జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శాసనసభ ఎన్నికలకు ముందు చేసిన ఒక ప్రసంగం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పవన్ కల్యాణ్ ఏమన్నారంటే.. ఏది పెట్టుకున్నా ఒన్ టైమ్ డబ్బు పది లక్షల చొప్పున ఐదువందల మంది యువతకు ఇస్తే అది ఎంతమందికి ఉపాధి అవుతుంది. ప్రతి నియోజకవర్గం నుంచి సంవత్సరానికి ఐదువందల మందికి ఇలా ఇస్తే ఎందరికి ఉపయోగపడుతుంది! మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. నా కొడుకుకు నేను పెట్టుబడి పెడతాను. మీకు ఎవరు పెడతారు! అంతా మన కుటుంబమే అనుకుంటాం. ఆ కుటుంబానికి ఏమి చేయాలి! యువతకు ఈ డబ్బు ఇవ్వడానికి ఏడాదికి పదివేల కోట్లు అవసరం అవుతుంది. ఒక్క ఇసుకలోనే పదివేల కోట్ల దోపిడీ జరుగుతోంది. దీనిని ఆపి యువతకు పది లక్షల చొప్పున ఇస్తే ఆంధ్రప్రదేశ్‌లో యువత ఎందుకు అభివృద్ది పథంలోకి వెళ్లదు?.. అని పవన్ ప్రశ్నించారు.
పవన్ కల్యాణ్‌కు ఆ రోజుల్లో ఇలాంటి విన్నూత్నమైన ఆలోచనలు చాలానే వచ్చేవి. వాటిని ఆయన దాచుకోకుండా యువతను అట్రాక్ట్ చేయడానికి బాగానే వాడుకున్నారు. ఈ మధ్య జిల్లా కలెక్టర్‌ల సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ చంద్రబాబు అనుభవం నుంచి తాను నేర్చుకుంటున్నట్లు చెప్పారు. మంచిదే. ఎవరి అనుభవం నుంచి అయినా మంచిని గ్రహిస్తే సంతోషించవలసిందే. కాని పవన్ కల్యాణ్ ఏమి గ్రహించారో తెలియదు కాని, ఎన్నికలకు ముందే చంద్రబాబు మాదిరి ఎలాంటి ఆచరణసాధ్యం కాని హామీల గురించి ఊదరగొట్టాలన్నది నేర్చుకున్నట్లున్నారు. అందుకే ఇలాంటి కొత్త ఐడియాలను ఆయన ప్రచారంలో పెట్టారు.
పవన్ కల్యాణ్ చెప్పినదాని ప్రకారం నిజంగానే ఒక్కో యువకుడికి పది లక్షల చొప్పున ఇవ్వగలిగితే గొప్ప విషయమే. ఏడాదికి 500 మందికి ఇలా పది లక్షలు ఇవ్వాలని ఆయన అన్నారు.దాని ప్రకారం ఏపీలోని 175 నియోజకవర్గాలకు కలిపి సంవత్సరానికి 8750 కోట్ల వ్యయం అవుతుంది. ఐదేళ్లకు కలిపి నలభైమూడువేల ఏడువందల ఏభై కోట్ల మేర ఖర్చు చేస్తే సరిపోతుంది. యువతకు ఇచ్చే పది లక్షల ఆదారంగా వారు పది మందికి ఉపాది కల్పిస్తే ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వవచ్చో కదా అని పవన్ కల్యాణ్ అన్నారు. పవన్ కల్యాణ్ చెబుతున్నారు కనుక అది జరిగి తీరుతుందని ఆయన అభిమానులు చాలామంది ఆశించి ఉండవచ్చు.
జనసేన కార్యకర్తలు తమకు పదేసి లక్షల చొప్పున డబ్బులు వస్తే, తమ జీవితాలు మారిపోతాయని భావించి ఉండవచ్చు. దాని ప్రభావం ఎన్నికలలో కూడా విశేషంగానే పడిందని అనుకోవాలి. భారీ ఆధిక్యతతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించింది. పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ల తర్వాత క్యాబినెట్‌లో పవన్ కల్యాణ్ కీలకమైన వ్యక్తి అయ్యారు. పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బాగానే ఉంది. పంచాయతీలన్నీ ఆయన చేతిలో ఉంటాయి కనుక, తను ప్రకటించిన పది లక్షల రూపాయలు యూత్‌కు ఇచ్చే స్కీమ్ ఆరంభించి ఉంటే, ఈపాటికి ప్రతి గ్రామంలో కొద్ది మందికి అయినా మంచి ఉపాధి లభించి ఉండేది.
కాని అదేమిటో ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఈ విషయం గురించి అసలు ప్రస్తావించడం లేదు. బహుశా మర్చిపోయారో, యువత కూడా మర్చి పోయి ఉంటుందిలే అనుకున్నారో కాని దాని ఊసే ఎత్తడం లేదు. చంద్రబాబు అనుభవం నుంచి పరిపాలనను నేర్చుకుంటున్నానని ఆయన అన్నారు. ఎన్నికలలో గెలిచిన తర్వాత హామీలను ఎలా ఎగవేయాలన్న విషయాన్ని కూడా బహుశా ముఖ్యమంత్రి అనుభవం నుంచి పవన్ నేర్చుకున్నారేమో అనే చమక్కులు వినిపిస్తున్నాయి.
అసలు ఈ మద్యకాలంలో పవన్ కల్యాణ్ ప్రజలకు సంబందించిన హామీల గురించి పెద్దగా మాట్లాడడం లేదు. గెలిచామా! పదవిలోకి వచ్చామా! అధికారాన్ని అనుభవిస్తున్నామా! అన్నచందంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఎన్నికల వాగ్దానాలు ప్రకటించినప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు కలిసే చేశారు. మహానాడులో చెప్పిన సూపర్ సిక్స్ హామీలతో పాటు పలు ఇతర వాగ్దానాలతో టీడీపీ, జనసేన సంయుక్త మానిఫెస్టోని ప్రకటించాయి. పవన్ తన ఎన్నికల ప్రచారాలలో వాటి గురించి చాలా ప్రముఖంగా ప్రస్తావించేవారు. ఉదాహరణకు తల్లికి వందనం కింద ప్రతి ఇంటిలో ఉన్న విద్యార్థులందరికి పదిహేనువేల రూపాయల చొప్పున డబ్బులు ఇస్తామని పవన్ కల్యాణ్ పదే, పదే చెప్పారు. వలంటీర్లను మొదట అవమానించినా, తదుపరికాలంలో తాము కూడా ఆ వ్యవస్థను కొనసాగిస్తామని, ఒక్కో వలంటీర్‌కు నెలకు పదివేల రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇస్తామని ఆయన ఆయా సభలలో చెప్పారు.
ఇలా ఒక్కటేమిటి! అనేక వాగ్దానాలను చంద్రబాబు, లోకేష్‌లతో పాటు పవన్ కల్యాణ్ కూడా విస్తారంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం వాటి మాటే ఎత్తడం లేదు. వాటికి తోడు పవన్ కల్యాణ్ తన సొంత ఆలోచనల ప్రకారం పది లక్షల రూపాయల చొప్పున ప్రతి యువతకు ఇస్తామని ప్రతి పాదించారు. ఇసుక దోపిడీని ఆపితే ఇది సాధ్యమేనని ఆయన అప్పట్లో అన్నారు. ఆ రోజుల్లో ఇసుక ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి 700 కోట్ల వరకు ఆదాయం సమకూరేది.అయినా దోపిడీ అని ప్రచారం చేశారు. కూటమి గెలిచిన తర్వాత టీడీపీ, జనసేన పార్టీల నేతలు దొరికినకాడికి దొరికినంత ఇసుకను దోచుకుపోయారు. పేరుకు ఉచితం అయినా, భారీ మొత్తాన్నే ప్రైవేటు వ్యక్తులు వసూలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
మరి ఇసుక దోపిడీ ఆపితే పదివేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చేవన్న పవన్ ఇప్పుడు ఎందుకు దాని గురించి ఆలోచించడం లేదు? ఇసుక సంగతి పక్కనబెడితే తన మద్దతుతోనే టీడీపీ అధికారంలోకి వచ్చిందని భావిస్తున్న పవన్ కల్యాణ్ తలచుకుంటే ఈ పది లక్షల స్కీమును చంద్రబాబుతో అమలు చేయించలేరా? అన్న ప్రశ్న వస్తుంది. పవన్ కల్యాణ్ ఈ విషయం గురించి చంద్రబాబుతో చర్చించే ధైర్యం అన్నా చేస్తారా? అని కొంతమంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. లేదూ అచ్చంగా చంద్రబాబు మాదిరే మాటమార్చేస్తే అదే పాలన అనుభవం అని భావిస్తే ఏ గొడవ ఉండదు. మరి పాపం పది లక్షల సాయం వస్తుందని ఆశించి ఓట్లు వేసిన జనసేన కార్యకర్తలు, యువత ఇంకెంతకాలం వేచి ఉండాలో!
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment