
ఓ.. వంచితా...
కష్టసుఖాల్లో తోడుంటానని చెప్పాడు. ప్రేమిస్తున్నానన్నాడు. నువ్వు లేనిదే నేను లేనన్నాడు. పాపం.. అమాయకురాలు ఆ మాటలు నమ్మింది. తనూ ప్రేమించింది. అతడిని పెళ్లి చేసుకుంది. అప్పటికి కాని తెలిసిరాలేదు. చెప్పిన మాటలు వేరు... చేసేది వేరని... నిత్యం ఆ మహిళను అనుమానించేవాడు. తీవ్రంగా హింసించేవాడు. అయినా, కొన్నాళ్లపాటు అన్నింటినీ మౌనంగా భరించింది.
చివరకు తట్టుకోలేక పోయింది. అతని కబంధ హస్తాల నుంచి బయటపడాలనుకుంది. అంతే.. రెలైక్కి ఉత్తరప్రదేశ్ చేరింది. అక్కడి భాష తెలియక.. నా అన్నవారు లేక కష్టాలు పడింది. చివరకు ఆమె పరిస్థితిని గమనించిన అక్కడి పోలీసులు, జిల్లా మెజిస్ట్రేట్ (కలెక్టర్) చేరదీసి సొంత జిల్లా అయిన మహబూబ్‌నగర్‌కు పంపేందుకు రైలు ఎక్కించారు.
పాలమూరు : పాలమూరు జిల్లాలోని బాదేపల్లికి చెందిన జయమ్మ అనే వివాహిత భర్త పెట్టే బాధలు తట్టుకోలేక దూరంగా వెళ్లిపోవాలని నిశ్చయించుకుంది. ఆ మేరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రెలైక్కి అక్కడి బులంద్ షహెర్ జిల్లాకు చేరుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రైల్వేస్టేషన్‌లో కొద్ది రోజులుగా సంచరిస్తూ ఉండడంతో స్థానికులు గుర్తించారు. ఆ రాష్ట్రంలోని సికింద్రాబాద్ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో అక్కడి పోలీసులు ఆమెను శనివారం పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారించారు.
ఆమె మాట్లాడిన భాష వారికి అర్ధం కాలేదు. ఆమె తెలుగులో మాట్లాడుతున్న విషయాన్ని గమనించిన పోలీసులు బులంద్ షహెర్ మెజిస్ట్రేట్ (జిల్లా కలెక్టర్)కు తెలుగు భాష వస్తుందని ఆమె వద్దకు తీసుకువెళ్లారు. దీంతో సదరు జయమ్మను అక్కడి మెజిస్ట్రేట్ బి.చంద్రకళ తన వద్దనే ఉంచుకుంది. కొద్దిరోజుల పాటు తిండిలేక ఇబ్బందిగా ఉన్న జయమ్మకు ఊరట కల్పించి ఆ తర్వాత ఆమె వ్యక్తిగత విషయాలు రాబట్టడంతో తనది పాలమూరు జిల్లాలోని బాదేపల్లి అని, రమేశ్ అనే వ్యక్తిని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నానని, కుటుంబీకులు *లక్ష కట్నం కూడా ఇచ్చారని చెప్పుకొచ్చింది.
ఒకేసారి పూర్తి వివరాలు చెప్పనప్పటికీ.. విడతల వారిగా అక్కడి మెజిస్ట్రేట్ వద్ద తన వ్యక్తిగత విషయాలను వెలిబుచ్చినట్లు సమచారం. తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ తన భర్త హింసిస్తుండేవాడని, అనుమానించి ఇబ్బందులకు గురిచేసే వాడని, విడాకులు ఇవ్వాలని తనను విపరీతంగా వేధిస్తున్న కారణంగా బాధలు తట్టుకోలేక ఇల్లువదిలి వచ్చానని, తనకు ఓ బిడ్డ పుట్టి చనిపోయిందని కూడా అక్కడి మెజిస్ట్రేట్ వద్డ ఆవేదన వెలిబుచ్చింది.
ఈ విషయంపై బులంద్ షహెర్ మెజిస్ట్రేట్ బి.చంద్రకళ ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడుతూ పాలమూరు జిల్లాకు చెందిన జయమ్మ పరిస్థితి చూస్తే తనను కలిచి వేసిందన్నారు. శనివారం నుంచి తన నివాసంలో ఉంచుకొని ఆమె ఆరోగ్యం కుదుట పడిన తర్వాత బట్టలు ఇప్పించి, ఖర్చులకోసం డబ్బులు కూడా ఇచ్చి మహబూబ్‌నగర్ జిల్లాకు పంపానన్నారు.
బులంద్ షహెర్‌కు చెందిన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు, ఓ ప్రభుత్వ అధికారిని వెంట ఇచ్చి పంపుతున్నానని, వారి వెంట జయమ్మ ఎదుర్కొన్న ఇబ్బందులను తెలియపరుస్తూ.. ఆమెను ఆదుకోవాలని కోరుతూ పాలమూరు జిల్లా కలెక్టర్‌కు లేఖ పంపానని ఆమె వెల్లడించారు. వారు బుధవారం ఉత్తరప్రదేశ్ నుంచి సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరారని, గురువారం జిల్లాకు చేరుకునే అవకాశం ఉందని చంద్రకళ వెల్లడించారు.
బులంద్ షహెర్ మెజిస్ట్రేట్ తెలంగాణ వాసే..!
ఊరుగాని ఊర్లో అవస్తలు పడుతున్న జయమ్మను ఆదుకున్న బులంద్ షహెర్‌కు చెందిన మెజిస్ట్రేట్ (కలెక్టర్) తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆడపడుచు. కరీనంగర్ జిల్లాకు చెందిన రామగుండ వాసి. ఆమె తల్లిదండ్రులు రైసు మిల్లు వ్యాపారం చేసుకునే వారు. చంద్రకళ భర్త అదే జిల్లాలో ఇరిగేషన్ శాఖలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఒక ఆడపడుచు ఆవేదనను మరో మహిళ అర్థం చేసుకుంటున్న నానుడిని బులంద్ షహెర్ మెజిస్ట్రేట్ చంద్రకళ రుజువు చేశారు.