త్వరలో 24 గంటల నాణ్యమైన విద్యుత్: కేసీఆర్
జహీరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మెదక్ జిల్లా జహీరాబాద్లో మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ ప్లాంట్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన కంపెనీ రూపొందించిన నూతన వాహనాన్ని స్వయంగా నడిపి లాంచ్ చేశారు. ప్రభుత్వం నుంచి అన్నివిధాల సాయం అందుతుందని కేసీఆర్ తెలిపారు. నూతన పారిశ్రామిక విధానం అత్యంత పారదర్శకంగా ఉంటుందని ఆయన తెలిపారు. పరిశ్రమల స్థాపనకు ఇక పైరవీలు చేయాల్సిన పనిలేదని, త్వరలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ను అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
విద్యుత్ కోతలు ఉండవని, అందువల్ల పరిశ్రమలను విస్తరించుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇప్పటికైతే విద్యుత్ కష్టాలు లేవని, భవిష్యత్లో కూడా ఆ సమస్య ఉండదన్నారు. తెలంగాణలో కరెంట్ కోతల ప్రసక్తే లేదని కేసీఆర్ అన్నారు. ఇక పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, ఈ మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ ప్లాంట్ సంవత్సరానికి 90 వేల వాహనాలను అందుబాటులోకి తేనుంది.