ప్రభుత్వ వైద్య కాలేజీల్లో 74 మంది ప్రొఫెసర్లు
- పదోన్నతులతో నియమించిన వైద్య ఆరోగ్యశాఖ
- ఎంబీబీఎస్, బీడీఎస్ తరగతులు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 74 ప్రొఫెసర్ పోస్టులను ప్రభుత్వం పదోన్నతుల ద్వారా భర్తీ చేసింది. గాంధీ మెడికల్ కాలేజీలో 14, కాకతీయ మెడికల్ కాలేజీలో 17, కొత్తగా ఏర్పాటైన మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలో 4, ఉస్మానియా మెడికల్ కాలేజీలో 23, ఆదిలాబాద్ రిమ్స్‌లో 2, నిజామాబాద్ మెడికల్ కాలేజీలో 14 ప్రొఫెసర్ పోస్టుల్లో ఈ నియామకాలు జరుపుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నిబంధనల ప్రకారం మెడికల్ కాలేజీల్లో ఉండాల్సిన సంఖ్యలో ప్రొఫెసర్ల నియామకం జరిగినట్లయింది. భారత వైద్య మండలి నిబంధనల ప్రకారం పోస్టులు ఖాళీగా ఉంటే సీట్లు రద్దయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆగమేఘాల మీద వాటిని భర్తీ చేసింది. మరికొన్ని పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ తెలిపారు. ఇక 2016-17 వైద్య విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్ తరగతులు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఒకటో తేదీ నుంచి పూర్తిస్థాయిలో తరగతులు జరుగుతాయి.
నేడు రెండో విడత సీట్ల కేటాయింపు
ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రైవేటు కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లకు రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ సోమవారం జరిగింది. తొలి కౌన్సెలింగ్‌లో సీట్లు కేటాయించినా.. విద్యార్థులు చేరకపోవడంతో 95 ఎంబీబీఎస్, 350 బీడీఎస్ సీట్లు మిగిలాయి. వీటికోసం నిర్వహించిన రెండో కౌన్సెలింగ్‌లో 7 వేల మంది విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకున్నారు. మంగళవారం ఉదయమే విద్యార్థులకు వచ్చిన సీటు వివరాలను వారి మొబైల్ ఫోన్లకు సమాచారం పంపిస్తారు. వెబ్‌సైట్లో జాబితా ప్రకటిస్తారు. విద్యార్థులు మంగళవారమే వారికి కేటాయించిన కాలేజీల్లో చేరాల్సి ఉంటుందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ కరుణాకర్‌రెడ్డి చెప్పారు. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో డెంటల్ సీట్లు మిగిలిపోయే అవకాశం కనిపిస్తోంది. నీట్ ద్వారా ర్యాంకుల పొందినవారెవరూ బీడీఎస్‌లో చేరడానికి ఆసక్తి చూపడం లేదని.. ఆ ర్యాంకుల ఆధారంగా దేశంలో ఏదో ఓ చోట ఎంబీబీఎస్ సీటు సాధించేందుకు ప్రయత్నిస్తుండడమే దీనికి కారణమని చెబుతున్నారు.
29న బీ కేటగిరీ రెండో విడత కౌన్సెలింగ్
ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో బీ కేటగిరీ సీట్లు మిగిలితే వాటిని ఎన్నారై కోటాలోకి మార్చుకోకూడదని హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో... ఈ నెల 29న రెండో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని కరుణాకర్‌రెడ్డి తెలిపారు. తొలి కౌన్సెలింగ్‌లో ఎంబీబీఎస్ సీట్లన్నీ భర్తీ అయ్యాయని, బీడీఎస్ సీట్లు మాత్రమే మిగిలాయని చెప్పారు. సీటు వచ్చిన విద్యార్థులెవరైనా కాలేజీల్లో చేరకపోతే.. ఎంబీబీఎస్ సీట్లు మిగులుతాయని, లేకుంటే బీడీఎస్ సీట్లకే రెండో విడత కౌన్సెలింగ్ ఉంటుందని వివరించారు. కాగా ఆయుర్వేద, హోమియో వైద్య విద్య సీట్లకు వచ్చే నెలలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు.