సాక్షి, హైదరాబాద్ : అది జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ గ్రామ పంచాయతీ.. సుమారు 6,357 కుటుంబాలకు ఉపాధి హామీ పథకమే దిక్కు.. ఒక్కో కుటుంబంలో ఇద్దరు ముగ్గురు ఉపాధి కూలీలుగా ఉన్నారు.. జూలై తర్వాత ఈ గ్రామపంచాయతీ పరిధిలో సుమారు 12 వేల మంది కూలీలు ఉపాధికి దూరమవనున్నారు! అలంపూర్‌కు మున్సిపాలిటీ హోదా కల్పించనుండటమే ఇందుకు కారణం!! ఇలా ఒక్క అలంపూరే కాదు.. రాష్ట్రం లోని 309 గ్రామ పంచాయతీలు/గ్రామాల పరిధిలో ఆగస్టు నుంచి ఉపాధి హామీ పథకం అమలు నిలిచిపోనుంది. ఫలితంగా 5 లక్షల నుంచి 7 లక్షల మంది పేద కూలీలు జీవనోపాధిని కోల్పోనున్నారు. అనధికార అంచనాల ప్రకారం వారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉండనుంది.
8,755 గ్రామాలు.. 50 లక్షల కుటుంబాలు..
రాష్ట్రంలోని 173 గ్రామ పంచాయతీలు/గ్రామాల విలీనంతో ప్రభుత్వం కొత్తగా 71 మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తోంది. వీటితోడు ఇప్పటికే ఉన్న 41 మున్సిపాలిటీల్లో మరో 136 గ్రామాలను విలీనం చేసింది. అంటే మొత్తం 309 గ్రామ పంచాయతీలు/గ్రామాలు మున్సిలిటీల పరిధిలోకి వెళ్లనున్నాయి. ఇందుకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించారు. జూలైతో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం ముగియనుంది. ఆ వెంటనే అంటే.. ఆగస్టు 1 నుంచి ఈ 309 గ్రామాల్లో ఉపాధి హామీ పథకం నిలిచిపోనుంది. దీంతో ఈ గ్రామాల్లో కనీసం 5 లక్షల మంది కూలీలు అకస్మాత్తుగా జీవనోపాధికి దూరం కానున్నారు. ఇందులో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారు. రాష్ట్రంలోని 8,755 గ్రామ పంచాయతీల పరిధిలో 50,82,970 కుటుంబాలు ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులు కలిగి ఉన్నాయి. పురుషులు, మహిళలు కలిపి 1,12,11,923 మంది కూలీలు ఉపాధి పొందుతున్నారు. ఈ పథకం కింద ఉపాధి కల్పించేందుకు కేంద్రం 2017–18లో రూ.2,930 కోట్లు ఖర్చు చేసింది. ఒక్కో కూలీకి గరిష్టంగా రూ.205 వేతనం అందిస్తున్నారు. సగటున ఒక్కో వ్యక్తి రోజుకు రూ.140 వేతనాన్ని అందుకుంటున్నాడు.
వ్యవసాయేతర ఉపాధి లేకున్నా..
గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఏడాదిలో కనీసం 100 రోజుల పనికి హామీ కల్పిస్తూ 2006 ఫిబ్రవరి 2న అప్పటి యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఉన్న ఊరిలోనే పని లభిస్తుండడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు 309 గ్రామ పంచాయతీల పరిధిలో ఈ పథకం నిలిచిపోనుండటంతో కూలీలకు పని లేకుండా పోతుంది. వాస్తవానికి రాష్ట్ర పురపాలికల చట్టంలోని నిబంధనల ప్రకారం 20 వేల కనీస జనాభా ఉండి, జనాభాలో సగానికి పైగా వ్యవసాయేతర పనులపై ఆధారపడి ఉన్న గ్రామాన్ని మాత్రమే మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలి. అయితే పేరుకు పట్టణ హోదా వస్తున్నా ఈ 309 గ్రామాల్లో ఎక్కడా వ్యవసాయేతర ఉపాధి అవకాశాలు, పట్టణ ప్రాంత ఛాయలు, పట్టణ ప్రాంతాల్లో ఉండే వ్యాపార, వాణిజ్య సదుపాయాల్లేవు. వ్యవసాయం, ఉపాధి హామీ పథకాలు తప్ప ప్రజలకు మరే ఇతర ఉపాధి అవకాశాలు లేవు. నిబంధనల ప్రకారం కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటే చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించిన ప్రభుత్వం.. చట్ట సవరణ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసింది. జీహెచ్‌ఎంసీతోసహా రాష్ట్రంలో 73 పురపాలికలు ఉండగా కొత్తగా ఏర్పాటు చేయనున్న 71 మున్సిపాలిటీలతో వాటి సంఖ్య 144కి పెరగనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో పట్టణ ప్రాంత జనాభా 1.24 కోట్లు కాగా.. కొత్త పురపాలికల ఏర్పాటు తర్వాత ఈ సంఖ్య 1.50 కోట్లకు పెరగనుంది. రాష్ట్ర జనాభాలో పట్టణ జనాభా 41 నుంచి 45 శాతానికి పెరగనుంది. దాదాపు 25 లక్షల మంది గ్రామీణ జనాభా పట్టణ జనాభా పరిధిలోకి రానున్నారు. అందులో కనీసం 5 లక్షల మంది ఉపాధి హామీకి అనర్హులుగా మారనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment