చంపేసి.. సంచిలో మూటకట్టేసి | A deadbody found in folding bag | Sakshi
Sakshi News home page

చంపేసి.. సంచిలో మూటకట్టేసి

Published Sun, Jun 21 2015 12:08 AM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM

A deadbody found in folding bag

రంగారెడ్డి(చేవెళ్ల): దుండగులు ఓ గుర్తుతెలియని వ్యక్తిని చంపి మృతదేహాన్ని ఓ సంచిలో మూటకట్టి పడేశారు. స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ సంఘటన శనివారం ముడిమ్యాల అటవీ ప్రాంతంలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ముడిమ్యాల అటవీ ప్రాంతంలో శనివారం పశువుల కాపర్లకు ఓ తెలుపురంగు సంచి కనిపించింది. అందులోంచి మనిషి కాళ్లు బయటకు కనిపించాయి. గ్రామ వీఆర్‌ఓ గోపాల్ సమాచారంతో చేవెళ్ల సీఐ ఉపేందర్, ఎస్‌ఐలు రాజశేఖర్, ఖలీల్‌లు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సంచిలో ఓ వ్యక్తి మృతదేహం ముడుచుకొని కనిపించింది. తీవ్ర దుర్వాసన రావడంతో రెండురోజుల క్రితం దుండగులు వ్యక్తిని చంపేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. హతుడు దాదాపు 25-30 సంవత్సరాల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు.

దుండగులు యువకుడిని వేరే ప్రాంతంలో హత్య చేసి అనుమానం రాకుండా మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పడేసి ఉండొచ్చని భావిస్తున్నారు. మృతుడి ఒంటిపై నీలిరంగు జీన్స్ ప్యాంట్, పసుపు రంగు చొక్కా ఉంది. మృతదేహంపై ఎలాంటి గాయాలు కనిపించలేదు. మృతదేహం ఉబ్బిపోయి ఉంది. మృతుడికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. గతంలోకూడా ముడిమ్యాల అటవీ ప్రాంతంలో మృతదేహాలు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. హతుడి వివరాలు తెలిస్తే కేసును త్వరగా ఛేదించవచ్చని సీఐ ఉపేందర్ అభిప్రాయపడ్డారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు. కాగా, ముడిమ్యాల అటవీ ప్రాంతంలో వ్యక్తి మృతదేహం పడి ఉందనే సమాచారం తెలియడంతో స్థానికులు పెద్దమొత్తంలో గుడిగూడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement