సాక్షి, వరంగల్ రూరల్: లోకసభ ఎన్నికల సందడి మొదలైంది. డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు, జనవరిలో నిర్వహించిన సర్పంచ్ ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేసిన జిల్లా అధికార యంత్రాం గం లోకసభ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం సూచనలతో జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇప్పటికే మొదటి దఫా ఈవీఎంల పరిశీలన పూర్తయింది. వివిధ రాజ కీయ పార్టీ నాయకుల సమక్షంలో ఈవీఎంలను అధికారులు పరిశీలించారు. జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు లోకసభ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి.
పరకాల అసెంబ్లీ నియోజకవర్గం వరంగల్ లోకసభ పరిధిలో, నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గం మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. కేంద్ర ఎన్నికల సంఘం మే నెలలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని చేపట్టింది. జనవరి 1, 2019 నాటికి 18 సంవత్సరాలు నిండినవారు ఓటు హక్కు నమోదు చేయించుకునే అవకాశం కల్పించింది. మొదట జనవరి 25వరకు ఓటు నమోదు చేర్పులు, మార్పులకు అవకాశం కల్పించగా దానిని ఎన్నికల సంఘం ఫిబ్రవరి 4 వరకు ఓటరు నమోదు చేసుకున్న తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా తుది జాబితాలను సైతం జిల్లా యంత్రాంగం ప్రకటించారు. అలాగే మార్చి 2, 3వ తేదీల్లో ఓటరు నమోదు కోసం ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తున్నారు.
వీవీ ప్యాట్‌లపై అవగాహన..
ప్రజల్లో వీవీ ప్యాట్‌పై అవగాహన కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలోని 16 మండలాలకు ఒక్కో మండలం మొబైల్ వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఈ వాహనంలో వీవీ ప్యాట్లను ఉంచుతున్నారు. ఈ మొబైల్ వాహనాన్ని సోమవారం కలెక్టర్ హరిత ప్రారంభించారు. రోజుకు ఒక్క గ్రామం చొప్పున నెల రోజుల పాటు గ్రామాల్లో తిరిగి వీవీ ప్యాట్‌లపై అవగాహనతోపాటు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించనున్నారు.
ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు కమిటీలు..
జిల్లాలో లోకసభ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లాలో 20 కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలో ఒక్కో జిల్లా అధికారికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు ఈ కమిటీలు కృషి చేయనున్నాయి. ఎన్నికలు పూర్తయి ఫలితాలు విడుదలయ్యే వరకు కమిటీలు పూర్తిస్థాయిలో ఎన్నికల నిర్వహణపై దృష్టి కేంద్రీకరించనున్నారు. ఆయా కమిటీలతో నిత్యం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హరిత సమావేశాలు నిర్వహిస్తున్నారు. అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment