మళ్లీ కరెంటు కొనుడే!
* ఎంత ఖర్చయినా సరే విద్యుత్ కొనుగోలు చేయండి
* పరిశ్రమలు, వ్యవసాయానికి ఇబ్బంది రావద్దు
* కేరళ, తూర్పు గ్రిడ్ నుంచి విద్యుత్‌కు ప్రయత్నించండి
* విద్యుత్‌శాఖ అధికారులతో సమీక్షలో సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండల పెరగడంతో విద్యుత్ కొరత పెరిగిపోయింది. ఈ వారంలో దినసరి విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా 147 మిలియన్ యూనిట్లకు చేరింది. డిమాండ్‌తో పోలిస్తే ప్రతిరోజూ 800 మెగావాట్ల విద్యుత్ లోటు నెల కొంది. దీన్ని అధిగమించేందుకు రూపొందిం చాల్సిన ప్రణాళికలు, తక్షణం చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం సచివాలయంలో ఇంధనశాఖ, టీఎస్ జెన్‌కో అధికారులతో సమీక్షించారు. కొరతను అధిగమించేందుకు ప్రతి రోజూ విద్యుత్ ఎక్ఛేంజీల నుంచి 4 నుంచి 5 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొంటున్నట్లు అధికారులు సీఎంకు వివరించగా కొనుగోలుతోపాటు విద్యుత్ కోతలను అధిగమించే మార్గాలన్నింటినీ అనుసరించాలని సీఎం ఆదేశించారు.
తూర్పు విద్యుత్ గ్రిడ్‌లో ఉన్న కేరళలోని కాయంకూళం నుం చి విద్యుత్‌ను తెచ్చుకునే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఎంత ఖర్చయినా వెనుకాడకుండా రాష్ట్రంలో వ్యవసాయం, పరిశ్రమలకు ఇబ్బంది తలెత్తకుండా విద్యుత్‌ను సరఫరా చేయాలని సీఎం ఆదేశించారు. సౌర విద్యుత్‌తో పరిస్థితిని మెరుగుపరిచే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. నల్లగొండ జిల్లాలో నిర్మించ తలపెట్టిన దామరచెర్ల పవర్ ప్లాంట్‌కు సంబంధించిన పురోగతిని సమీక్షించారు. సమావేశంలో ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, టీఎస్‌జెన్‌కో చైర్మన్ డి.ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.
సీఎంను కలిసిన అమెరికా కంపెనీల ప్రతినిధులు
అమెరికాకు చెందిన థింక్ క్యాపిటల్, థింక్ ఎనర్జీ కంపెనీల చైర్మన్లు డి. రవిరెడ్డి, ప్రశాంత్ మిట్టా గురువారం సీఎం కేసీఆర్‌ను కలుసుకున్నారు. వృథాజలాలతో ఇంధనం తయారీతోపాటు సౌర విద్యు త్, గ్యాస్ అధారిత విద్యుదుత్పత్తి పరిజ్ఞానం తమ సంస్థలకు ఉందని.. వీటి ద్వారా రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలని భావిస్తున్నట్లు వివరించారు. ఇందుకు అవకాశాలు, అనుమతులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తామని హామీ ఇచ్చారు.
యాదగిరీశుడికి నేడు పట్టువస్త్రాలు
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ శుక్రవారం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొని పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఉదయం 10.50 గంటల సమయంలో ఆయన గుట్టకు చేరుకుంటారని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.