సత్తెనపల్లి: ‘పండించిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని అడిగితే.. రైతులను అవమానిస్తారా? మీ అవమానాలకే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు’ అంటూ గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో రైతులు అధికారులపై ధ్వజమెత్తారు. తాము పండించిన మినుములు కొనుగోలు చేయాలని అడిగినపుడు.. మీరే పండించారా! కొనుగోలు చేసి నిల్వలు పెట్టారా! అంటూ అధికారులు ప్రశ్నించడంపై మండిపడ్డారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని కొమెరపూడి గ్రామంలో అధికారులు ‘సాగుకు సమాయత్తం’ కార్యక్రమం నిర్వహించడానికి శుక్రవారం వచ్చినపుడు ఈ సంఘటన జరిగింది. కార్యక్రమానికి ఏర్పాట్లు చేయబోతుండగా రైతులు అడ్డుకుని.. ఎప్పుడో చేయబోయే సాగుకు సలహాలు ఇచ్చేకంటే, ఇప్పటికే పండించిన మినుములను కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా రైతులకు, వ్యవసాయ శాఖ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఎస్‌ఐకి ఫోన్ చేయాలని ఏఈవో సుభానీని మండల వ్యవసాయాధికారి వి.నరేంద్రబాబు ఆదేశించడంతో రైతులు మరింత కోపోద్రిక్తులయ్యారు. పోలీసుల పేరు చెప్పి రైతులను బెదిరిస్తారా అంటూ మండిపడ్డారు. కష్టపడి చెమటోడ్చి పంటలు పండించింది జైలుకు వెళ్లడానికా అంటూ ఆవేదన వెలిబుచ్చారు. స్పీకర్ నియోజకవర్గంలో ఇదేనా రైతులకు ఇచ్చే గౌరవం అంటూ ప్రశ్నించారు. రెండేళ్లుగా సాగర్ కాలువలకు నీరు రాక అపరాల సాగుకే పరిమితమయ్యామని, నవంబర్‌లో మినుము సాగు చేస్తే ఫిబ్రవరిలో పంట చేతికి వచ్చిందన్నారు. బహిరంగ మార్కెట్‌లో ధర తక్కువగా ఉండడంతో సత్తెనపల్లిలో ఏర్పాటైన మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రానికి శాంపిల్స్ తీసుకొని వెళితే, రబీలో సాగు చేసినట్టు వ్యవసాయ శాఖ అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకురమ్మని చెప్పారని, వ్యవసాయ శాఖ అధికారులు వద్దకు వెళితే పొలాలు పరిశీలించి రాస్తామని చెప్పారన్నారు.
వీఆర్వోలు, ఎంపీఈవోలు, ఏఎస్‌వో ఎవరూ క్షేత్రస్థాయికి వచ్చి పంటను పరిశీలించకుండా తప్పుడు లెక్కలు ఈ–క్రాప్ బుకింగ్‌లో నమోదు చేసి తమను ఇబ్బందులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. మండలంలో కేవలం 16 ఎకరాల్లో సాగు నమోదైంది కనుక లాటరీ వేసి కొనుగోళ్లు జరపుతామంటున్నారని, తమ చావులకు లాటరీలు వేయాలంటూ ఆవేదన వెలిబుచ్చారు. అనంతరం సాగుకు సమాయత్తం సభను బహిష్కరించి అధికారులను ముట్టడించారు. దీంతో రైతుల వారీగా మినుము పంట సాగు చేసిన వివరాలు వ్యవసాయ శాఖ అధికారులు నమోదు చేసుకున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళతామని హమీ ఇచ్చి వేరే గ్రామానికి వెళ్లారు. మాజీ సర్పంచ్, రైతు లంకిరెడ్డి భాస్కరరెడ్డి, ఎంపీటీసీ కళ్లం విజయ భాస్కరరెడ్డితో పాటు పలువురు రైతులు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment