
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ జాబితా నుంచి దాదాపు 50 రకాల వ్యాధులను తొలగించాలని ఆరోగ్యశ్రీ ట్రస్టు సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఆయా వ్యాధులు జాబితాలో ఉన్నా పెద్దగా రోగులు రాకపోవడంతో తొలగించడమే సమంజసమని భావిస్తున్నట్లు ఆరోగ్యశ్రీ వర్గాలు తెలిపాయి. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆరోగ్యశ్రీపై సుదీర్ఘ సమీక్ష చేశారు. ఈ సందర్భంగా అధికారులు ఈ మేరకు ప్రతిపాదన చేసినట్టు తెలిసింది. తొలగించిన వాటి స్థానంలో మరికొన్ని కొత్త వ్యాధులను చేర్చాలని పేర్కొన్నట్టు సమాచారం.
కొన్ని రకాల వ్యాధులకు రోగులు వస్తున్నా, అవి ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాకపోవడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారని ప్రస్తావనకు వచ్చింది. అయితే వ్యాధుల తొలగింపు, చేర్పుల విషయంలో తొందరపడకుండా ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమించి అధ్యయనం చేయించాలని నిర్ణయించారు. ఆ తర్వాతే ఏ వ్యాధులను తొలగించాలి? వేటిని చేర్చాలన్న దానిపై నిర్ణయం తీసుకోవాలని మంత్రి పేర్కొన్నట్లు సమాచారం.
200 నుంచి 300 వ్యాధులకు కేసులు నిల్..
కొన్ని రకాల వ్యాధులు జాబితాలో ఉన్నా నాలుగైదు ఏళ్లుగా వాటికి పేద రోగులు పెద్దగా రావడంలేదని ఆరోగ్యశ్రీ వర్గాలు అంటున్నాయి. చర్మవ్యాధులకు సంబంధించి చికిత్స చేయించుకోవడానికి ఎవరూ రావడంలేదు. ఇక ఎండోక్రినాలజీ, కాక్లియర్ ఇంఫ్లాంట్ సర్జరీ, రుమటాలజీ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్ వంటి కేసుల్లో చాలా తక్కువగా వస్తున్నాయి. వీటిలో కొన్ని రకాల వ్యాధులకు అసలు కేసులే రావడంలేదు. రాష్ట్రంలో 29 రకాలకు చెందిన 949 వ్యాధులు ఆరోగ్యశ్రీ జాబితాలో ఉండగా.. వాటిలో దాదాపు 200 నుంచి 300 వ్యాధులకు పెద్దగా రోగులు రావడంలేదనేది ఆరోగ్యశ్రీ వర్గాలు చెబుతున్నాయి.
వాటిలో కొన్నింటిని ఉంచినా, 50 రకాల వ్యాధులు ఏమాత్రం అవసరం లేదని అధికారులు స్పష్టంచేస్తున్నారు. అలాంటివాటిని లెక్క కోసం ఉంచే బదులు, ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని వాటిని గుర్తించి, పేదలకు ఉపయోగపడేవాటిని జాబితాలో చేర్చడం వల్ల ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు గుండె, లివర్ మార్పిడి చేయించుకున్న రోగులకు జీవితాంతం ఉచిత మందులు ఇవ్వాలని ఆరోగ్యశ్రీ ట్రస్టు నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కిడ్నీ మార్పిడి చేయించుకున్న వారికి మాత్రమే జీవితాంతం ఉచిత మందులు ఇస్తున్నారు.