కట్టలు తెంచుకున్న కోపం చంద్రబాబు నాయుడి మాటల్లో కనిపిస్తే...అక్షరాలకందని ఆక్రోశం ‘ఈనాడు’ రాతల్లో!!. ఏమైంది వీళ్లకి? ప్రతిరోజూ వీళ్లు పడుతున్న తంటాలు తెలుగుదేశం ‘గ్రాఫ్’ను పెంచుతాయని ఎవ్వరికీ నమ్మకం లేదు గానీ... ఈ ప్రయత్నంలో వీళ్లకి విచక్షణ మాత్రం చచ్చిపోయింది. ‘40 ఇయర్స్ ఇండస్ట్రీ’ అనరాని మాటలంటుంటే... ‘48 ఇయర్స్ ఇండస్ట్రీ’ రాయకూడదాని కథనాలు రాస్తోంది. శుక్రవారం కర్నూలు జిల్లాలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు గానీ... ‘మద్దతు ఒట్టిదే’ అంటూ ‘ఈనాడు’ పతాక శీర్షికల్లో అచ్చేసిన కథనం గానీ ఇలాంటివే. రామోజీ కథనంలో నిజమెంతో చూద్దాం...
రైతులకు బాసటగా నిలవాలనే ఉద్దేశంతో... వారి పంటలను దారుణమైన పరిస్థితుల్లో కూడా తక్కువకు అమ్ముకోరాదన్న ఉద్దేశంతో దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పంటలకు కనీస మద్దతు ధరలను ప్రకటించింది. సహజంగా మద్దతు ధరలు ప్రకటించేది కేంద్రమే. కాకుంటే చాలా పంటలను కేంద్రం కొనుగోలు చేయదు. అలాంటి పంటలు వేసే రైతులకూ గిట్టుబాటు ఉండాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మూడున్నరేళ్ల కిందట ఇతర పంటలకు ఉదారంగా గిట్టుబాటు ధరలు ప్రకటించింది. అంతకన్నా ఎక్కువ ధరలుంటే రైతులు మార్కెట్లోనే విక్రయించుకుంటారు. ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ అనుకోని విపత్కర పరిస్థితులు తలెత్తి కొన్ని ప్రత్యేక పంటలకు గనక మార్కెట్లో ధర పడిపోతే... వారిని ఆదుకోవటానికి రాష్ట్రం ప్రకటించిన కనీస మద్దతు ధర ఉంటుంది. కాబట్టి బయట ఎవ్వరూ అంతకన్నా తక్కువకు రైతు నుంచి కొనే సాహసం చేయలేరు. ఆ ఉద్దేశంతో పెట్టిన ధరకు కూడా వక్రభాష్యం చెప్పటం ‘ఈనాడు’కే చెల్లింది.
సరే! ఇక్కడ కొన్ని వాస్తవాలు చూద్దాం.
2014 నుంచి 2019 వరకూ ఐదేళ్ల చంద్రబాబు పాలనలో వివిధ పంటల కొనుగోలు కోసం చేసిన ఖర్చు కేవలం రూ.3,322 కోట్లు. మరి గడిచిన మూడున్నరేళ్లలో ఈ ప్రభుత్వం వివిధ పంటల కొనుగోలు కోసం ఎంత వెచ్చించిందో తెలుసా? అక్షరాలా ఏడువేల నూటయాభై ఏడు కోట్లు. అంటే... రెట్టింపు కన్నా అధికం!!.. పోనీ ధాన్యం రైతులకైనా చంద్రబాబు మేలు చేశాడా అంటే... అదీ లేదు. ఐదేళ్లలో ధాన్యం కొనుగోలు కోసం చంద్రబాబు ప్రభుత్వం వెచ్చించిన మొత్తం రూ.43,134 కోట్లయితే... ఈ మూడేళ్లలోనే వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం 48,793 కోట్లు వెచ్చించింది. ఈ ఏడాది ధాన్యం సేకరణ ఇంకా పూర్తిగా ఆరంభం కాలేదు కాబట్టి... మూడేళ్లగానే పరిగణించాలి. అంటే సగటున చంద్రబాబు ప్రభుత్వం ఏడాదికి రూ.8,600 కోట్లు ధాన్యం సేకరణకు వెచ్చిస్తే... ఈ ప్రభుత్వం సగటున ఏడాదికి రూ.16,200 కోట్లు వెచ్చించింది. కాకపోతే... ఈ వాస్తవాలను ‘ఈనాడు’ ఏనాడూ చెప్పదు. ఎందుకంటే ఇవి చెబితే చంద్రబాబును, ‘ఈనాడు’ను ఛీకొట్టని వారు ఇక మిగలరు కనక. అదీ కథ.
రూ. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి...
ముందెన్నడూ లేని విధంగా తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసింది. కొన్ని నిర్దేశిత పంటలకు గనక ధర పడిపోతే... ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ నిధి సాయంతో వాటిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది. పొగాకుతో సహా ప్రధాన వ్యవసాయ వాణిజ్య పంటలైన జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, మొక్కజొన్న, కందులు, పెసలు, మినుములు, వేరుశనగ, పత్తి, పసుపు, ఉల్లి, టమాటా తదితర పంటలకు మార్కెట్ జోక్యంతో కనీస మద్దతు ధరలు దక్కేలా చేసింది. ఇప్పటికీ కేంద్రం మద్దతు ధరలు ప్రకటించని మిర్చి, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలు, అరటి, చీనీ పంటలకు దేశంలో కనీస మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వమేదైనా ఉందీ అంటే... అది వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే కదా రామోజీరావు గారూ? ఇలాంటి మంచి విషయాలు మీ పత్రికలో ఎన్నడూ ప్రస్తావించరెందుకు? రైతులను చేయిపట్టి నడిపించేలా ప్రభుత్వం తీసుకున్న చర్యలు బాబు హయాంలో కనీసం ఆలోచనల్లో కూడా లేవన్నది నిజం కాదా?
రైతుకు విత్తనాలు, పురుగు మందులు అందించే దగ్గర నుంచి... వారి నుంచి పంట కొనుగోలు చేసేందుకు కూడా వీలుగా గ్రామ స్థాయిలో ఏకంగా 10,778 ఆర్బీకేలను ఏర్పాటయ్యాయి. పైపెచ్చు ఆర్బీకేల ద్వారానే కొనుగోలు చేయటం... రైతుల నుంచి మాత్రమే కొనేలా ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ తీసుకోవటం... కొనుగోళ్లలో చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యమివ్వటం... నాణ్యతకు పెద్దపీట... నేరుగా రైతు ఖాతాల్లోకే నగదు జమ అనే పంచ సూత్రాలూ నిక్కచ్చిగా అమలవుతున్నాయి. దీన్నిబట్టి ఈ మూడున్నరేళ్లలో ఎంత విప్లవాత్మక మార్పులొచ్చాయో వేరే చెప్పాల్సిన పనిలేదు.
కనీస మద్దతు ధరకన్నా మార్కెట్ ధర బాగుంది...
ప్రభుత్వం తీసుకున్న పలు చర్యల ఫలితంగా ప్రస్తుతం ఎమ్మెస్పీ ధరల కంటే మిరప, పత్తి, పసుపు, వేరుశనగ, మినుము, మొక్కజొన్న పంటలకు మిన్నగా మార్కెట్‌లో ధర పలుకుతోంది. దీంతో వాటిని కొనుగోలు చేయాల్సిన అవసరం పెద్దగా ఉండటం లేదు. ఈ మూడేళ్లలో ధరలు పడిపోయినపుడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.139.90 కోట్ల విలువైన పొగాకుతో పాటు రూ.1789 కోట్ల విలువైన పత్తిని సైతం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ రకమైన భరోసా ఇవ్వటంతో మార్కెట్లో ధరలు స్థిరపడ్డాయి.
విశేషమేంటంటే ధరల స్థిరీకరణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు కానీ, మార్కెట్ జోక్యంతో చేసిన కొనుగోళ్లు కానీ ఎన్నడూ రామోజీకి కనిపించలేదు. మార్కెట్లో ధర బాగున్నాయనే విషయాన్ని చెప్పకుండా... ‘మద్దతు ఒట్టిదే’ అంటూ అర్థసత్యాల కథనానికి ఒడిగట్టారు. పెట్టుబడి పెరిగిందని వాదిస్తున్న రామోజీ... అదే సమయంలో రైతుకు ఏటా రూ.13,500 చొప్పున ఇస్తున్న పెట్టుబడి సాయాన్నీ ప్రస్తావించలేదు. మూడేళ్ల కిందట రాష్ట్రమే కొన్ని పంటలకు ధరలు నిర్ణయించినపుడు దేశంలో ఏ రాష్ట్రం చేయని పని చేశారంటూ ప్రశంసించనూ లేదు. పైపెచ్చు అప్పట్లో ఒకరకంగా అవి ఎక్కువ ధరలే. రైతుల్ని ఆదుకోవటానికి ఉదారంగా వ్యవహరించారంటూ ఒక్క అక్షరమూ రాయలేదు. ఇప్పుడు మాత్రం ఆ ధరలను కేంద్రం మాదిరిగా పెంచటం లేదంటూ వాపోతున్నారు రామోజీ! అదే ఈ రాష్ట్ర దౌర్భాగ్యం!!.
జగనన్న పాలవెల్లువతో రూ.2354.22 కోట్ల లబ్ధి
పాడి–పంట అనే పదాలను విడదీసి చూడలేమన్నది నిరూపిస్తూ... వ్యవసాయానికి కనీస మద్దతు ధరలు ప్రకటించటమే కాక పాడి రైతుల కోసమూ ‘పాల వెల్లువ’ను ప్రారంభించింది ప్రభుత్వం. ‘జగనన్న పాల వెల్లువ’ 2020 డిసెంబర్ 2న ఆరంభమై... ప్రస్తుతం 16 జిల్లాల్లో నడుస్తోంది. 27,277 మంది రైతులతో మొదలైన ఈ ఉద్యమంలో ఇపుడు ఏకంగా 2,47,458 మంది భాగస్వాములయ్యారు. 100 గ్రామాలతో ప్రారంభమై ఇపుడు 2,856 గ్రామాలకు విస్తరించింది. పథకం ప్రారంభించినప్పుడు లీటర్‌కు గరిష్టంగా గేదె పాలకు రూ.71.47, ఆవు పాలకు రూ.34.20 చొప్పున చెల్లించిన అమూల్ సంస్థ... గత 22 నెలల్లో నాలుగుసార్లు సేకరణ ధరలు పెంచింది. ప్రస్తుతం గేదె పాలకు లీటర్‌కు రూ.84.15లు, ఆవుపాలకు రూ.40.73 చొప్పున చెల్లిస్తోంది.
రోజూ సగటున 1.50 లక్షల లీటర్ల పాలు సేకరిస్తోంది. అమూల్ రాకతో పోటీ పెరిగింది. ప్రయివేటు డెయిరీలు సైతం సేకరణ ధరలను పెంచాల్సి వచ్చింది. ఫలితంగా వాటికి పాలు పోస్తున్న రైతులకు రూ.2354.22 కోట్ల మేర లబ్ధి పొందారు. అదీ ప్రభుత్వమంటే. లీటర్‌పై రూ.4 అదనంగా లబ్ధి చేకూర్చేలా కృషి చేస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చారు జగన్. దానికి తగ్గట్టే రంగంలోకి అమూల్‌ను తెచ్చారు. కానీ ఇచ్చిన హామీ కంటే మిన్నగా ఇపుడు లీటర్‌కు గేదె పాలకు రూ.15 నుంచి రూ.20 వరకు, ఆవుపాలకు రూ.10లకు పైబడి అదనంగా లబ్ధి కలుగుతోంది రైతులకు. ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టమేంటంటే బాబుకు కొమ్ము కాయటమే పనిగా పెట్టుకున్న ‘ఈనాడు’ గానీ... దాని సోదరసోదరీమణులైన మీడియా సంస్థలు గానీ ఈ నిజాలను ఎప్పుడూ చెప్పవు. ఉన్నవీ లేనివీ రాస్తూ ఎంతకూ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాలన్నదే వాటి ఎజెండా. ఆ ఎజెండాకిపుడు నూకలు చెల్లుతున్నాయన్నది మాత్రం పచ్చి నిజం.
Comments
Please login to add a commentAdd a comment