
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: ఈ నెలలోనే మరో ఎన్నికల సమరానికి తెర లేవబోతోంది. ఏప్రిల్‌లో జరగాల్సిన లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నాలుగు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాల సవరణ కార్యక్రమం వేగంగా సాగుతోంది. మ్యాన్యువల్‌గా వచ్చిన ఓటరు దరఖాస్తులను జాబితాలో చేర్చడం ఇప్పటికే పూర్తయింది. ఇక ఆన్‌లైన్ ద్వారా వచ్చిన ఓటరు దరఖాస్తులను జాబితాల్లోకి ఎక్కించే తంతు ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశాలు అందాయి.
తుది ఓటర్ల జాబితాను ఈ నెల 22న గ్రామాల్లో బూత్‌ల వారీగా ప్రచురించనున్నారు. ఓటర్ల తుది జాబితా వెలువడిన రెండు మూడు రోజుల్లో పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ విడుదల చేస్తుంది. రాజకీయ పార్టీల సమాయత్తంఅసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితితోపాటు కేవలం ఆసిఫాబాద్‌లోనే విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ కూడా లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో పెద్దపల్లి సీటు ఇప్పటికే ఖాళీ అయింది.
అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచిన బాల్క సుమన్ ఎంపీగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆదిలాబాద్‌లో టీఆర్‌ఎస్ ఎంపీ గోడెం నగేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ రెండు సీట్లలో వచ్చే ఎన్నికల్లో మరోసారి విజయ బావుటా ఎగరవేయాలని టీఆర్‌ఎస్ నేతలు చూస్తున్నారు. టీఆర్‌ఎస్ అధిష్టానం ఎంపీలను గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలపైనే పెట్టే అవకాశం ఉండడంతో వారిపై భారం పడనుంది. అదే సమయంలో కాంగ్రెస్ నాయకులు కూడా మొన్నటి ఎన్నికల్లో లభించిన ఓట్ల లెక్కలను సరిచూసుకుంటూ గెలుపు అవకాశాలపై అంచనాలు వేసుకుంటున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన నలుగురు కొత్త అధ్యక్షులు పార్టీని ముందుండి నడిపించి విజయ తీరాలకు చేర్చాలనే కృత నిశ్చయంతో ఉండడం కలిసి వచ్చే అంశం.
అభ్యర్థులు ఎవరో..?
ఆదిలాబాద్‌లో సిట్టింగ్ ఎంపీ గోడం నగేష్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనను మార్చకపోవచ్చు. కాంగ్రెస్ అభ్యర్థిగా మొన్నటి ఎన్నికల్లో బోథ్ నుంచి ఓడిపోయిన సోయం బాపూరావును బరిలోకి దింపే ఆలోచన ఉన్నట్లు సమాచారం. అయితే ఒకరిద్దరు అధికారి స్థాయిల్లో రిటైర్డ్ అవుతున్న వారు కూడా ఎంపీ టికెట్టుపై పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇక పెద్దపల్లిలో సిట్టింగ్ ఎంపీ అసెంబ్లీకి వెళ్లడంతో ఖాళీ అయిన సీటును ఎవరికి కేటాయిస్తారనే విషయంలో ఆసక్తికర చర్చ సాగుతోంది. మాజీ ఎంపీ వివేకానందను బరిలోకి దించాలని గత ఎన్నికల ముందు వరకు కేసీఆర్ భావించినప్పటికీ, ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయనకు బదులు వేరే అభ్యర్థిని బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
మాల వర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారనే పేరు లేకుండా మాదిగ వర్గానికి చెందిన వ్యక్తిని టీఆర్‌ఎస్ అభ్యర్థిగా నిలబడతారనే ప్రచారం జరుగుతోంది. పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి ఇప్పటి వరకు కేవలం సుగుణకుమారి ఒక్కరే మాదిగ వర్గం నుంచి గెలిచిన ఎంపీ. ఈసారి మరోసారి మాదిగ వర్గం నాయకుడిని పోటీలో నిలపాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలిసింది. ఇక కాంగ్రెస్‌లో సీటు కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య భారీగానే ఉంది. గతంలో ఇక్కడి నుంచి పోటీచేసిన గోమాస శ్రీనివాస్, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరులో ఓడిపోయిన బోర్లకుంట వెంకటేష్ నేత, కరీంనగర్ పాత జిల్లా పరిధిలోకి ఒకరిద్దరు కాంగ్రెస్ నేతలు ఈ సీటును ఆశిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి పరిధిలో గట్టిపోటీ
శాసనసభ ఎన్నికల్లో ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్ పార్టీ టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇచ్చింది. రెండు లోక్‌సభ నియోజకవర్గాలలో ఒక్కో సీటును కాంగ్రెస్ గెలుచుకుంది. కొన్ని స్థానాల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయింది. పెద్దపల్లి లోక్‌సభలో కీలకమైన మంథని అసెంబ్లీ సీటును కాంగ్రెస్ మంచి మెజారిటీతో గెలుచుకోవడం గమనార్హం. రామగుండంలో ఫార్వర్డ్‌బ్లాక్ అభ్యర్థిగా పోటీచేసిన కోరుకంటి చందర్ విజయం సాధించగా, ఇక్కడ కాంగ్రెస్ మూడో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ ఓట్లు కూడా చందర్‌కే పడడంతో ఇక్కడ కాంగ్రెస్‌కు తక్కువ ఓట్లు నమోదయ్యాయి. ధర్మపురిలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు అంచుల దాకా వచ్చి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు.
మంచిర్యాలలో కాంగ్రెస్ కేవలం 4వేల ఓట్ల తేడాతో ఓడింది. బెల్లంపల్లిలో కాంగ్రెస్ పోటీ చేయకపోగా, ఆ పార్టీ మద్ధతుదారులు బీఎస్‌పీ అభ్యర్థి గడ్డం వినోద్‌కు మద్దతుగా నిలిచారు. చెన్నూరు, ఇక ఆదిలాబాద్ లోక్‌సభ పరిధిలో ఆసిఫాబాద్ సీటును కాంగ్రెస్ స్వల్ప మెజారిటీతో గెలుచుకోగా, బోథ్, నిర్మల్ సీట్లలో గట్టిపోటీ ఇచ్చింది. ఆదిలాబాద్, ఖానాపూర్, ముథోల్‌లలో మాత్రం కాంగ్రెస్‌కు ఘోర పరాజయం ఎదురైంది. ఆదిలాబాద్, ముథోల్‌లలో కాంగ్రెస్ మూడోస్థానానికి చేరడం అనూహ్య పరిణామం. పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 4,63,150 ఓట్లు సాధించగా, కాంగ్రెస్ 3,75,023 ఓట్లు సాధించింది. ఈ పార్లమెంటు పరిధిలోని ఏడు స్థానాల్లో కలిపి కాంగ్రెస్‌కు, టీఆర్‌ఎస్‌కు మధ్య కేవలం 88 వేల ఓట్ల తేడానే. బెల్లంపల్లిలో పోటీ చేసి ఉంటే అది ఇంకా తగ్గేది. కాగా ఆదిలాబాద్‌లో మాత్రం రెండు పార్టీలకు లభించిన ఓట్ల మధ్య తేడా లక్షకు పైగా ఉంది. ఇక్కడ టీఆర్‌ఎస్‌కు 5,14,936 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 3,65,401 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.