ఛత్తీస్‌గఢ్‌కు కేసీఆర్..?
విద్యుత్ సరఫరాకు ప్రత్యామ్నాయాలు.. లైన్లపై అధ్యయనం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. విపక్షాల నుంచి వరుసగా వెల్లువెత్తిన విమర్శల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ స్వయంగా ఛత్తీస్‌గఢ్ బయల్దేరనున్నారు. తెలంగాణకు వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ను ఇచ్చేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య పరస్పర అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకోవాల్సి ఉంది. ఇందుకోసం సీఎం కేసీఆర్ అక్కడి సీఎం రమణసింగ్‌ను కలుసుకోనున్నట్లు టీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. అదే పర్యటనలో ఛత్తీస్‌గఢ్ నుంచి వీలైనంత తొందరగా రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేసేందుకు ఉన్న ప్రత్యామ్నాయాలు, కీలకమైన విద్యుత్తు లైన్ల రూట్లను అధ్యయనం చేయనున్నట్లు సమాచారం. వారంలో కేసీఆర్ ఛత్తీస్‌గఢ్ పర్యటన ఉండే అవకాశాలున్నాయని సీఎం కార్యాలయ వర్గాల ద్వారా తెలిసింది.