మళ్లీ.. ఆధార్ అనుసంధానం | Aadhar card link gas and Ration cards subsidy | Sakshi
Sakshi News home page

మళ్లీ.. ఆధార్ అనుసంధానం

Published Wed, Aug 6 2014 1:05 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

మళ్లీ.. ఆధార్ అనుసంధానం - Sakshi

మళ్లీ.. ఆధార్ అనుసంధానం

నల్లగొండ :ఆధార్ కార్డుల ప్రక్రియ మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో వంట గ్యాస్‌కు ఆధార్ లింకు పెట్టి సబ్సిడీని బ్యాంకులలో జమ చేసిన విషయం విదితమే. వంటగ్యాస్‌తోపాటు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆధార్ కార్డులతో లింకు చేయాలనే ఆలోచనతో ఉన్న యూపీఏ ప్రభుత్వంపై విపక్షాల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. అదే విధంగా ఎన్నికలు సమీపించడంతో ఆధార్ కార్డుల ఆనుసంధానం, సబ్సిడీ బ్యాంకు అకౌంట్లో జమచేసే విధానానికి స్వస్తి చెప్పారు. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కూడా ఆధార్ కార్డులను సంక్షేమ పథకాలకు లింకు పెట్టాలనే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం.
 
 అందుకు గాను ఆధార్ కార్డుల ప్రక్రియ మళ్లీ తెరపైకి వచ్చింది. రేషన్‌కార్డులకు, వంట గ్యాస్‌కు ఆధార్ కార్డుల అనుసంధాన కార్యక్రమం కొనసాగుతోంది. రేషన్ కార్డులలో బోగస్‌కార్డులను ఏరివేయడానికి ఆధార్ కార్డులు అనుసంధానం చేస్తున్నారు. రేషన్ డీలర్లకు ఆధార్ కార్డులను సేకరించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 34.88 లక్షల జనాభా ఉండగా ఇప్పటి వరకు 29 లక్షల మంది ఆధార్ కార్డులు పొందారు. కాగా మిగతా వారి కోసం జిల్లాలోని 24 మీ సేవా కేంద్రాలలో ఆధార్ కార్డుల ప్రక్రియ కొనసాగుతోంది.
 
 రేషన్ కార్డులు, వంట గ్యాస్‌కు అనుసంధానం..
 రేషన్‌కార్డులకు, వంట గ్యాస్ కనెక్షన్లకు ఆధార్ కార్డులను అనుసంధానం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రేషన్‌కార్డులలో 33.84 లక్షల యూనిట్లు ఉండగా ఇప్పటి వరకు 25.19 లక్షల యూనిట్లు ఆధార్ కార్డులకు అనుసంధానం చేశారు. అదే విధంగా 6,25,342 వంట గ్యాస్ వినియోగదారులకు గాను 3,79,552 వినియోగదారులకు ఆధార్‌కార్డులు అనుంసంధానం చేయగా 2,32,579 మంది వినియోగదారులకు బ్యాంకు అకౌంట్లకు అనుసంధానం చేశారు. ఆధార్ కార్డులతో వంట గ్యాస్, రేషన్ కార్డుల అనుసంధాన కార్యక్రమం కొనసాగుతోంది.
 
 జిల్లా కార్యాలయం లేక ఇక్కట్లు
 జిల్లాలో ఎంతమంది ఆధార్ కార్టులు పొందారు... ఇంకా ఎంత మంది ఆధార్ కార్డులు తీసుకోవాల్సి ఉంది.. తప్పులు దొర్లిన వారు దరఖాస్తులు పెట్టుకునేందుకు జిల్లా కార్యాలయం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా కొంతమంది ఆధార్ కార్డులకు దరఖాస్తులు పెట్టుకొని ఫొటోలు సైతం దిగినా కార్డులు రానివారు సైతం ఉన్నారు. ఇంటర్‌నెట్ ద్వారా కార్డులు పొందడానికి రాకపోవడంతోపాటు తిరిగి కార్డులు దిగడానికి కూడా అవకాశం లేకుండా ఉంది. అలాంటి ప్రజలు తమ సమస్యలు ఎవరికి చెప్పాలో అర్థంకాని పరిస్థితి. జిల్లా స్థాయిలో కార్యాలయం ఉంటే ఆధార్ కష్టాలు తొలిగే అవకాశాలు ఉన్నాయి.
 
 24 కేంద్రాల ఏర్పాటు..
 ఆధార్ కార్డులకు దరఖాస్తులు చేసుకోని వారు జిల్లా వ్యాప్తంగా సుమారుగా ఆరు లక్షల మంది ఉన్నారు. కానీ జిల్లాలో కేవలం 24 మీ సేవా కేంద్రాలలో మాత్రమే ఆధార్ కార్డులు అందజేసే కార్యక్రమం కొనసాగుతోంది. ప్రస్తుతం జిల్లాలో ఆలేరు, హాలియా, బొమ్మల రామారం, అర్వపల్లి, కోదాడ, ఎం. తుర్కపల్లి, మేళ్ల చెర్వు, నడిగూడెం, మునగాల, నారాయణపురం, నేరేడుచర్ల, నూతనకల్, పెద్దవూర, పెన్‌పాహడ్, తిరుమలగిరి, తుంగతుర్తి, వలిగొండ, కట్టంగూర్‌తో పాటు నల్లగొండ మున్సిపాలిటీలో రెండు, సూర్యాపేట మున్సిపాలిటీలో రెండు, మిర్యాలగూడలో ఒకటి, భువనగిరిలో ఒక కేంద్రంలో ఆధార్ కార్డుల ప్రక్రియ కొనసాగుతున్నాయి.   మండలానికో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement