నిజాం రుబాత్ వివాదానికి తెర | 600 city pilgrims to get free accommodation | Sakshi
Sakshi News home page

నిజాం రుబాత్ వివాదానికి తెర

Published Tue, May 12 2015 4:14 AM | Last Updated on Sun, Sep 3 2017 1:51 AM

600 city pilgrims to get free accommodation

 జెడ్డాలో రుబాత్ ఆర్గనైజర్‌తో డిప్యూటీ సీఎం చర్చలు
 సాక్షి, హైదరాబాద్: సౌదీ అరేబియాలోని మక్కా నిజాం రుబాత్ భవనంలో రాష్ట్ర హజ్ యాత్రికుల ఉచిత వసతి వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. సోమవారం అక్కడి జెడ్డా పట్టణంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, అక్కడి భారత రాయబారి ముబారక్‌తో కలిసి రుబాత్ కార్యనిర్వాహకుడు హుస్సేన్ మహ్మద్ అల్ షరీఫ్‌తో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా హజ్-2015లో 600 మంది యాత్రికులకు రుబాత్‌లో ఉచిత వసతి కల్పించేందుకు అంగీకారం కుదిరింది. ఈ యాత్రికులను ఎంపిక చేసేందుకు హైదరాబాద్‌కు రావాలని హుస్సేన్ మహ్మద్‌ను మహమూద్ అలీ కోరగా.. ఆయన అంగీకరించారు. ఈ మేరకు ఈ నెల 22న లేదా 23న రాష్ర్ట హజ్ హౌస్‌లో జరిగే లక్కీడ్రా కార్యక్రమానికి ఆయన హాజరవుతారు.
 ఏమిటీ వివాదం: హైదరాబాద్ సంస్థానం నుంచి హజ్ యాత్రకు వెళ్లే యాత్రికుల కోసం 1857లో నిజాం నవాబు మక్కాలో 14 ధర్మసత్రాలు నిర్మించారు. అందులో 13 సత్రాలు అన్యాక్రాంతమయ్యాయి. మిగిలిన దానినే నిజాం రుబాత్‌గా పిలుస్తుంటారు. హైదరాబాద్‌లోని నిజాం నవాబు ధార్మిక కమిటీ ఆ రుబాత్ నిర్వహణ బాధ్యతలను చూసేది. ఆ పనుల నిమిత్తం మక్కాకు ప్రత్యేకంగా ఉద్యోగులను పంపేది. అలా చివరగా వెళ్లిన ఉద్యోగి ఒకరు సౌదీ పౌరసత్వాన్ని తీసుకుని, అక్కడే ఉండిపోయారు. ఆయన కుమారుడు హుస్సేన్ మహ్మద్ అల్ షరీఫ్ ప్రస్తుతం నిజాం రుబాత్‌కు కార్యనిర్వాహకుడిగా ఉన్నారు. అయితే తొలి నుంచి డీజీపీ, మతపెద్దలతో కూడి కమిటీ.. రాష్ట్రం నుంచి హజ్‌కు వెళ్లేవారిలో కొందరిని లాటరీ ద్వారా రుబాత్‌లో ఉచిత వసతి కోసం ఎంపిక చేసేది. కానీ మూడేళ్లుగా రుబాత్ నిర్వాహకుడే నేరుగా ఎంపిక చేయడం వివాదానికి కారణమైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ జోక్యంతో ఈ వివాదం ఒక కొలిక్కి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement