ్వ కొనుక్కున్నాడే. కూచుని నడిపేది’‘పది వేలు ఉంటుంది. ఏం పర్లేదు. పదా’ఇంట్లో తాత ఉన్నాడు. మనవడు ఉన్నాడు. మనవడు అడిగింది తాత ఆఘమేఘాల మీద ఏర్పాటు చేస్తున్నాడు. ఆ మురిపెం నాన్నమ్మ చూస్తూ ఉంది. ఆ వేడుకకు కొడుకు ముచ్చట పడుతున్నాడు. కాని ఆ ఇంట్లో ఇంకో సభ్యురాలు కూడా ఉంది.ఆ ఇంటి కోడలు... ఆ పిల్లవాడి తల్లి.‘డాక్టర్... నా భార్యకు పిచ్చెక్కింది. నాకు సాధారణంగా కోపం రాదు. డివోర్స్ ఇవ్వాలన్నంత కోపం వస్తోంది’ సుకుమార్ అన్నాడు. రాణి తల వొంచుకుని కూచుని ఉంది.
‘నాకు మంచి ఉద్యోగం ఉంది. సొంత ఇల్లు ఉంది. మా అమ్మా నాన్న కూతురుతో సమానంగా చూసుకుంటారు. నేను కూడా ఒక్క కష్టం పెట్టలేదు. కాని వేరు కాపురం పెట్టాల్సిందే అని పట్టుపడుతోంది. ఏం చేయమంటారు’ అన్నాడు సుకుమార్.‘ఏమంటావు రాణి’ అంది లేడీ సైకియాట్రిస్ట్.‘వేరు కాపురమే డాక్టర్. లేదంటే డివోర్స్ కూడా రెడీయే. నా పిల్లవాణ్ణి నాతో పంపించేయమనండి చాలు’ అంది రాణి.సుకుమార్ నెత్తి కొట్టుకున్నాడు.వారు క్లినిక్‌లో ఉన్న సమయానికి మనవడితో తాత, నానమ్మ ఇంట్లో ఆడుకుంటూ ఉన్నారు.‘తాతీ.. నాకు స్విగ్గీ నుంచి చికెన్ మెజెస్టిక్ తెప్పించు’‘ఏయ్... ఎందుకురా బయటి ఫుడ్డు.
సాయంత్రం నేనే చేసి పెడతాను’ అంది రాణి.‘వద్దు. నాకు స్విగ్గీదే కావాలి... ఊ..ఊ... కావాలి’ టీపాయ్ మీదున్న వస్తువు కింద విసిరి కొట్టాడు. పేపర్లు చింపేశాడు. సోఫా మీద గెంతులేస్తున్నాడు. పెద్దగా ఏడుస్తున్నాడు.తాత, నానమ్మ పరిగెత్తుకుంటూ వచ్చారు.‘మీ అమ్మ అంతేరా చిన్నా... బ్యాడ్ అమ్మ. నేను తెప్పిస్తాను పద’రాణి నిస్సహాయంగా చూస్తూ నిలుచుంది.‘చిన్నా.. ట్యూషన్‌కు టైమ్ అవుతోంది. త్వరగా స్నానం చెయ్’... సాయంత్రం అయిదవుతుంటే స్కూల్ నుంచి వచ్చి అప్పటికే గంటైపోయిన చిన్నాని ఆదేశించింది రాణి.చిన్నా కదల్లేదు. టీవీలో కార్టూన్ షో చూస్తూ ఉన్నాడు.‘నీకే చెప్పేది’‘నేనివాళ వెళ్లను’‘వెళ్లవా. రెండు పీకుతాను’అంతే. వెంటనే చిన్నా ఏడుపు మొదలెట్టాడు. అల్లరి మొదలెట్టాడు. కింద పడి దొర్లడం మొదలెట్టాడు. తాత, నానమ్మ పరిగెత్తుకుంటూ వచ్చారు.‘వద్దులే నాన్నా... ట్యూషన్ వద్దులే.
మీ అమ్మ అలాగే చెప్తుందిలే. అమ్మని కొడదాం సరేనా’... మనవణ్ణి లేపి తమ గదిలోకి తీసుకెళ్లి అక్కడ టీవీ వేసి కూచోబెట్టారు.ఏదో ఒక నిర్ణయం తీసుకునే సమయం వచ్చినట్టు రాణికి అనిపించింది.‘అది డాక్టర్... జరుగుతున్నది. నేనొక తల్లినని, ఆ పిల్లవాడు నన్ను గౌరవించాలని ఆ ఇంట్లో లేకుండా పోయింది. వాణ్ణి బాగా గారం చేసి చెడగొట్టారు. వాడికి డిజప్పాయింట్‌మెంట్ అంటేనే తెలియదు. ‘నో’ అనే మాట వింటేనే చాలా అల్లరి చేస్తున్నారు. ఎవరి మాట వినడం లేదు. అసలు వాడు పూర్తిగా ఏదో అయిపోతున్నాడు. ఏడేళ్ల వయసులోనే ఇలా ఉంటే పోను పోను ఏమవుతాడో. ఇంట్లో జరిగే గారాలకు బయట కూడా ఇలాగే బిహేవ్ చేస్తే ఎవరూరుకుంటారు?’ అంది రాణి.లేడీ సైకియాట్రిస్ట్ రాణి అత్త, మామలను పిలిచి మాట్లాడింది.మామగారు అన్నారు–‘డాక్టర్.. నాకు ముగ్గురు అబ్బాయిలు.
వాళ్లు పుట్టినప్పుడు పెరుగుతున్నప్పుడు నాకు చిన్న ఉద్యోగం. వారి ఏ అచ్చటా ముచ్చటా తీర్చలేదు. కనీసం వారితో టైమ్ కూడా స్పెండ్ చేయలేదు. ఇప్పుడు దేవుడి దయ వల్ల మంచి పొజిషన్‌లో ఉన్నాడు. చిన్నా నా మొదటికొడుకు బిడ్డ. మా ఇంట్లో మొదటి మనవడు. అందుకని కొంచెం గారాబం చేస్తున్నాం. ఇందులో ఏదైనా తప్పుందంటారా?’ అన్నాడాయన.సుకుమార్‌ను అడిగింది సైకియాట్రిస్ట్ ‘వీళ్ల గారాబం వల్ల రాణి ఇబ్బంది పడుతోందని మీరు గమనించారా?’‘పెద్దగా లేదు డాక్టర్. ఇదంతా మామూలే కదా. నా కొడుక్కు మంచి గారాబం దక్కుతోంది కదా అనుకున్నాను. నేను ఇవన్నీ పొందలేదు నా చిన్నప్పుడు’‘చూశారా... చిన్నా విషయంలో మీరూ, మీ నాన్న, మీ అమ్మ ఒకవైపు; మీ భార్య ఒక వైపు ఉన్నారు.
పిల్లల్ని ముద్దుగా చూసుకోవాలని, శ్రద్ధగా పెంచుకోకూడదనీ ఎవరూ అనరు. కాని ఆడింది ఆటా పాడింది పాటగా ఎదిగితే రేపు సమాజం నిజ స్వరూపం తెలిసి డిస్ట్రబ్ అవుతారు. చిన్న ఓటమి కూడా భరించలేని పరిస్థితికి వస్తారు. ఫెయిల్యూర్ అంటే ఏమిటో తెలియకుండా పెంచడం వల్ల ఇవాళ చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యల వరకూ వెళుతున్నారు. మీ చిన్నాకూ ‘ఎస్’తో పాటు ‘నో’ కూడా నేర్పాలి. పాస్‌తో పాటు ఫెయిల్ కూడా తెలియచేయాలి. అన్నింటికంటే ముఖ్యంగా వాడు వాళ్ల తాతయ్య, నానమ్మతో ఆడటంతో పాటు తన ఈడు పిల్లలతో ఆడేలా చేయాలి’ అని అర్థమయ్యేలా చెప్పింది సైకియాట్రిస్ట్.ఆ తర్వాత రాణితో అంది–‘చూడమ్మా.. నువ్వు మీ అత్తామామల వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే చూస్తున్నావు.
ఇవాళ ఎంతమంది పిల్లలకు నానమ్మ, తాతయ్య తోడు దొరుకుతోంది? వాళ్లు నీ కొడుకును చూసుకోవడంలో నీకు సహాయంగా ఉంటున్నారు కదా. నీ కొడుక్కు ఇద్దరు కుటుంబ సభ్యుల కంటే నలుగురు కుటుంబ సభ్యులు ఉండటం పెద్ద బలం అని నువ్వు గ్రహిస్తే ఇటువంటి పొరపాట్లను సరిదిద్దుకుని వేరు కాపురం ఆలోచన మానుకుంటావు’రాణి అర్థమైనట్టుగా తల ఊపింది.అప్పుడు లేడీ సైకియాట్రిస్ట్ అందరితోటి అంది–‘ఇటీవల ఇలాంటి కేసులు ఎక్కువయ్యాయి. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులదే ప్రధాన నిర్ణయం కావచ్చు. కాని వారికి తాతయ్య, నానమ్మ, అమ్మమ్మల తోడు దక్కాల్సిన హక్కును ఎవరూ కాదనలేదు.
పెద్దలు గమనించుకుని చర్చించుకుని ముందుకు సాగితే ప్రతి ఇంటి మానవ సంబంధాలు నిలబడతాయి. గట్టి అనుబంధాల మధ్య పెరిగిన పిల్లలు స్థిరమైన వ్యక్తిత్వంతో పెరుగుతారు. కనుక చిన్నా భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది’ అని ముగించింది.రాణి వేరు కాపురం పెట్టలేదు. అందరూ అదే ఇంట్లో ఉంటున్నారు. చిన్నా ఏదైనా అడిగితే ‘మీ అమ్మ ఓకే అంటే చేద్దాం’ అని అనడం తాత అలవాటు చేశాడు. కోడలిని పిల్లవాడి ముందు చిన్నబుచ్చడం మానుకున్నారు. చిన్నాకు కూడా మెల్లగా తన ఆటలు సాగవని అర్థమైంది. ట్యూషన్‌కు వెళ్లనని మారాం చేయకపోయినా ఒక ఐదు నిమిషాలు టీవీ చూసి మరీ ఆలస్యంగా వెళుతున్నాడు.ఇప్పుడా కుటుంబం హ్యాపీ ఫ్యామిలీ.
– కథనం: సాక్షి ఫ్యామిలీ
ఇన్‌పుట్స్: డా. పద్మ పాల్వాయి, సైకియాట్రిస్ట్