ఆబ్కారీలో రెండేళ్లకు మించి పనిచేస్తున్నవారిపై ఎక్సైజ్ ఈడీ వేటు
సాక్షి, హైదరాబాద్: ఆబ్కారీ శాఖలో అద్దె వాహనాల్లో పనిచేస్తున్న డ్రైవర్లు రోడ్డున పడ్డారు. రాజధానితోపాటు పది జిల్లాల్లోని అధికారులు ఉపయోగిస్తున్న అద్దె కార్లు, జీపులపై రెండేళ్లకు మించి పనిచేస్తున్న డ్రైవర్లను తొలగిస్తూ ఎక్సైజ్ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టర్ అకున్ సబర్వాల్ ఇటీవల ఆదేశాలిచ్చారు. దీంతో సుమారు 20 ఏళ్లుగా పనిచేస్తున్న 350 మందిని విధుల నుంచి తొలగించారు. డ్రైవర్లుగా కొనసాగుతూ అక్రమాల్లో పాలుపంచుకుంటున్నారనే కారణంతో ఈ ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది.
ఎక్సైజ్ శాఖకు అద్దె ప్రాతిపదికన తీసుకున్న వాహనాలకు డ్రైవర్లుగా వీరు కొనసాగుతున్నారు. పోలీస్‌శాఖకు సమకూర్చిన తరహాలోనే ఎక్సైజ్ శాఖకు కూడా సొంత వాహనాలు అందించాలని సీఎం కేసీఆర్‌కు ఆ శాఖ మంత్రి టి.పద్మారావుగౌడ్ కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో అద్దె వాహనాల డ్రైవర్లు తమకు పర్మనెంట్ ఉద్యోగాలు లభిస్తాయని భావించారు. కానీ, అకున్ సబర్వాల్ నిర్ణయం వారికి అశనిపాతంగా మారింది. 20 ఏళ్లుగా సేవచేస్తున్న తమను అర్ధాంతరంగా రోడ్డున పడేశారని డ్రైవర్లు రెండు రోజులుగా ఆబ్కారీ భవన్ వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఎక్సైజ్ హైర్ వెహికిల్స్ డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు, ఉద్యోగులు సంఘం అధ్యక్షుడు ఎ.నర్సింహ, ప్రధాన కార్యదర్శి వి.నరేందర్‌ల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ భానుప్రసాద్‌ను కలసి తమ గోడును వినిపించారు. ప్రభుత్వం సమకూర్చే వాహనాలకు డ్రైవర్లుగా తమకు అవకాశం ఇవ్వాలని వారు కోరారు.
350 మంది డ్రైవర్లు రోడ్డున పడ్డారు!
Published Fri, Mar 4 2016 3:31 AM | Last Updated on Thu, Jul 11 2019 8:43 PM
Advertisement
Advertisement