సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మొత్తం 2.8 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలకు తుది ఓటర్ల జాబితా అందజేస్తామన్నారు. 23 నుంచి 1 డిసెంబర్ వరకు ఓటర్ స్లిప్స్ పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ఫోటో ఓటర్ స్లిప్పులు కూడా ఇస్తామన్నారు. మీడియా సమావేశంలో ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై మాట్లాడారు. ఈ సందర్భంగా రజత్ కుమార్ మాట్లాడుతూ.. 'ఓటింగ్ శాతం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాము. 2014 ఎన్నికలకు 2018 ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల విషయంలో తేడా ఉంది. ఇంకా కొన్ని పోలింగ్ కేంద్రాలను మార్చే అవకాశం ఉంది. 9445 సర్వీస్ ఓటర్లు ఉన్నారు. ఓటర్ల నమోదు పెరిగింది. 1,60,509 మంది ఎన్నికల సిబ్బందిని వినియోగించుకుంటాం. రాష్ట్రంలో 35 వేల మంది పోలీసులు, 18 వేల మంది పోలీసులు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు. 279 సీఆర్‌పీఎఫ్ బలగాలు ఉంటాయి. వీరికి తోడు 20 శాతం సిబ్బంది అదనంగా ఉంటారు. మొత్తం 3583 నామినేషన్లు దాఖలు అయ్యాయి. 3500 కేసులు సీవిజిల్ కు వచ్చాయి. ఎపిక్ కార్డులు పంపిణీ ప్రారంభం అయ్యింది. ఈసేవలో 5 లక్షల కార్డులు అందుబాటులో ఉన్నాయి. నెల చివరి వరకు ఓటర్ల అందరికి ఎపిక్ కార్డులు అందజేస్తాం.
ఎపిక్ బ్రెయిలి కార్డులను కూడా అందుబాటులో ఉంచాము. పోలింగ్ కేంద్రాల్లో ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ వాలంటీర్ల సేవలను ఉపయోగించుకుంటాం. కేసులు లేని అభ్యర్థులు పత్రికలలో, మీడియాలో ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు 90.72 కోట్లు సీజ్ చేశాం. 77.38 నగదు, 7కోట్లు 55 లక్షల విలువైన లిక్కర్ మిగతావి నగలు సీజ్ చేశాం. సంగారెడ్డి కలెక్టర్‌పై వచ్చిన ఆరోపణలు అవాస్తవం అని మా పరిశీలనలో తేలింది. ఈసీఐకి నివేదిక సమర్పించాము. 23న బ్యాలెట్ ప్రింటింగ్ చేపడతాం. నామినేషన్ దాఖలు చేసే ప్రక్రియ నుంచే అభ్యర్థి ఖర్చు పరిగణనలోకి తీసుకుంటాం. హరీష్, రేవంత్, ఒంటేరు, రేవూరిలకు నోటీసులు ఇచ్చాము. వాళ్ళు వివరణ ఇచ్చారు. మా అభిప్రాయం ఈసీఐకి నివేదిక ఇచ్చాము. ఉత్తమ్ ఒక మత సమావేశంలో మాట్లాడారు దానిపై వివరణ ఇచ్చారు. గంగుల కమలాకర్ పై ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది. దీనిపై ఈసీఐకి నివేదిక ఇచ్చాము. ప్రగతి భవన్‌లో జరుగుతున్న రాజకీయ సమావేశాలపై పార్టీ ముఖ్యులకు నోటీసులు ఇచ్చాము. వాళ్ళు వివరణ ఇచ్చారు. దానిపై మా అభిప్రాయం ఈసీఐకి నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఏపీ ప్రభుత్వం తెలంగాణలో ప్రకటనలు ఇవ్వొద్దు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది. ఎన్నికల విధుల నుంచి ఆర్థిక శాఖ ఉద్యోగులకు మాత్రమే మినహాయింపు ఉంది. మరికొందరికి జిల్లా ఎన్నికల అధికారులు కూడా మినహాయింపు ఇచ్చే వెసులుబాటు ఉంది' అని రజత్ కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment