అద్దంలా కరీంనగర్... ఎల్‌ఎండీలో బృందావన్ గార్డెన్
సాక్షి, కరీంనగర్: నాలుగు గంటలు.. నలభై నిర్ణయాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటన విజయవంతమైంది. సీఎం హోదాలో మంగళవారం తొలిసారిగా జిల్లాకు వచ్చిన ఆయన ప్రజలపై వరాల జల్లు కురిపించారు. మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 7గంటల వరకు నాలుగు గంటల పాటు సంక్షేమ పథకాలపై కలెక్టరేట్‌లో అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించి.. 40 నిర్ణయాలు తీసుకోవడం విశేషం. జిల్లాల సమీక్ష ల్లో భాగంగా మొదట కరీంనగర్‌కు వచ్చిన కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్న పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. సంక్షేమంలో అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయ ఆవశ్యకతను వివరించారు. సమీక్షలో తీసుకున్న పలు నిర్ణయాలను వెంటనే అమలు చేస్తున్నట్లు విలేకరుల సమావేశంలో ప్రకటించారు.
‘కరీంనగర్‌ను అద్దం తునకలా తయారు చేస్తాం. ప్రజలు ఊహించని విధంగా లండన్, న్యూయార్క్ మోడల్‌లో నగరాన్ని అభివృద్ధి చేస్తాం. రింగ్‌రోడ్లు, ఫోర్ లేన్ రహదారులు.. అవసరమైతే కొన్ని భవనాలు కూలగొట్టి రోడ్లు విస్తరిస్తాం. లోయర్ మానేర్ డ్యామ్ ప్రాంతాన్ని మైసూర్‌లోని బృందావన్ గార్డెన్‌లా మారుస్తాం. ఎగువన మిడ్ మానేరు, వరద కాల్వ, ఎస్సారెస్పీ ఉండటంతో ఖాళీ అయిన కొద్దీ నీరు నిండే అవకాశముంది. అందుకే అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. ఎల్‌ఎండీ పరిసరాల్లో ఎస్సారెస్పీకి సంబంధించి మొత్తం 207 ఎకరాల స్థలం ఉంది. అందులో 107 ఎకరాలు వేరే వాళ్లకు అలాట్ చేశారు. వాటన్నింటినీ రద్దు చేసి మరో చోటు కేటాయిస్తాం. అవసరమైతే డ్యామ్ చుట్టూ మరింత స్థలం సేకరిస్తాం. డ్యామ్‌లో బోటింగ్, బోటింగ్ రెస్టారెంట్, నీటిలో తేలియాడుతూ చిన్న ఫంక్షన్లు చేసుకునే విధంగా డిన్నర్ క్రూజింగ్ బోట్‌లను ఏర్పాటు చేస్తాం. పర్యాటకులు విడిది చేసేందుకు వీలుగా అందమైన విల్లాస్ నిర్మిస్తాం’ అని హామీ ఇచ్చారు. వేములవాడ, కొండగట్టు, ఎలగందుల కోటను ఇదే తీరుగా పర్యాటక క్షేత్రాలుగా అభివృద్ధి చేస్తాం. హనుమాన్ భక్తుల రద్దీ ఉండే కొండగట్టు చుట్టుపక్కలా 300 ఎకరాల ప్రభుత్వ స్థలాలున్నాయని... తిరుపతి స్థాయిలో అక్కడ కాటేజీలు, విల్లాలు నిర్మిస్తామని కేసీఆర్ ప్రకటించారు.
కరీంనగర్‌లో ప్రభుత్వ కార్యాలయాల పరిస్థితి బాగా లేనందున ఆరేడు అంతస్తుల భవనాలు నిర్మించి జెడ్పీ, కలెక్టరేట్, మున్సిపల్ కమిషనర్, కళాభారతీలను ఆ కాంప్లెక్స్‌కు తరలిస్తామని కేసీఆర్ చెప్పారు. కరీంనగర్‌లో మరో ట్రాఫిక్ సీఐ పోస్టు మంజూరు, ఇండోర్ స్టేడియంతో పాటు మరో రెండు సబ్ స్టేషన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. నగర ప్రజలు బతుకమ్మ ఆడే మానకొండూరు చెరువును అభివృద్ధి చేస్తామన్నారు.
కరీంనగర్ జిల్లా ఆస్పత్రిని నిమ్స్ స్థాయిలో అభివృద్ధి చేసి, జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో వసతుల కల్పన, ఆపరేషన్ థియేటర్లలో పరికాలు ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి అనుబంధంగా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తామన్నారు. సింగరేణి ఆధ్వర్యంలో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు మెడికల్ కాలేజీ ఇస్తామన్నారు. ఇందులో సింగరేణి కార్మికుల పిల్లలకు రిజర్వేషన్ కేటాయిస్తామన్నారు. పెద్దపల్లిలో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు, హుస్నాబాద్‌లో ఉన్న 35 పడకల ఆస్పత్రిని 55 పడకలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మంథనిలో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటుకు స్థల సేకరణ కోసం ఆదేశించారు.
రామగుండంలో మైనింగ్ పాలిటెక్నిక్, మహిళా పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. నగరానికి తాగునీటి కోసం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఒక టీఎంసీ నీటిని తీసుకోవాలని నిర్ణయించారు. ఎస్సారెస్పీ పరిధిలో ఎతైనా ప్రాంతాలకు తాగునీరందించేందుకు చిన్న లిఫ్టులు ఏర్పాటు చేస్తామన్నారు.
రాయికల్ వద్ద గోదావరిపై బ్రిడ్జి, చెక్‌డ్యాం నిర్మిస్తామన్నారు.జిల్లాలో రైతులకు రావల్సిన ఇన్‌ఫుట్ సబ్సిడీ వెంటనే అందిస్తామన్నారు. జగిత్యాలను జిల్లాగా ఏర్పాటు చేస్తామన్నారు. బెజ్జంకి, కోహెడతో పాటు మరో ఆరేడు వ్యవసాయ మార్కెట్లు ఏర్పాటు చేస్తామన్నారు.
ఎల్లంపల్లి, మిడ్‌మానేరు భూ నిర్వాసితులకు రావల్సిన బకాయిలు త్వరలోనే చెల్లిస్తామన్నారు.
పెద్దపల్లిలో నిర్వహిస్తున్న కమాన్‌పూర్ మార్కెట్ యార్డును కమాన్‌పూర్‌కు తరలించేందుకు నిర్ణయం. పెద్దపల్లి పట్టణం, మండలానికి తాగునీరందించేందుకు సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నిర్మాణంతో పాటు హుస్సేనిమియా వాగుపై మూడు చెక్‌డ్యాంలు ఏర్పాటుకు నిర్ణయం.మానేరు నదిపై కమాన్‌పల్లి, భూపాలపల్లిని కలుపుతూ వంతెన నిర్మాణం.
రాయికల్ మండలం బోర్నపల్లిలో గోదావరినదిపై రూ.70 కోట్లతోబ్రిడ్డి నిర్మాణం.
హౌసింగ్ బాగోతం అంతా తెలుసు
సమీక్షలో.. హౌసింగ్‌లో జరిగిన అవినీతిపై పలువురు ప్రజాప్రతినిధులు ప్రస్తావించగా.. స్పందించిన కేసీఆర్ హౌసింగ్ భాగోతం అంతా మా దృష్ట్టికి వచ్చిందన్నారు. ప్రభుత్వం అవినీతికి దూరంగా ఉంటుందని, సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పుటకు ముందుకు వస్తున్నారని తెలిపారు. సింగరేణిలో లక్షల ఉద్యోగాలు కల్పించే అవకాశముందన్నారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 40 లక్షల మొక్కలు, గ్రామంలో 33 వేల మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ , జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమా, ఎంపీలు వినోద్‌కుమార్, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు, కరీంనగర్ నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, భానుప్రసాద్‌రావు,ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
4 గంటలు 40 వరాలు
Published Wed, Aug 6 2014 2:43 AM | Last Updated on Wed, Aug 15 2018 9:04 PM
Advertisement