దర్జాగా కబ్జా! | A ground invasion | Sakshi
Sakshi News home page

దర్జాగా కబ్జా!

Published Fri, Jun 6 2014 11:52 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM

దర్జాగా కబ్జా! - Sakshi

దర్జాగా కబ్జా!

వాగు భూమిపై వారి కన్నుపడింది. తమ భూమే అని చెప్పుకొంటూ యథేచ్ఛగా కబ్జాకు పాల్పడుతున్నారు.

దేవునిఎర్రవల్లి వాగు భూమి ఆక్రమణ
పట్టాభూమి అంటున్న కబ్జాదారులు
పనులు నిలిపివేయించిన అధికారులు

 
చేవెళ్ల రూరల్,   వాగు భూమిపై వారి కన్నుపడింది. తమ భూమే అని చెప్పుకొంటూ యథేచ్ఛగా కబ్జాకు పాల్పడుతున్నారు. చేవెళ్ల మండలం దేవునిఎర్రవల్లిలో కొందరు వ్యక్తులు వాగు భూమిని ఆక్రమిస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. కళ్లముందే వాగు భూమి కబ్జా అవుతున్నా అధికారులకు పట్టడం లేదు. ఇన్నాళ్లుగా లేనిది ఇప్పుడు సమీప పొలాల రైతులు వాగు భూమి తమ పొలంలోకే వస్తుందని జేసీబీలతో చదును చేస్తున్నారు. దీంతో వాగు సగభాగం పూడుకుపోతోంది. భారీ వర్షాలు కురిస్తే గతంలో లాగా నీరు సాఫీగా పారకపోగా పక్క పొలాలను ముంచెత్తే ప్రమాదం ఉంది. దీంతో పలువురు రైతులు దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అధికారులు దీనిని పరిశీలించి పనులను నిలిపి వేయించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. చేవెళ్ల మండలంలోని దేవునిఎర్రవల్లి గ్రామానికి చెందిన ముగ్గురు రైతులకు ప్రభుత్వ భూమి సర్వే నం.74పక్కనే 193, 194 సర్వే నంబర్లలో పట్టాభూమి ఉంది. ప్రభుత్వ భూమి సర్వే నం.74లో మొత్తం 35ఎకరాల 27గుంటలు ఉండగా ఇందులో దాదాపు 25 ఎకరాల వరకు ప్రభుత్వం పలువురికి అసైన్ చేసింది. మిగిలింది వాగుకోసం అలాగే ఉంది. వాగుకు  ఇరుపక్కల ప్రభుత్వ భూమి ఉంది. వాగు ఇబ్రహీంపల్లి నుంచి దేవునిఎర్రవల్లి మీదుగా ధర్మసాగర్ వరకు ఉంది. ప్రజల రాకపోకల కోసం ఊరేళ్ల గ్రామం వద్ద వాగుపై గతంలో వంతెన నిర్మించారు. ఈ వంతెన పక్కనే ఉన్న 193, 194 సర్వే నంబర్లలో ఉన్న పొలాల రైతులు వాగును కబ్జా చేస్తున్నారు. ఇప్పటికే వాగుకు పక్కనే ఉన్న పొదలు, చెట్లు పూర్తిగా తొలగించి భూమిని చదును చేశారు. దీనిపై అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదంటూ పలువురు పక్క పొలాల రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన రెవెన్యూ అధికారులు ప్రస్తుతానికి భూమి చదును పనులు నిలిపివేయించారు. కాగా, సదరు రైతులు మాత్రం తాము వాగు భూమిని కబ్జా చేయడం లేదని, తమకు ఉన్న పట్టా భూమి ప్రకారం భూమిని చదును చేస్తున్నామని అధికారులకు చెప్పారు. అయితే భూమి సర్వే చేసే వరకు ఎలాంటి పనులు చేపట్టరాదని తహసీల్దార్ విజయలక్ష్మి స్పష్టం చేశారు.

 పనులు నిలిపివేయించాం: విజయలక్ష్మి, తహసీల్దార్, చేవెళ్ల

 దేవునిఎర్రవల్లి గ్రామంలో వాగు పక్కన జరుగుతున్న భూమి చదును పనులు నిలిపివేయించాం. రైతులు మాత్రం ఇది తమ పట్టాభూమి అని చెబుతున్నారు. భూమి సర్వే చేయాలని వీఆర్‌ఓ, ఆర్‌ఐలను ఆదేశించాం. అనుమతి లేకుండా చదును చేసినా, ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వారెవరైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement