నిజామాబాద్: మద్దతు ధర లేక కడుపు మండిన ఓ మామిడి రైతు వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం నిజామాబాద్ మార్కెట్ యార్డులో చోటు చేసుకుంది. ఇక్కడ ఆంచూర్ (మామిడి ఒరుగులు)కు రెండు రోజలు క్రితం వరకూ క్వింటాకు రూ.18 వేలు ధర పలుకగా, గురు, శుక్ర వారాల్లో ఇది రూ.9 వేలకు పడిపోయింది. దీంతో రైతులు ఆందోళన బాట పట్టారు. ఒక్కసారిగా ధర పడిపోవడం వెనుక వ్యాపారులు, మార్కెట్ యార్డు సిబ్బంది కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా తిమ్మాపూర్‌కు చెందిన రైతు సురేష్ శుక్రవారం ఉదయం మార్కెట్ యార్డులోని నీటి ట్యాంకు ఎక్కి నిరసన తెలిపాడు. ఆంచూర్‌కు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు రైతు సురేష్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.