ఎల్కల్‌లో అతిసార 50 మందికి అస్వస్థత
దౌల్తాబాద్, న్యూస్‌లైన్: అతిసార ప్రబలడంతో 50 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన దౌల్తాబాద్ మండలం ఎల్కల్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. ఎల్కల్‌లో తాగునీరు కలుషితం కావడంతో పాటు పారిశుద్ధ్యం లోపించడంతో మూడు రోజులుగా ప్రజలు వాంతులు, విరేచనాలతో గ్రామస్తులు బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం పరిస్థితి తీవ్రం కావడంతో 50 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో స్పందించిన గ్రామస్తులు అస్వస్థతకు గురైన వారిని వెంటనే గజ్వేల్, హైదరాబాద్ ఆస్పత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నారు.
మరోవైపు కొంతమందికి స్థానిక పంచాయతీ కార్యాలయంలోనే ఏఎన్‌ఎంలు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న గజ్వేల్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సునీల్‌రాజా గ్రామాన్ని సందర్శించారు. అంతకు ముందు తొగుట సీఐ వెంకటేశ్వర్లు కూడా ఎల్కల్ వెళ్లి వివరాలు సేకరించారు. అవసరమైన సాయం అందించాలని బేగంపేట పోలీసులను ఆదేశించారు. ఈ విషయమై జిల్లా వైద్యాధికారిని డాక్టర్ పద్మను ‘న్యూస్‌లైన్’ ఫోన్‌లో సంప్రదించగా తనకు ఎల్కల్‌లో అతిసార ప్రబలిన సంగతే తెలియదని చెప్పారు. అయినా వెంటనే అధికారులను అప్రమత్తం చేస్తానన్నారు.