దుమ్ముగూడెం: ఖమ్మం జిల్లా సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లా కన్నాయిగూడెం అటవీ ప్రాంతంలో మావోలు, పోలీసులకు మధ్య బుధవారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మిలీషియా సభ్యులు మృతి చెందారు. వివరాలు.. మారాయిగూడెం-గొల్లపల్లి రోడ్డు నిర్మాణ పనుల వద్ద సోమవారం మావోలు అమర్చిన ప్రెషర్ బాంబు పేలి జవాను మడకం జోగా మృతి చెందాడు. దీంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు(డీఆర్‌జీ) బలగాలు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్నాయి. అయితే బుధవారం కన్నాయిగూడెం అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసు బలగాలకు మావోయిస్టులు తారసపడగా.. ఇరువర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
కాల్పుల్లో ధర్మాంగు గ్రామానికి చెందిన తాటి చుక్కా, కన్నాయిగూడెం గ్రామానికి చెందిన పొడియం దేవా అనే మిలీషియా సభ్యులు మృతి చెందారు. కాల్పుల తర్వాత మావోయిస్టులు పారిపోగా.. ఆ ప్రదేశంలో పోలీసులకు రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిని తాటి చుక్కా, పొడియం దేవాగా గుర్తించినట్లు డీఆర్‌జీ అమిత్, హెచ్‌సీ మడకం ముద్దరాజు తెలిపారు. కాగా, సంఘటనా ప్రదేశంలో రెండు తపంచాలు, డిటొనేటర్లు, బ్యాటరీలు, 150 మీటర్ల విద్యుత్ వైరు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.