
నా అనేవారులేక ‘దిక్కులేని’ చావు!
* అనారోగ్యంతో ఇంట్లోనే మృతి
* అస్థిపంజరమైన వృద్ధురాలు
* 20 రోజుల తర్వాత వెలుగుచూసిన వైనం
బొంరాస్‌పేట: కొడుకులు, కూతుళ్లు లేరు, కట్టుకున్న భర్త చనిపోయాడు. కాటికి కాళ్లు చాచిన వయసులో నా అనేవారు లేకపోవడంతో ఓ వృద్ధురాలు ఇంట్లో దిక్కులేని చావుకు గురై అస్థిపంజరమై కనిపించింది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా బొంరాస్‌పేట మండల కేంద్రంలో గురువారం వెలుగు చూసింది. మండల కేంద్రానికి చెందిన మౌలానా సాహెబ్, ఫాతిమా బేగం(75) దంపతులకు సంతానం లేరు. మౌలానా రెండో పెళ్లి చేసుకోగా ఆమెకు ఓ కూతు రు హమీదాబేగం జన్మించింది.
రెండో భార్య, మౌలానాసాహెబ్ చాలా ఏళ్ల క్రితమే చనిపోయారు. హమీదాబేగం తన అత్తగారి ఊరు రంగారెడ్డి జిల్లా తాళ్లఅంతారంలో ఉంటోంది. ఫాతిమాబేగం అప్పుడప్పుడు ఈమె వద్దకు వెళ్లి వచ్చేది. నెల రోజులుగా ఫాతిమా ఇంట్లోనే ఉంటోంది. ఇరవై రోజుల క్రితం కూతురుకు ఫోన్ చేసి కుటుంబ సమేతంగా బక్రీద్ పండుగకు రమ్మని చెప్పింది. ఆ తర్వాత ఎవరూ ఆమెను పలకరించిన దాఖలాలు లేవు.
ఖుర్బానీ ఇవ్వడానికి వెళ్తే..
బక్రీద్ పండుగకు ఫాతిమా బేగం ఊళ్లో ఎవరికీ కనిపించలేదు. ఖుర్బానీ తినిపించడానికి బంధువు జుబేర్ ఆమె ఇంటికి వెళ్లాడు. పిలిచినా ఎవరూ పలకలేదు. దీంతో తలుపు తెరిచి చూశాడు. నిర్మానుష్యంగా ఉన్న ఇంట్లో ఫాతిమా బేగం అస్థిపంజరమై కనిపించింది. వెంటనే భయపడి కుటుంబ సభ్యులకు, బంధువులకు సమాచారం ఇచ్చారు.