ఖమ్మంక్రైం: నగరంలో నిత్యం 25వేల ఆటోలు తిరుగుతున్నాయి. బయటి ప్రాంతాల నుంచి 10వేల వరకు నగరానికి వస్తుండగా.. ఖమ్మంలోనే 15వేల వరకు ఆటోలు ఉన్నాయి. కూసుమంచి మండలంలో ఒక్కో గ్రామంలో 20 నుంచి 30 వరకు ఆటోలు ఉన్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడ, మోతె, మహబూబాబాద్ జిల్లా కురవి, డోర్నకల్, మరిపెడ, ఖమ్మం రూరల్ మండలం, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, రఘునాథపాలెం, కామేపల్లి, కొణిజర్ల, చింతకాని ప్రాంతాల నుంచి ఆటోలు నిత్యం ప్రయాణికులతో వచ్చిపోతుంటాయి. పొద్దంతా నగరంలోని ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతూ.. సాయంత్రం ఇంటిబాట పడతాయి.
ఆటో స్టాండ్‌లు కరువు
నగరంలో రోజూ వేలాది ఆటోలు తిరుగుతున్నా కార్పొరేషన్ అధికారులు కనీసం ఒక్క ఆటో స్టాండ్‌ను ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. రైల్వే స్టేషన్‌లో ఉన్న ఆటో స్టాండ్ తప్ప నగరంలో ఎక్కడా ఆటో స్టాండ్‌లు కనిపించవు. తప్పని పరిస్థితుల్లో ఆటోవాలాలు 20 స్టాండ్‌లు ఏర్పాటు చేసుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్ ప్రాంతంలో కనీసం ఇప్పటివరకు ఆటో స్టాండ్ ఏర్పాటు చేయలేదు. ముఖ్యంగా బస్టాండ్, రైల్వేస్టేషన్, కాల్వొడ్డు, నయాబజార్, మయూరిసెంటర్, జెడ్పీ సెంటర్, వైరారోడ్, ఇల్లెందు క్రాస్‌రోడ్, గాంధీచౌక్, వ్యవసాయ మార్కెట్ ప్రాంతం ఆటోలతో రద్దీగా మారిపోయింది. నగరంలో నిమిషానికి 33 ఆటోలు ప్రధాన రహదారుల వెంట వెళ్తున్నాయి. హైదరాబాద్, వరంగల్ తర్వాత ఆటోల సంఖ్యలో ఇక్కడే ఎక్కువగా ఉంది.
ఎందుకంత క్రేజ్..
నగరంలోనే 25వేల ఆటోలు తిరుగుతున్నాయంటే దానికి కారణం.. ఖమ్మంకు 60 కిలోమీటర్ల దూరం నుంచి నిత్యం పనులపై వచ్చి వారి సంఖ్య ఎక్కువే. వీరంతా బస్సుల్లో రావాలంటే వాటికోసం వేచిచూసే ఓపిక లేకపోవటం.. సమయం వృథా చేయటం ఎందుకని ఆటోల్లో బయలుదేరుతున్నారు. దీనికి తోడు ఇళ్ల ముందుకే ఆటోలు వచ్చే సదుపాయం ఉండటంతో ఎక్కువగా వీటినే ఆశ్రయిస్తున్నారు.
నిరుద్యోగులకు ఉపాధి..
ఆటోల సంఖ్య పెరగడంతో చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి లభిస్తోంది. కొందరు చదువుకుంటూ పార్ట్‌టైంగా ఆటోలు నడుపుతుండగా.. మరికొందరు పొట్టకూటి కోసం నడుపుతున్నారు. దీంతో అద్దెకు ఆటోలు ఇచ్చే యజమానికి రోజుకు రూ.300 చొప్పున చెల్లించి.. ఆటోలు నడిపేందుకు తీసుకెళ్తున్నారు. చాలా మంది గ్రామాల నుంచి వచ్చి ఆటోలను నడుపుతూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు.
రిజిస్ట్రేషన్లు తగ్గించాలి..
ఖమ్మం నగరంగా మారినప్పటికీ 40, 50 ఏళ్ల క్రితం ఉన్న రోడ్లే ఉన్నాయి. నిత్యం నగరంలో 25వేల ఆటోలు తిరుగుతున్నాయి. వీటికి ఆటో స్టాండ్‌లు లేవు. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ ఆటోలు నిలుపుతున్నారు. ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. ఆటోల రిజిస్ట్రేషన్ తగ్గించాలని రవాణా శాఖ అధికారులకు ఇప్పటికే సూచించాం. ఆటో స్టాండ్‌లు ఏర్పాటు చేయాలని కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. దీనికి తోడు నగర రోడ్లు కూడా వెడల్పు చేయాలి.
– నరేష్‌రెడ్డి, ట్రాఫిక్ సీఐ
1994 నుంచి ఆటో నడుపుతున్నా..
నేను 1994 నుంచి ఆటో నడుపుతున్నా. అప్పుడు 80 ఆటోలు ఖమ్మంలో తిరిగేవి. ఇప్పుడు 25వేల ఆటోలు తిరుగుతున్నాయి. అప్పుడు సర్వీస్ చార్జీ రూ.2 ఉండేది. ఇప్పుడు రూ.10 అయింది. డీజిల్ ఖర్చు పెరిగింది. ఒక్క ప్యాసింజర్‌కు దాదాపు 20 ఆటోలు పోటీపడుతున్నాయి. కుటుంబం గడిచే పరిస్థితి లేదు. ఆటోల రిజిస్ట్రేషన్ తగ్గించి.. ఆటో స్టాండ్‌లను ఏర్పాటు చేయాలి. బి.లక్ష్మణ్‌కుమార్, ఆటో డ్రైవర్
ఆటోలు మరీ ఎక్కువయ్యాయి..
ఎన్నో ఏళ్లుగా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నా. నగరంలో ఆటోలు ఎక్కువ కావటంతో గిరాకీ బాగా తగ్గింది. ఒకప్పుడు జీవనాధారం కోసం ఆటో నడిపా. ఇప్పుడు కిరాయిలు లేక ఖాళీగా కూర్చుంటున్నాం. పోలీసులు జరిమానాలు బాగా విధిస్తున్నారు. లారీ డ్రైవర్లు, హమాలీలు సైతం ఆటోలు నడుపుతున్నారు. వేరే ప్రాంతాల నుంచి వచ్చే వాటిని ఇక్కడ నడపకుండా చూడాలి. షేక్ కరీం, ఆటో డ్రైవర్
Comments
Please login to add a commentAdd a comment