అధ్యాపకుల కొరతపై ఏం చేస్తున్నారు?
ప్రభుత్వ కాలేజీల్లో పనిచేసే అధ్యాపకులను 70 ఏళ్ల వరకు పనిచేసేలా ఆదేశాలు జారీ చేయడంతో పాటు, ప్రభుత్వ వైద్య కాలేజీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను భర్తీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ డాక్టర్ జి.హరికిషన్ గౌడ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉన్న అధ్యాపకుల ఖాళీలను భర్తీ చేయకుండానే, మరో 3 కొత్త వైద్య కళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు.
ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టుల కొరత ఉందని, వాటి భర్తీకి చర్యలు తీసుకోకుండా మళ్లీ కొత్త కాలేజీలను ఏర్పాటు చేయడం సమస్యను జటిలం చేయడమేనన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమితులయ్యే వ్యక్తి ఎండీ/ ఎంఎస్/డీఎం/ఎంసీహెచ్ పూర్తి చేసి ఉండాలని, ఇవి పూర్తి చేసేందుకు ఓ విద్యార్థికి 12 ఏళ్లు పడుతుందన్నారు. అన్నీ పూర్తయి సర్వీసులో చేరే నాటికి 45 సంవత్సరాల వయస్సు వస్తోందని, పదవీ విరమణ వయస్సు 58 ఏళ్లని ఆయన తెలిపారు.
ఇలా రిటైర్ అయిన వారిని ప్రైవేటు కాలేజీలు నియమించుకోవడం ద్వారా ఆ కాలేజీలు లబ్ధి పొందుతున్నాయన్నారు. దీంతో అనుభవజ్ఞులు లేక ప్రభుత్వ వైద్య కళాశాలకు వచ్చే సామాన్యులు నష్టపోతున్నారని తెలిపారు. వచ్చే విద్యా ఏడాదికి నిజామా బాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేటలో 3 వైద్య కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఎంసీఐ నిబంధనల అమల్లో భాగంగా అధ్యాపకులను డిప్యుటేషన్‌పై తీసుకుంటోందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ మొత్తం వ్యవ హారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని, ఎంసీఐలను ఆదేశించింది.