సీనియర్ల పైశాచికం.. జూనియర్లకు ప్రాణ సంకటం | 4th Year NLU Delhi student pens book on Laws Related | Sakshi
Sakshi News home page

సీనియర్ల పైశాచికం.. జూనియర్లకు ప్రాణ సంకటం

Published Tue, Sep 23 2014 2:51 AM | Last Updated on Thu, Jul 11 2019 5:23 PM

సీనియర్ల పైశాచికం.. జూనియర్లకు ప్రాణ సంకటం - Sakshi

సీనియర్ల పైశాచికం.. జూనియర్లకు ప్రాణ సంకటం

- కళాశాలల్లో జడలు విప్పుతున్న ర్యాగింగ్ భూతం
- ఫిర్యాదు అందితే సీనియర్లు జైలుకే..
వరంగల్‌క్రైం :
కళాశాలలో కొత్తగా అడుగుపెట్టేవారికి అదొక కొత్తబంగారు లోకం. మెడికల్ .. ఇంజనీరింగ్.. డి గ్రీ.. పీజీ.. ఇలా కోర్సులేవైనా కావొచ్చు. క్లాస్‌మేట్స్ పరిచయూలు.. కలుపుగోలు మాటలు.. అంతా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. కానీ జూనియర్లకు వచ్చిన సమస్యల్లా సీనియర్లతోనే. ఐసీ(ఇంటర్‌డక్షన్) క్లాస్‌తో మెుదలయ్యే వేధింపులు.. దాడుల వరకు వెళుతున్నాయి. పాశ్చాత్య దేశాల్లో జూనియర్లను సీనియర్ విద్యార్థులు పరిచయం చేసుకునే కార్యక్రమాన్ని ర్యాగింగ్ అనేవారు. కాలక్రమంలో దాని అర్థం మారి.. వేధించడంగా స్థిరపడిపోరుయింది.

ఒక మనిషిని.. ఇంకొక మనిషి మానసికంగా, శారీరకంగా వేధిస్తూ పైశాచికానందం పొందే అమానవీయ సంస్కృతిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు ఎంత కఠినమైన చట్టాలు చేసినా.. అది చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉంది. తమ సీనియర్లు తమను ర్యాగింగ్ చేశారు కాబట్టి.. మేం కూడా అలాగే చేస్తామనే ధోరణిలో విద్యార్థులు ప్రవర్తిస్తున్నారు. ఈ ర్యాగింగ్ రక్కసి బారినపడి ప్రాణాలు కోల్పోయినవారు కూడా ఉన్నారు. ఇది వరకు ఇంజినీరింగ్, మెడికల్, పాలిటెక్నిక్, ఇతర ప్రొఫెషనల్ కోర్సులుండే కళాశాలలకే పరిమితమైన ర్యాగింగ్ విషసంస్కృతి కొన్నేళ్లుగా యూనివర్సిటీల్లోని సోషల్‌సెన్సైస్ విభాగాలకు విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కాకతీయ విశ్వవిద్యాలయం హిస్టరీ విభాగంలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం.
 
ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన కారాగారమే..
►తోటి విద్యార్థులను సూటిపోటి మాటలతో వేధించడం, తమ చేతల ద్వారా పీడించడం, కలవరపెట్టడం, ఉద్దేశపూర్వకంగా వారిని బాధించడం, కుల, మతాల పేరుతో దూషించడంలాంటి దుశ్చర్యలకు పాల్పడితే ఆరు నెలల జైలు లేదా రూ.వెయ్యి జరిమానా విధిస్తారు. ఒక్కోసారి రెండు శిక్షలు విధించే అవకాశముంది.
►తాము సీనియర్లమని, చెప్పిన విధంగా నడుచుకోవాలని జూనియర్లను భయపెట్టడం, బెదిరించడం, దౌర్జన్యం చేయడంలాంటి చర్యలకు పాల్పడితే ఏడాది జైలు శిక్ష లేదా రూ.రెండు వేల జరిమానా ఉంటుంది. ఒక్కోసారి రెండూ విధించవచ్చు.
►విద్యార్థికి  అపకారం చేయడం, బలవంతంగా వస్తువులు లాక్కుని వాడుకోవడం, వారితో కావాల్సిన వస్తువులు తెప్పించుకోవడం తదితర చర్యలకు రెండే ళ్ల జైలు శిక్ష లేదా రూ.5 వేల జరిమానా, లేదా ఒక్కోసారి రెండు శిక్షలూ పడవచ్చు.
►విద్యార్థులను కిడ్నాప్ చేయడం, అనవసరంగా అపరాధం చేయడం, శృతిమించిన టార్చర్ పెడితే ఐదేళ్ల జైలు లేదా రూ.10 వేల జరిమానా లేదా రెండూ విధించవచ్చు.
►విద్యార్థి మృతికి ర్యాగింగ్ దారి తీసినా.. ఆత్మహత్యకు పురిగొల్పినా పదేళ్ల జైలు శిక్ష లేదా రూ.50 వేల జరిమానా, లేదా రెండు శిక్షలు విధించవచ్చు.
 
ఫిర్యాదు చేయండిలా..
ర్యాగింగ్ విష సంస్కృతిని నిర్మూలించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలతో విద్యా సంస్థల్లో ర్యాగింగ్ వ్యతిరేక కమిటీలను ఏర్పాటు చేయాలని  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా విద్యా సంస్థల్లో ర్యాగింగ్ నిరోధానికి 1997లో చట్టం తీసుకొచ్చింది. కళాశాల ప్రిన్సిపాల్ అధ్యక్షతన సీనియర్ అధ్యాపకులతో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏర్పాటు చేయూలి. ర్యాగింగ్‌ను సాధారణ చర్యగా భావించకుండా దీనిపై వెంటనే పోలీసు శాఖకు సమాచారమివ్వాలి. కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ సరిగా స్పందించని పక్షంలో బాధిత విద్యార్థులు పోలీసు శాఖకు, జిల్లా న్యాయసేవాధికార సంస్థకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.
►కళాశాలల్లో ఏర్పాటు చేసే ర్యాగింగ్ వ్యతిరేక కమిటీలను జిల్లాస్థాయిలో కలెక్టర్ పర్యవేక్షిస్తారు.
►ర్యాగింగ్ విషయంలో స్పందించని కళాశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్‌కు ఉంది.
►ర్యాగింగ్‌కు పాల్పడితే విధించే శిక్షలు తెలిపే బోర్డులను ప్రతి కళాశాలలో అందరికి క నిపించే ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలి.
►ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులు భవిష్యత్‌లో చదువును కొనసాగించేందుకు అవకాశం ఉండదు. వారి పేర్లను ప్రభుత్వ విద్యాశాఖ రికార్డుల్లో నమోదు చేసి భవిష్యత్తులో ఏ విద్యాసంస్థల్లోనూ ప్రవేశం పొందేందుకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటుంది.
►అప్పటికే ఉన్న విద్యార్హతలతో ప్రభుత్వ ఉద్యోగంతోపాటు విదేశాలకు వెళ్లే అవకాశం కూడా కోల్పోతారు.
►ఇలాంటివారికి ప్రభుత్వం పాస్‌పోర్టు జారీ చేయకుండా నిలిపివేస్తుంది. ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థుల సర్టిఫికెట్ల వెనుక ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థి అని స్టాంప్ వేస్తారు. ఫలితంగా దేశ, విదేశాల్లోనూ ఏ యూనివర్సిటీల్లో కూడా అడ్మిషన్ ఇవ్వరు.
 
అవగాహన సదస్సులు ఏర్పాటు చేయూలి

ర్యాగింగ్‌ను నివారించేందుకు విద్యాసంస్థల్లో ప్రచారం చేయాలి. అడ్మిషన్ల ప్రక్రియ ముగియగానే సదస్సులు ఏర్పాటుచేసి జూనియర్లకు మనోధైర్యం కల్పిస్తూ.. ర్యాగింగ్ కేసు నమోదైతే  జరిగే నష్టాన్ని సీనియర్లకు వివరించాలి. ఫిర్యాదు చేయూల్సిన ఫోన్‌నంబర్లు జూనియర్లకు కనిపించేలా ప్రదర్శించాలి. ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి.
 - చెలమల్ల వీరన్న, పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు
 
 క్షణికానందం కోసమే ర్యాగింగ్
 క్షణికానందం కోసమే ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారు. తమను తమ సీనియర్లు ర్యాగింగ్ చేశా రు కాబట్టి.. మేము అలాగే చేస్తామనే ధోరణితో ప్రవర్తించడం సరికాదు. ర్యాగింగ్‌కు భయపడి అడ్మిషన్ తీసుకున్నాక కళాశాలకు రాని విద్యార్థులు కూడా ఉన్నారు. సీనియర్లపై ఫిర్యాదు చేయడానికి కూడా వారు ధైర్యం చేయడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
 -తూము మనోహర్, ఎమ్మెస్సీ(మ్యాథ్స్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement