సాక్షి, బషీరాబాద్(హైదరాబాద్): వివాహేతర సంబంధానికి అడ్డుపడుతున్నాడని కట్టుకున్న భర్తను కడతేర్చింది ఓ భార్య. ఈ ఘటనకు సంబంధించి తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాలు.. ఈనెల 16న బషీరాబాద్ సమీపంలోని నావంద్గీ అంతరాష్ట్ర సరిహద్దులో గుర్తుతెలియని వ్యక్తిని హత్యచేసి దగ్దంచేసిన కేసును బషీరాబాద్ పోలీసులు ఛాలెంజింగ్‌గా తీసుకుని విచారణ చేపట్టారు. పొరుగు రాష్ట్రంలోని సులైపేట్ పోలీసుల సహకారంతో హత్యకేసును చేధించారు. కర్ణాటక రాష్ట్రం సులైపేట్ పరిధిలోని ఎలక్‌పల్లి గ్రామానికి చెందినహన్మంతు, అంబికకు 21 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు.
భర్త పక్షవాతం బారిన పడటంతో..
అయితే ఎనిమిదేళ్ల కిందట పక్షవాతంతో హన్మంతు కాలు, చెయ్యి పడిపోయింది. దీంతో పనిచేయకుండా తాగుడికి బానిసై ఇంటిపట్టునే ఉండేవాడు. వారి అక్క నాగమ్మ.. తన పొలాన్ని సాగు చేయడానికి అదే గ్రామానికి చెందిన ఆగు రేవన్‌సిద్ధప్పకు కౌలుకు ఇచ్చారు. ఈ క్రమంలో అంబిక, రేవన్ సిద్దప్ప ఇద్దరూ పొలం పనులు చేస్తుండగా ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. విషయం తెలిసిన భర్త హన్మంతు భార్యను, రేవన్ సిద్దప్పను హెచ్చరించినా మార్పురాలేదు. అయితే తరుచూ తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డపడుతున్నాడని ఎలాగైనా అతడిని అంతమొందించాలని భార్య అంబిక పన్నాగం పన్నింది.
పక్కా ప్లాన్‌తో..
ఈ క్రమంలో ఈనెల 16న సులైపేట్ వెళ్లిన హన్మంతును రేవన్ సిద్దప్ప కలిసి మద్యం తాగించాడు. అంబికకు ఫోన్‌చేసి నీ భర్త నాదగ్గరే ఉన్నాడు సులైపేట్‌కు రావాలని సూచించాడు. ముగ్గురు కలిసి బైక్‌పై బషీరాబాద్‌కు బయలుదేరారు. హైదరాబాద్ వెళ్తున్నామని రైల్వే స్టేషన్‌కు వచ్చారు. అక్కడ మరోసారి మద్యం కొనుగోలు చేసి తాగడానికి నావంద్గీ సమీపంలోని ఓ పొలంలోకి వెళ్లారు. మద్యం తాగుతుండగా రేవన్ సిద్దప్ప రాయితో హన్మంతు తలపై బాదాడు. కిందపడిపోయిన హన్మంతును భార్య గొంతు నులిమింది. అయినా చనిపోలేదని కొడవలితో గొంతు కోసి హత్య చేశారు. శవాన్ని కాగ్నానదిలో పడేయాలనికొంతదూరం మోసుకొని వెళ్లారు. బరువు మోయలేక పొలంలో పెట్రోల్‌పోసి నిప్పంటించి తిరిగి వెళ్లిపోయారు. పోలీసులకు పట్టుబడతామని తెలుసుకున్న నిందితులు ఇద్దరూ ఎక్కడైన పారిపోదామని సులైపేట్ బస్టాండ్‌కు వెళ్లగా పోలీసులు మాటవేసి పట్టుకున్నారు. ఈ మేరకు సోమవారం తాండూరు కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి ఇద్దరికీ రిమాండ్ విధించారు.
Comments
Please login to add a commentAdd a comment