supporting price
-
ధాన్యం రైతు ‘ధర’హాసం
ఎమ్మిగనూరు(కర్నూలు జిల్లా): వరి సాగు ఈ ఏడాది రైతుకు కలిసొచ్చింది. దిగుబడులు ఆశాజనకంగా వచ్చాయి. మార్కెట్లో మంచి ధర లభిస్తోంది. వేరుశనగ, మిరప పంటలకు దీటుగా ధాన్యం కొనుగోళ్లు సాగుతున్నాయి. జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో వరి సాగు సాధారణ విస్తీర్ణం 31,402 హెక్టార్లు. అయితే ఈ ఏడాది వాతావరణం అనుకూలించటం, ప్రాజెక్టుల్లో విస్తారంగా సాగునీరు లభ్యంకావటంతో కేవలం ఖరీఫ్‌లోనే 28,651 హెక్టార్లలో వరి సాగైంది. రబీలో కూడా కాలువల కింద రైతులు ఈ పంటను సాగు చేసుకొన్నారు. ఒక్కో ఎకరాకు రూ.25వేల నుంచి రూ.30వేల వరకు పెట్టుబడి పెట్టగా.. 35 నుంచి 45 బస్తాల వరకు దిగుబడులొచ్చాయి. గతేడాది క్వింటా ధర రూ.1,700 పలికింది. ఈ ఏడాది ఆరంభం(జనవరి)లో కర్నూలు సోనా క్వింటా రూ.2,000, ఆరున్నర రకం(చిన్నసోనా), ఎన్డీఎల్(నంద్యాలసోనా) రకాలు క్వింటాల్ రూ.2,300 వరకు అమ్ముడుపోయాయి. ప్రస్తుతం క్వింటా రూ.2,900 ప్రకారం కొనుగోలు చేస్తున్నారు. ఫిబ్రవరి నెలాఖరుకు రూ. 3,000 మార్కును అందుకోనుందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రభుత్వ తోడ్పాటు ఖరీఫ్ పంట దిగుబడులను రైతులు వెంటనే అమ్ముకోకుండా అధిక ధరలు వచ్చే వరకూ వేర్‌హౌజ్‌ల్లో నిల్వచేస్తున్నారు .రైతుల అవసరాలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 95 గోడౌన్ల నిర్మాణం చేపట్టింది. అంతేకాకుండా రైతులు నిల్వచేసుకొన్న పంటకు బ్యాంకులతో రుణాలు మంజూరు చేయిస్తోంది. కొంతమంది వేర్‌హౌజ్ యజమానులు కూడా వరి బస్తాకు రూ.1,000 చొప్పున రైతులకు రుణాలు ఇస్తున్నారు. దీంతో రైతులకు పెట్టుబడి ఇబ్బందులు తీరుతున్నాయి. క్వింటా బియ్యం రూ.4500 మార్కెట్లో క్వింటా బియ్యం రూ.4500 పలుకుతోంది. ప్రభుత్వం రైతులకు ఇస్తున్న శిక్షణలతో రైతుల్లో చైతన్యం మొదలైంది. పంట అమ్మకాల్లో గత కొంతకాలంగా కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. తాము పండించించిన పంట ధాన్యాన్ని మరపట్టించి బియ్యంగా మార్చుతున్నారు. ఎమ్మిగనూరు, ఆదోని, కర్నూలు ప్రాంతాల్లోని రైసు మిల్లులకు రైతులు వరిధాన్యాన్ని తరలిస్తున్నారు. ప్రస్తుతం కర్నూలుసోనా బియ్యం క్వింటా రూ.4300, నంద్యాల సోనా, సన్నబియ్యం రూ.4500 వరకు విక్రయిస్తున్నారు. రైతుకు మంచికాలం రైతులకు మంచి కాలం నడుస్తోంది. పంటలకు రేట్లు బాగున్నాయి. ఎప్పుడూ రూ1,800 దాటని వడ్లు ఈఏడు రూ.2,900 అమ్ముతున్నాయి. నేను పది ఎకరాల్లో నంద్యాల సోనా రకం సాగు చేశా. 400 బస్తాల దిగుబడి వచ్చింది. క్వింటా రూ.2900 చొప్పున విక్రయించా. –ఎన్ పరమేష్, గురుజాల గ్రామం గతంలో ఇంత రేటు లేదు తుంగభద్ర నది పంపుసెట్ల కింద 2.5 ఎకరాల్లో కర్నూలు సోనా పండించా. 100 బస్తాల దిగుబడి వచ్చింది. క్వింటా రూ.2800 చొప్పున అమ్ముకొన్నా. గతంలో ఎప్పుడూ ఇంత రేటు లేదు. మంచి ధర వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. – కురువ కిష్టప్ప,వరి రైతు -
ఏది నిజం?: రైతుకు ‘మద్దతు’లో పోలిక ఉందా?
కట్టలు తెంచుకున్న కోపం చంద్రబాబు నాయుడి మాటల్లో కనిపిస్తే...అక్షరాలకందని ఆక్రోశం ‘ఈనాడు’ రాతల్లో!!. ఏమైంది వీళ్లకి? ప్రతిరోజూ వీళ్లు పడుతున్న తంటాలు తెలుగుదేశం ‘గ్రాఫ్’ను పెంచుతాయని ఎవ్వరికీ నమ్మకం లేదు గానీ... ఈ ప్రయత్నంలో వీళ్లకి విచక్షణ మాత్రం చచ్చిపోయింది. ‘40 ఇయర్స్ ఇండస్ట్రీ’ అనరాని మాటలంటుంటే... ‘48 ఇయర్స్ ఇండస్ట్రీ’ రాయకూడదాని కథనాలు రాస్తోంది. శుక్రవారం కర్నూలు జిల్లాలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు గానీ... ‘మద్దతు ఒట్టిదే’ అంటూ ‘ఈనాడు’ పతాక శీర్షికల్లో అచ్చేసిన కథనం గానీ ఇలాంటివే. రామోజీ కథనంలో నిజమెంతో చూద్దాం... రైతులకు బాసటగా నిలవాలనే ఉద్దేశంతో... వారి పంటలను దారుణమైన పరిస్థితుల్లో కూడా తక్కువకు అమ్ముకోరాదన్న ఉద్దేశంతో దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పంటలకు కనీస మద్దతు ధరలను ప్రకటించింది. సహజంగా మద్దతు ధరలు ప్రకటించేది కేంద్రమే. కాకుంటే చాలా పంటలను కేంద్రం కొనుగోలు చేయదు. అలాంటి పంటలు వేసే రైతులకూ గిట్టుబాటు ఉండాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మూడున్నరేళ్ల కిందట ఇతర పంటలకు ఉదారంగా గిట్టుబాటు ధరలు ప్రకటించింది. అంతకన్నా ఎక్కువ ధరలుంటే రైతులు మార్కెట్లోనే విక్రయించుకుంటారు. ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ అనుకోని విపత్కర పరిస్థితులు తలెత్తి కొన్ని ప్రత్యేక పంటలకు గనక మార్కెట్లో ధర పడిపోతే... వారిని ఆదుకోవటానికి రాష్ట్రం ప్రకటించిన కనీస మద్దతు ధర ఉంటుంది. కాబట్టి బయట ఎవ్వరూ అంతకన్నా తక్కువకు రైతు నుంచి కొనే సాహసం చేయలేరు. ఆ ఉద్దేశంతో పెట్టిన ధరకు కూడా వక్రభాష్యం చెప్పటం ‘ఈనాడు’కే చెల్లింది. సరే! ఇక్కడ కొన్ని వాస్తవాలు చూద్దాం. 2014 నుంచి 2019 వరకూ ఐదేళ్ల చంద్రబాబు పాలనలో వివిధ పంటల కొనుగోలు కోసం చేసిన ఖర్చు కేవలం రూ.3,322 కోట్లు. మరి గడిచిన మూడున్నరేళ్లలో ఈ ప్రభుత్వం వివిధ పంటల కొనుగోలు కోసం ఎంత వెచ్చించిందో తెలుసా? అక్షరాలా ఏడువేల నూటయాభై ఏడు కోట్లు. అంటే... రెట్టింపు కన్నా అధికం!!.. పోనీ ధాన్యం రైతులకైనా చంద్రబాబు మేలు చేశాడా అంటే... అదీ లేదు. ఐదేళ్లలో ధాన్యం కొనుగోలు కోసం చంద్రబాబు ప్రభుత్వం వెచ్చించిన మొత్తం రూ.43,134 కోట్లయితే... ఈ మూడేళ్లలోనే వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 48,793 కోట్లు వెచ్చించింది. ఈ ఏడాది ధాన్యం సేకరణ ఇంకా పూర్తిగా ఆరంభం కాలేదు కాబట్టి... మూడేళ్లగానే పరిగణించాలి. అంటే సగటున చంద్రబాబు ప్రభుత్వం ఏడాదికి రూ.8,600 కోట్లు ధాన్యం సేకరణకు వెచ్చిస్తే... ఈ ప్రభుత్వం సగటున ఏడాదికి రూ.16,200 కోట్లు వెచ్చించింది. కాకపోతే... ఈ వాస్తవాలను ‘ఈనాడు’ ఏనాడూ చెప్పదు. ఎందుకంటే ఇవి చెబితే చంద్రబాబును, ‘ఈనాడు’ను ఛీకొట్టని వారు ఇక మిగలరు కనక. అదీ కథ. రూ. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి... ముందెన్నడూ లేని విధంగా తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసింది. కొన్ని నిర్దేశిత పంటలకు గనక ధర పడిపోతే... ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ నిధి సాయంతో వాటిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది. పొగాకుతో సహా ప్రధాన వ్యవసాయ వాణిజ్య పంటలైన జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, మొక్కజొన్న, కందులు, పెసలు, మినుములు, వేరుశనగ, పత్తి, పసుపు, ఉల్లి, టమాటా తదితర పంటలకు మార్కెట్ జోక్యంతో కనీస మద్దతు ధరలు దక్కేలా చేసింది. ఇప్పటికీ కేంద్రం మద్దతు ధరలు ప్రకటించని మిర్చి, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలు, అరటి, చీనీ పంటలకు దేశంలో కనీస మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వమేదైనా ఉందీ అంటే... అది వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే కదా రామోజీరావు గారూ? ఇలాంటి మంచి విషయాలు మీ పత్రికలో ఎన్నడూ ప్రస్తావించరెందుకు? రైతులను చేయిపట్టి నడిపించేలా ప్రభుత్వం తీసుకున్న చర్యలు బాబు హయాంలో కనీసం ఆలోచనల్లో కూడా లేవన్నది నిజం కాదా? రైతుకు విత్తనాలు, పురుగు మందులు అందించే దగ్గర నుంచి... వారి నుంచి పంట కొనుగోలు చేసేందుకు కూడా వీలుగా గ్రామ స్థాయిలో ఏకంగా 10,778 ఆర్బీకేలను ఏర్పాటయ్యాయి. పైపెచ్చు ఆర్బీకేల ద్వారానే కొనుగోలు చేయటం... రైతుల నుంచి మాత్రమే కొనేలా ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ తీసుకోవటం... కొనుగోళ్లలో చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యమివ్వటం... నాణ్యతకు పెద్దపీట... నేరుగా రైతు ఖాతాల్లోకే నగదు జమ అనే పంచ సూత్రాలూ నిక్కచ్చిగా అమలవుతున్నాయి. దీన్నిబట్టి ఈ మూడున్నరేళ్లలో ఎంత విప్లవాత్మక మార్పులొచ్చాయో వేరే చెప్పాల్సిన పనిలేదు. కనీస మద్దతు ధరకన్నా మార్కెట్ ధర బాగుంది... ప్రభుత్వం తీసుకున్న పలు చర్యల ఫలితంగా ప్రస్తుతం ఎమ్మెస్పీ ధరల కంటే మిరప, పత్తి, పసుపు, వేరుశనగ, మినుము, మొక్కజొన్న పంటలకు మిన్నగా మార్కెట్లో ధర పలుకుతోంది. దీంతో వాటిని కొనుగోలు చేయాల్సిన అవసరం పెద్దగా ఉండటం లేదు. ఈ మూడేళ్లలో ధరలు పడిపోయినపుడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.139.90 కోట్ల విలువైన పొగాకుతో పాటు రూ.1789 కోట్ల విలువైన పత్తిని సైతం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ రకమైన భరోసా ఇవ్వటంతో మార్కెట్లో ధరలు స్థిరపడ్డాయి. విశేషమేంటంటే ధరల స్థిరీకరణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు కానీ, మార్కెట్ జోక్యంతో చేసిన కొనుగోళ్లు కానీ ఎన్నడూ రామోజీకి కనిపించలేదు. మార్కెట్లో ధర బాగున్నాయనే విషయాన్ని చెప్పకుండా... ‘మద్దతు ఒట్టిదే’ అంటూ అర్థసత్యాల కథనానికి ఒడిగట్టారు. పెట్టుబడి పెరిగిందని వాదిస్తున్న రామోజీ... అదే సమయంలో రైతుకు ఏటా రూ.13,500 చొప్పున ఇస్తున్న పెట్టుబడి సాయాన్నీ ప్రస్తావించలేదు. మూడేళ్ల కిందట రాష్ట్రమే కొన్ని పంటలకు ధరలు నిర్ణయించినపుడు దేశంలో ఏ రాష్ట్రం చేయని పని చేశారంటూ ప్రశంసించనూ లేదు. పైపెచ్చు అప్పట్లో ఒకరకంగా అవి ఎక్కువ ధరలే. రైతుల్ని ఆదుకోవటానికి ఉదారంగా వ్యవహరించారంటూ ఒక్క అక్షరమూ రాయలేదు. ఇప్పుడు మాత్రం ఆ ధరలను కేంద్రం మాదిరిగా పెంచటం లేదంటూ వాపోతున్నారు రామోజీ! అదే ఈ రాష్ట్ర దౌర్భాగ్యం!!. జగనన్న పాలవెల్లువతో రూ.2354.22 కోట్ల లబ్ధి పాడి–పంట అనే పదాలను విడదీసి చూడలేమన్నది నిరూపిస్తూ... వ్యవసాయానికి కనీస మద్దతు ధరలు ప్రకటించటమే కాక పాడి రైతుల కోసమూ ‘పాల వెల్లువ’ను ప్రారంభించింది ప్రభుత్వం. ‘జగనన్న పాల వెల్లువ’ 2020 డిసెంబర్ 2న ఆరంభమై... ప్రస్తుతం 16 జిల్లాల్లో నడుస్తోంది. 27,277 మంది రైతులతో మొదలైన ఈ ఉద్యమంలో ఇపుడు ఏకంగా 2,47,458 మంది భాగస్వాములయ్యారు. 100 గ్రామాలతో ప్రారంభమై ఇపుడు 2,856 గ్రామాలకు విస్తరించింది. పథకం ప్రారంభించినప్పుడు లీటర్‌కు గరిష్టంగా గేదె పాలకు రూ.71.47, ఆవు పాలకు రూ.34.20 చొప్పున చెల్లించిన అమూల్ సంస్థ... గత 22 నెలల్లో నాలుగుసార్లు సేకరణ ధరలు పెంచింది. ప్రస్తుతం గేదె పాలకు లీటర్‌కు రూ.84.15లు, ఆవుపాలకు రూ.40.73 చొప్పున చెల్లిస్తోంది. రోజూ సగటున 1.50 లక్షల లీటర్ల పాలు సేకరిస్తోంది. అమూల్ రాకతో పోటీ పెరిగింది. ప్రయివేటు డెయిరీలు సైతం సేకరణ ధరలను పెంచాల్సి వచ్చింది. ఫలితంగా వాటికి పాలు పోస్తున్న రైతులకు రూ.2354.22 కోట్ల మేర లబ్ధి పొందారు. అదీ ప్రభుత్వమంటే. లీటర్‌పై రూ.4 అదనంగా లబ్ధి చేకూర్చేలా కృషి చేస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చారు జగన్. దానికి తగ్గట్టే రంగంలోకి అమూల్‌ను తెచ్చారు. కానీ ఇచ్చిన హామీ కంటే మిన్నగా ఇపుడు లీటర్‌కు గేదె పాలకు రూ.15 నుంచి రూ.20 వరకు, ఆవుపాలకు రూ.10లకు పైబడి అదనంగా లబ్ధి కలుగుతోంది రైతులకు. ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టమేంటంటే బాబుకు కొమ్ము కాయటమే పనిగా పెట్టుకున్న ‘ఈనాడు’ గానీ... దాని సోదరసోదరీమణులైన మీడియా సంస్థలు గానీ ఈ నిజాలను ఎప్పుడూ చెప్పవు. ఉన్నవీ లేనివీ రాస్తూ ఎంతకూ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాలన్నదే వాటి ఎజెండా. ఆ ఎజెండాకిపుడు నూకలు చెల్లుతున్నాయన్నది మాత్రం పచ్చి నిజం. -
రొయ్యల కొనుగోళ్లు: కోతేస్తే.. కొరడా
అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకుల కారణంగా ఆక్వా ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. ధరల పతనంతో రొయ్య రైతులు దిగాలు పడ్డారు. ఈ సమయంలో ప్రభుత్వం అండగా నిలబడింది. గిట్టుబాటు ధర కల్పించేందుకు ముందుకొచ్చింది. ధరల స్థిరీకరణకు ఆక్వా సాధికారత కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు కొనుగోలు చేయని ప్రాసెసింగ్ కంపెనీలపై కొరడా ఝులిపించేందుకు రంగం సిద్ధం చేసింది. మరో వైపు ఆక్వా రైతులు, ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులు, సీడ్, ఫీడ్ తయారీదారులు సమన్వయంతో ముందుకు సాగేలా చర్యలు చేపట్టింది. ఎప్పుటికప్పుడు ధరలను సమీక్షిస్తూనే రైతుల కోసం జిల్లా మత్స్యశాఖ అధికారులు హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చారు. హెల్ప్‌లైన్ నంబర్లు : 9392905878, 9392905879 సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దాదాపు 16 వేల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. ప్రధానంగా రొయ్యల సాగు చేపడుతున్నారు. రొయ్యల సాగును మూడు విడతల్లో చేపడతారు. ప్రధాన రెండు సీజన్లలో అధిక సంఖ్యలో రైతులు అధిక మొత్తంలో దిగుబడి సాధిస్తారు. ఒక్కో సీజన్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దాదాపు 30 వేల టన్నుల రొయ్యల దిగుబడి వస్తోంది. ఈ మొత్తాన్ని ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్లు కొనుగోలు చేయాల్సిందే. జిల్లాలో ఉన్న ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్లు దేవీ సీ ఫుడ్స్, జీవీఆర్ ఆక్వా, మున్నంగి ఆక్వా, సదరన్ ఆక్వా, కళ్యాణి ఆక్వా, నీలా ఆక్వా, క్రిస్టల్ ఆక్వా, రాయల్ ఆక్వా, ఆక్వా టీకాలు కొనుగోలు చేయాలి. ఇదిలా ఉండగా అంతర్జాతీయంగా ఏర్పడిన సంక్షోభంతో రొయ్యల ధరలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. దీనిని సాకుగా చూపి వ్యాపారులు రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. ఆక్వా వ్యాపారులు, ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులు, ఎగుమతిదారులు కుమ్మక్కై కూడబలుక్కుని రొయ్యలు సాగు చేస్తున్న రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. దీంతో నీలివిప్లవానికి పెట్టింది పేరైన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రొయ్యల రైతులు విలవిల్లాడిపోతున్నారు. ఈ దశలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. గత నెల 17వ తేదీ విజయవాడలో అధికారులు, మంత్రులు కలిసి రొయ్యల రైతులు, వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. వ్యాపారులకు దిశానిర్దేశం చేశారు. అయినా వారిలో మార్పురాలేదు. రైతుల పక్షాన ప్రభుత్వం... ప్రభుత్వం ఆక్వా రైతుల పక్షాన నిలిచింది. వ్యాపారులు, ఎగుమతిదారులతో మంత్రుల సబ్ కమిటీ సంప్రదింపులు జరిపింది. ప్రస్తుతం ఎగుమతులు లేవని, అందుకోసం తగ్గించి కొనుగోలు చేయాల్సి వస్తుందని వ్యాపారులు, ఎగుమతిదారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కూడిన మంత్రుల సబ్ కమిటీ సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లింది. రొయ్యలు పచ్చి సరుకు కాబట్టి ప్రభుత్వమే ఒక మెట్టు దిగి గతంలో నిర్ణయించిన ధరను కొంచెం తగ్గించి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ధరలు సవరించిన ప్రభుత్వం... వ్యాపారులు, ఎగుమతిదారులు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తక్కువగా ఉన్నాయనడంతో ప్రభుత్వం ఆక్వా రైతులతో చర్చించిన మీదట ధరల్లో కొంత మార్పు చేసింది. ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని ముందు నిర్ణయించిన ధరలను కొంచెం తగ్గించి కొనుగోలు చేయాలని నూతన ధరలను ప్రకటించింది. ఆ ధరలకు కొనుగోలు చేస్తున్నామంటూనే నూతనంగా నిర్ణయించిన ధరలను కూడా పెడచెవిన పెట్టి మరీ తక్కువకు కొనుగోలు చేయడం ప్రారంభించారు. బుధవారం మరోసారి రాష్ట్ర మంత్రులు సాధికారిత కమిటీతో సమావేశమయ్యారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు కొనుగోలు చేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఎప్పటికప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌తో పాటు స్థానిక మార్కెట్లో ధరలను సమీక్షించేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రేట్లకు కొనుగోలు చేయకపోతే రైతులు తమ దృష్టికి తీసుకురావాలని సూచిస్తున్నారు. ఈ విషయంపై రైతులకు ఆవగాహన కల్పిస్తున్నారు. ఇందుకు సంబంధించి హెల్ప్‌లైన్ నంబర్లు కూడా అందుబాటులో ఉంచారు. ఇక్కడ పండించిన పంట ఉత్పత్తులను ఇదే ప్రాంతంలో విక్రయించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాల వారీగా ఆక్వా రైతు కమిటీలు గురువారం జూమ్ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు నడుచుకునేలా తీర్మానం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం రొయ్యల రైతులకు అండగా ఉంది. అందుకే అటు వ్యాపారులతో, ఇటు రైతులతో విరామం లేకుండా చర్చలు జరుపుతోంది. అయినా రొయ్యల ధరల విషయంలో వ్యాపారుల్లో మార్పు లేదు. ప్రభుత్వం స్పష్టంగా చెప్పినా రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు, వ్యాపారులు రైతులను నిలువునా నష్టపరుస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ధరల కంటే తక్కువకు కొనుగోలు చేయడం ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. – దుగ్గినేని గోపీనా«థ్, రొయ్యల రైతు సంఘ నాయకుడు వ్యాపారులు, ఎగుమతిదారులు తీరు మార్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా సాగుకు పూర్తి భరోసానిస్తోంది. కరోనా సమయంలోనూ రైతులకు ఇబ్బంది లేకుండా వ్యాపారులతో రొయ్యలు కొనుగోలు చేయించింది. 10 ఎకరాల్లోపు సాగు చేసే రైతులకు విద్యుత్ చార్జీ యూనిట్‌కు కేవలం రూ.1.50గా నిర్ణయించింది. ఇటీవల రొయ్య మేత ధరలను టన్ను రూ.2,600కు తగ్గించింది. ప్రస్తుతం ఆక్వా వ్యాపారులు ధరలు తగ్గించేందుకు ప్రయత్నిస్తే ప్రభుత్వం 100 కౌంట్ రూ.210గా నిర్ణయించి వ్యాపారులచే కొనుగోలు చేయిస్తోంది. – మాలె రంగారెడ్డి, ఆక్వా రైతు, మూలగుంటపాడు ఇతర దేశాల్లో తక్కువ ధరకు రొయ్యల ఎగుమతి ఇతర దేశాల్లో తక్కువ ధరకు రొయ్యలు ఎగుమతి చేయడం వలన మన దేశం రొయ్యల ధర దిగజారింది. యూరప్ కంట్రీస్‌లో ఉన్న ఈక్విల్యాండ్ దేశంలో రొయ్యలు 100 కౌంట్ రూ.140కు విక్రయిస్తున్నారు. అక్కడ ఏడాది క్రితం రొయ్యల కల్చర్ మొదలుపెట్టారు. ఎకరానికి 5 టన్నులకు తగ్గకుండా తీస్తారు. మన దేశంలో 2 టన్నుల్లోపే వస్తుంది. వారికి ఎగుమతి ఖర్చులు, రొయ్యల యూనిట్లు దగ్గర ఉండటం వలన చార్జీలు తక్కువ. అందుకే తక్కువ ధరకు ఇస్తారు. మనదేశంలో రొయ్యల రైతులకు 100 కౌంట్ ధర రూ.250కు తగ్గకుండా ఇస్తేనే గిట్టుబాటవుతుంది. – గాదె కోటిరెడ్డి, రొయ్యల రైతు, గాదెపాలెం -
ధాన్యం రైతుకు దన్ను
అనంతపురం అర్బన్: రైతు సంక్షేమానికి జగన్ సర్కార్ అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. జిల్లాలో వరి ధాన్యం సేకరణ చేపట్టి రైతుకు దన్నుగా నిలిచేందుకు శ్రీకారం చుట్టింది. ఇందుకు అనుగుణంగా జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా జిల్లా సేకరణ కమిటీ (డిస్ట్రిక్ట్ ప్రొక్యూర్మెంట్ కమిటీ–డీపీసీ) ఏర్పాటైంది. వ్యవసాయ శాఖ జేడీ, మార్కెటింగ్ శాఖ ఏడీ, డీసీఎంఎస్ అధికారి, జిల్లా కో–ఆపరేటివ్ అధికారి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్, జిల్లా సరఫరాల అధికారి సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఇప్పటికే ఒక దఫా సమావేశమై కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంది. 5 వేల టన్నుల సేకరణ లక్ష్యం జిల్లాలో కణేకల్లు, బొమ్మనహాళ్, డీ హీరేహాళ్ ప్రాంతాల్లో ఐదు వేల టన్నుల వరి ధాన్యం సేకరించాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర మొదటి రకం క్వింటాలు రూ.2,060, రెండో రకం రూ.2,040తో రైతుల నుంచి ధాన్యం సేకరిస్తారు. ఈ మూడు మండలాల పరిధిలోని 3 పీఏసీఎస్‌లు, 37 ఆర్బీకేల సహకారంతో డిసెంబర్ నుంచి సేకరణ చేపట్టనున్నారు. జిల్లాలో సార్టెక్స్ మిల్లులు లేని కారణంగా ఇక్కడ సేకరించిన ధాన్యాన్ని చిత్తూరు, తిరుపతి మిల్లులకు పంపించనున్నారు. నాణ్యత పరిశీలనకు సహకారం ధాన్యం నాణ్యత పరిశీలనకు సాంకేతిక సహాయకుల సహకారం తీసుకోనున్నారు. పీఏసీఎస్‌లోని సభ్యులు ఎవరైనా బీఎస్సీ, అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన వారు ఉంటే వారిని సాంకేతిక సహాయకులుగా నియమించుకుంటారు. వీరికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ప్రస్తుతం ఒక బ్యాచ్‌కు కణేకల్లులో మొదటి విడత శిక్షణ ఇస్తున్నారు. ఇక సేకరణ ప్రక్రియలో వలంటీర్లను భాగస్వాముల్ని చేయనున్నారు. రైతు ఖాతాలోకి నగదు జమ ధాన్యం సేకరణకు సంబంధించిన నగదు నేరుగా రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేస్తుంది. రైతు పట్టాదారు పాసుపుస్తకం, ఫోన్ నంబర్‌తో పాటు ఆధార్ అనుసంధానమైన బ్యాంక్ ఖాతా వివరాలు తీసుకుని ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఆ వెంటనే సంబంధిత రైతు ఎఫ్టీఓ (ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్) క్రియేట్ అవుతుంది. మిల్లరు ధాన్యం తీసుకున్న వెంటనే ఆన్లైన్లో నమోదవుతుంది. ఎఫ్టీఓ ఆధారంగా రైతు ఖాతాలోకి నగదు జమవుతుంది. లక్ష్య నిర్దేశనం జిల్లాలో వరి అధికంగా పండించే కణేకల్లు, బొమ్మనహాళ్, డీ.హీరేహాళ్ మండలాల్లో ధాన్యం సేకరణ చేపడుతున్నాం. 3 పీఏసీఎస్‌లు, 37 ఆర్బీకేల పరిధిలో ఈ ఏడాది 5 వేల టన్నుల సేకరణ లక్ష్యంగా నిర్దేశించాం. ఇందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేశాం. తొలివిడతగా 1,500 టన్నులు సేకరించాలని చెప్పాం. ధాన్యానికి సంబంధించి నగదు రైతుల ఖాతాల్లోకి నేరుగా జమవుతుంది. – కేతన్‌గార్గ్, జాయింట్ కలెక్టర్ సేకరణ ప్రక్రియ ప్రారంభం కార్యాచరణ ప్రకారం ధాన్యం సేకరణ ప్రక్రియ ప్రారంభించాం. జాయింట్ కలెక్టర్ నిర్దేశించిన లక్ష్యం 5 వేల టన్నుల ధాన్యం సేకరణకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. పీఏసీఎస్, ఆర్బీకేల సహకారం, వలంటీర్ల భాగస్వామ్యంతో లక్ష్యం పూర్తి చేస్తాం. – నీలమయ్య, డీఎం, పౌర సరఫరాల సంస్థ -
చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌దే హవా!
సాక్షి, న్యూఢిల్లీ : చత్తీస్‌గఢ్‌లో వరి కోతల సీజన్ అయిపోయింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. అయినా దాదాపు యాభై శాతం రైతులు వరి కోతల జోలికి వెళ్లడం లేదు. ఎందుకని చంద్రకురి గ్రామంలోని మహేశ్ చంద్రేకర్ అనే రైతును ప్రశ్నించగా ఎన్నికల ఫలితాల కోసం నిరీక్షిస్తున్నామని అన్నారు. ఎన్నికల ఫలితాలకు, వరి కోతలకు సంబంధం ఏమిటని ప్రశ్నించగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సరైన గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పిందని, అందుకని, తాను వరి కోతలు జరపక పోవడమే కాకుండా జరపకూడదని తోటి రైతులకు సలహా కూడా ఇచ్చానని ఆయన చెప్పారు. అప్పటి వరకు పంటను తరలించకపోతే నష్టం వాటిల్లా అది ప్రశ్నిస్తే, డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాలు వెలువడుతాయని, అప్పటి వరకు భూమిలో తేమ ఉంటుంది కనుక నష్టం వాటిల్లదని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే అప్పటికైనా పాత రేటుకు అమ్ముకోవాల్సిందేనని ఆయన తెలిపారు. ఈసారి కోతల సీజన్ ప్రారంభమైన నవంబర్ ఒకటవ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు రాష్ట్రంలో వడ్ల సేకరణ 4,67,438 మెట్రిక్ టన్నులకు చేరుకుంది. గతేడాది ఇదే కాలానికి సేకరించిన వడ్లతో పోలిస్తే ఇది సగానికిపైగా పడిపోయింది. గతేడాది ఇదే కాలానికి 10,47,454 మెట్రిక్ టన్నులు సేకరించినట్లు అధికారిక మార్కెట్ లెక్కలు తెలియజేస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార సభతో రైతుల్లో ఈ మార్పు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. నవంబర్ 13న మహాసముంద్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పది రోజుల్లో రైతుల రుణాలను మాఫీ చేస్తామని, వరి పంట కనీస మద్దతు ధరను 2500 రూపాయలను చేస్తామని చెప్పారు. గత బీజేపీ ప్రభుత్వం వరి మద్దతు ధరను 2100 రూపాయలను ప్రకటించినప్పటికీ 1750 రూపాయలనే చెల్లించిందని ఆయన విమర్శించారు. దేశంలో కేవలం 15 మందికి చెందిన మూడున్నర లక్షల కోట్ల రూపాయలను మాఫీ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ రైతుల రుణాలను మాఫీ చేయలేక పోతున్నారని విమర్శించారు. చత్తీస్‌గఢ్ జనాభాలో 70 శాతం మంది వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నారు. వారిలో 46 శాతం మంది చిన్నకారు, సన్నకారు రైతులే. 2015 నుంచి 2017 మధ్య వ్యవసాయ సంక్షోభం వల్ల రాష్ట్రంలో 1,344 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. రాహుల్ మాటలను పూర్తిగా విశ్వసించిన రైతులు రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని నమ్ముతున్నారు. 15 ఏళ్ల రమణ్ సింగ్ ప్రభుత్వం పట్ల తాము పూర్తిగా విశ్వాసం కోల్పోయామని రైతులు చెబుతున్నారు. 2022 సంవత్సరం నాటికల్లా దేశలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న ప్రధాని మోదీ మాటలను గుర్తు చేయగా, ఈ నాలుగేళ్ల కాలంలో రైతుల ఆదాయం ఏమాత్రం పెరగక పోగా వ్యవసాయం సంక్షోభంలో పడిందని, అలాంటప్పుడు ఆయన మాటలు ఎలా నిజం అవుతాయని రైతులు అంటున్నారు. ప్రధాని పేదలు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చారని, గ్యాస్ ఫిల్లింగ్‌కు 900 రూపాయలు ఎక్కడి నుంచి తేవాలని, ఉచితంగా బ్యాంక్ ఖాతాలు ఇప్పించారని, అది మురిగిపోకుండా ఉండాలంటే వెయ్యి రూపాయలు డిపాజిట్ చేయాలంటా, ఎక్కడి నుంచి తేవాలని రైతులు ఎదురు ప్రశ్నిస్తున్నారు. వారి విశ్వాసం చూస్తుంటే రాష్ట్రంలో కాంగ్రెస్‌దే హవా! అనిపిస్తోంది. -
మీ అవమానాల వల్లే రైతుల ఆత్మహత్యలు!
సత్తెనపల్లి: ‘పండించిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని అడిగితే.. రైతులను అవమానిస్తారా? మీ అవమానాలకే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు’ అంటూ గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో రైతులు అధికారులపై ధ్వజమెత్తారు. తాము పండించిన మినుములు కొనుగోలు చేయాలని అడిగినపుడు.. మీరే పండించారా! కొనుగోలు చేసి నిల్వలు పెట్టారా! అంటూ అధికారులు ప్రశ్నించడంపై మండిపడ్డారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని కొమెరపూడి గ్రామంలో అధికారులు ‘సాగుకు సమాయత్తం’ కార్యక్రమం నిర్వహించడానికి శుక్రవారం వచ్చినపుడు ఈ సంఘటన జరిగింది. కార్యక్రమానికి ఏర్పాట్లు చేయబోతుండగా రైతులు అడ్డుకుని.. ఎప్పుడో చేయబోయే సాగుకు సలహాలు ఇచ్చేకంటే, ఇప్పటికే పండించిన మినుములను కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతులకు, వ్యవసాయ శాఖ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఎస్ఐకి ఫోన్ చేయాలని ఏఈవో సుభానీని మండల వ్యవసాయాధికారి వి.నరేంద్రబాబు ఆదేశించడంతో రైతులు మరింత కోపోద్రిక్తులయ్యారు. పోలీసుల పేరు చెప్పి రైతులను బెదిరిస్తారా అంటూ మండిపడ్డారు. కష్టపడి చెమటోడ్చి పంటలు పండించింది జైలుకు వెళ్లడానికా అంటూ ఆవేదన వెలిబుచ్చారు. స్పీకర్ నియోజకవర్గంలో ఇదేనా రైతులకు ఇచ్చే గౌరవం అంటూ ప్రశ్నించారు. రెండేళ్లుగా సాగర్ కాలువలకు నీరు రాక అపరాల సాగుకే పరిమితమయ్యామని, నవంబర్‌లో మినుము సాగు చేస్తే ఫిబ్రవరిలో పంట చేతికి వచ్చిందన్నారు. బహిరంగ మార్కెట్లో ధర తక్కువగా ఉండడంతో సత్తెనపల్లిలో ఏర్పాటైన మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రానికి శాంపిల్స్ తీసుకొని వెళితే, రబీలో సాగు చేసినట్టు వ్యవసాయ శాఖ అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకురమ్మని చెప్పారని, వ్యవసాయ శాఖ అధికారులు వద్దకు వెళితే పొలాలు పరిశీలించి రాస్తామని చెప్పారన్నారు. వీఆర్వోలు, ఎంపీఈవోలు, ఏఎస్వో ఎవరూ క్షేత్రస్థాయికి వచ్చి పంటను పరిశీలించకుండా తప్పుడు లెక్కలు ఈ–క్రాప్ బుకింగ్‌లో నమోదు చేసి తమను ఇబ్బందులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. మండలంలో కేవలం 16 ఎకరాల్లో సాగు నమోదైంది కనుక లాటరీ వేసి కొనుగోళ్లు జరపుతామంటున్నారని, తమ చావులకు లాటరీలు వేయాలంటూ ఆవేదన వెలిబుచ్చారు. అనంతరం సాగుకు సమాయత్తం సభను బహిష్కరించి అధికారులను ముట్టడించారు. దీంతో రైతుల వారీగా మినుము పంట సాగు చేసిన వివరాలు వ్యవసాయ శాఖ అధికారులు నమోదు చేసుకున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళతామని హమీ ఇచ్చి వేరే గ్రామానికి వెళ్లారు. మాజీ సర్పంచ్, రైతు లంకిరెడ్డి భాస్కరరెడ్డి, ఎంపీటీసీ కళ్లం విజయ భాస్కరరెడ్డితో పాటు పలువురు రైతులు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన రైతులు
సాక్షి, ఒంగోలు : ప్రజాసంకల్పయాత్రలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెట్టుకుంటున్నారు. బుధవారం జిల్లాలోని రైతులు వైఎస్ జగన్‌ని కలిశారు. ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా నీటిని పర్చూరు తీసుకువస్తే, తీవ్ర కరువుతో అల్లాడుతున్న పరిసర గ్రామాలకు సాగు, తాగునీరు అందుతుందన్నారు. ఈమేరకు ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావాలంటూ జననేతకు వినతి పత్రం ఇచ్చారు. దివంగత నేత వైఎస్ఆర్ హాయాంలో కృష్ణా నీటిని తీసుకురావడానికి రూ.70 లక్షలతో సర్వే చేయించారని, ఆయన మరణం అనంతరం వచ్చిన ప్రభుత్వాలు వాటిని పట్టించుకోలేదని రైతులు విన్నవించుకున్నారు. దిగుమతి తగ్గిపోయింది.. మద్దతు ధర లేదు ఇంకొల్లు మండలంలోని మిర్చి , శెనగ రైతులు బుధవారం వైఎస్ జగన్‌ను కలిశారు. మండలంతో పదివేల ఎకరాలలో మిర్చి, 30 వేల ఎకరాలలో శెనగ పండిస్తున్నామని తెలిపారు. సాగర్ నుంచి నీరు లేక సాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్నామని రైతులు వాపోయారు. గతంలో ఎకరానికి 30 క్వింటాల్ దిగుబడి వస్తుండగా నీటి ఎద్దడితో ఇప్పుడు 15 క్వింటాళ్లకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మద్దతు ధర కూడా లేదని వాపోయారు. శనగ క్వింటాల్ ధర నాలుగు నుంచి అయిదు వేలు ఉంటోందని, మద్దతు ధర 6నుంచి 8వేలకు, మిర్చికి పదివేల రూపాయిలకు పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని రైతుల విజ్ఞప్తి చేశారు. -
మద్దతు ధర కోసం వాటర్ ట్యాంక్ ఎక్కాడు
నిజామాబాద్: మద్దతు ధర లేక కడుపు మండిన ఓ మామిడి రైతు వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం నిజామాబాద్ మార్కెట్ యార్డులో చోటు చేసుకుంది. ఇక్కడ ఆంచూర్ (మామిడి ఒరుగులు)కు రెండు రోజలు క్రితం వరకూ క్వింటాకు రూ.18 వేలు ధర పలుకగా, గురు, శుక్ర వారాల్లో ఇది రూ.9 వేలకు పడిపోయింది. దీంతో రైతులు ఆందోళన బాట పట్టారు. ఒక్కసారిగా ధర పడిపోవడం వెనుక వ్యాపారులు, మార్కెట్ యార్డు సిబ్బంది కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా తిమ్మాపూర్‌కు చెందిన రైతు సురేష్ శుక్రవారం ఉదయం మార్కెట్ యార్డులోని నీటి ట్యాంకు ఎక్కి నిరసన తెలిపాడు. ఆంచూర్‌కు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు రైతు సురేష్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.