పరువు పోతుందని...
ఓ కుటుంబం ఆత్మహత్యా యత్నం
ముగ్గురి మృతి: ఒకరి పరిస్థితి విషమం
స్థానికంగా విషాద ఛాయలు
కుటుంబ ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేసిన అప్పులు... వినియోగదారులు ఆభరణాల కోసం ఇచ్చిన బంగారాన్ని సైతం తిరిగివ్వలేని పరిస్థితులు... నలుగురికీ ఈ విషయం తెలిస్తే తట్టుకోలేమనే బాధ... వెరసి ఓ కుటుంబాన్ని ఆత్మహత్యకు ప్రేరేపించాయి. ఫలితంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
కుషాయిగూడ: ఆర్థిక సమస్యలు... తెల్లారేసరికి రూ.నాలుగు లక్షల విలువైన బంగారు ఆభరణాలు వినియోగదారులకు అందజేయాలి...వారు గొడవ చేస్తే ఉనికికే ప్రమాదం... అప్పుల కోసం చేసిన ప్రయత్నాలు విఫలం.. ఎన్నో ఏళ్లుగా జనం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోకపోతే పరువుపోతుందనే భయం... ఓ కుటుంబంలోని నలుగురు సభ్యులను ఆత్మహత్యాయత్నానికి ప్రేరేపించింది. వారిలో ముగ్గురు ఆస్పత్రికి వెళ్లేలోపే మృతి చెందగా... మరో యువకుడు చికిత్స పొందుతున్నాడు. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజమండ్రికి చెందిన పొన్నాడ ఆచార్య (54), పార్వతి(48) దంపతులు ఖమ్మం జిల్లాలో స్థిరపడి... 8 సంవత్సరాల క్రితం బతుకుతెరువు కోసం నగరానికి వచ్చారు. కుషాయిగూడలోని ఇందిరానగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వారికి ప్రసాద్ (27), నాగబాబు (25) ఇద్దరు సంతానం. ప్రసాద్‌కు భార్య లక్ష్మీతులసి, ఏడాదిన్నర వయసు గల రోహిత్ అనే బాబు ఉన్నారు. వృత్తిరీత్యా స్వర్ణకారులైన వారు నాగార్జుననగర్ కాలనీ రోడ్డు నెం.3లో పార్వతీ జూవెల్లరీస్, రోడ్డు నెంబరు.6లో స్వర్ణ జువెల్లరీస్ పేరుతో రెండు దుకాణాలను ఏర్పాటు చేసి, వ్యాపారం సాగిస్తున్నారు. కొంతకాలం వారి వ్యాపారం సజావుగా సాగింది. ఈ మధ్య కాలంలో కొడుకు పెళ్లి , భార్య అనారోగ్యం బారిన పడటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. చిట్టీల డబ్బులు తీసుకోవడంతో పాటు తెలిసిన వారందరి దగ్గర అప్పులు చేశారు. ఆభరణాలు తయారు చేయాల్సిందిగా వినియోగదారులు ఇచ్చిన బంగారాన్నీ వాడుకున్నారు. అయినాఆర్థిక పరిస్థితి చక్కబడలేదు. మరోవైపు ఆభరణాల కోసం వినియోగదారుల నుంచి రోజు రోజుకు ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో శనివారం సుమారు రూ.నాలుగు లక్షల విలువైన బంగారు ఆభరణాలను కష్టమర్లకు అందజేయాల్సి ఉంది. తెల్లవారితే ఇంటి ముందుకు ఎవరొచ్చి గొడవకు దిగుతారో అన్న దిగులుతో శుక్రవారం రాత్రంతా కుటుంబ సభ్యులు కూర్చొని తర్జనభర్జన పడ్డారు. దిక్కు తోచని స్థితిలో ఆచార్య, భార్య పార్వతి, చిన్న కొడుకు నాగబాబులు ఇంట్లో ఉన్న సెనైడ్‌ను గొంతులో పోసుకున్నారు.
పెద్ద కొడుకు ప్రసాద్ నోటి వద్ద పెట్టుకున్న సెనైడ్‌ను భార్య లక్ష్మీతులసి తోసేసింది. అంతలోనే వారంతా అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఇంట్లోంచి వస్తున్న అరుపులు.. కేకలు.. విన్న ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించి... వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆచార్య, పార్వతి, నాగబాబులు మృతిచెందారు. అపస్మారక స్థితిలో ఉన్న ప్రసాద్ చికిత్స పొందుతున్నాడు. కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్ ఎన్.వెంకటరమణ ఆస్పత్రికి చేరుకొని మృతుల బంధువులు, కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. ఆచార్య కుటుంబం చాలా పరువు గలదని... అందరితోనూ ఎంతో అప్యాయంగా ఉండేవారని స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి.