
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీసీ సంక్షేమం, అభివృద్ధిపై డిసెంబర్ 3న సీఎం కె.చంద్రశేఖర్‌రావు సమీక్షించనున్నారు. ఈ సమావేశంలో బీసీలకు ప్రత్యేక ఆర్థిక, అభివృద్ధి పథకాలకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. ఆ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లు, ప్రణాళికలపై అధికారులతో మంగళవారం మంత్రులు ఈటల రాజేందర్, జోగు రామన్న, తలసాని శ్రీనివాసయాదవ్, పద్మారావు గౌడ్ సమీక్షించారు.
ఈ సందర్భంగా బాగా వెనుకబడిన కులాల అభివృద్ధి కోసం తీసుకురావాల్సిన పథకాలపై చర్చించారు. గొర్ల పంపిణీ ద్వారా గొల్ల, కురుమలు, మిషన్ కాకతీయ వల్ల నిండిన చెరువుల్లో చేపలను పెంచడం ద్వారా మత్స్యకారులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. బీసీల్లో ఉపాధి లేని వారికి, కుల వృత్తులనే నమ్ముకుని బ్రతుకుతున్న కుటుంబాల అభివృద్ధికి కొన్ని పథకాలను సిద్ధం చేశారు.
ఇవన్నీ 3న జరిగే సమావేశంలో సీఎంకు సమర్పించి తుది రూపు తీసుకురానున్నట్లు వెల్లడించారు. కుల వృత్తులు చేయడం ఇష్టంలేని వారికి, ఆయా వర్గాల్లో చదువుకున్న వారు సొంత కాళ్లపై నిలబడటానికి అవసరమైన ఆర్థిక సాయం ఏ విధంగా అందించాలి అనే అంశంపై కూడా చర్చించారు.