హన్మకొండ అర్బన్: ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ విషయంలో లబ్ధిదారుల అర్హత వయస్సు 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించడంతో జిల్లాలో వేలాది మందికి కొత్తగా ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటికే సమారు 40వేల మంది వరకు కొత్తగా అర్హత సాధిస్తారని అధికారులు ప్రాథమికంగా అంచనా సైతం వేశారు. దీంతో లబ్ధిదారుల వాటాతో పెన్షన్ అందుకునే అభయహస్తం పథకం ఇకపై పూర్తిగా రద్దుకానుంది. సెర్ప్ వెబ్‌సైట్‌లో సంబంధిత సమాచారం పూర్తిగా తొలగించడం ఇందుకు బలం చేకూర్చుతోంది. అయితే అభయహస్తం పథకంలో లబ్ధిదారుల వాటా, ప్రభుత్వం వాటా మొత్తం రూ.కోట్లలో జమై ఉన్నది.
వీటిని సభ్యులకు ఎలా చెల్లిస్తార్న విషయంలో అయోమయం నెలకొంది. ఆసరా పథకంలో అభయహస్తం పెన్షన్ కోసం లబ్ధిదారులు ఒక్కొక్కరు రోజుకు ఒకరూపాయి చొప్పున నెలకు రూ.30 చెల్లిస్తే ప్రభుత్వం అంతే మొత్తంలో జమచేసేది. సభ్యుల వయస్సు 60 ఏళ్లు నిండగానే వారికి ప్రతినెలా రూ.500 పెన్షన్ చెల్లించేది. గతంలో ఆసరా పెన్షన్ అర్హత వయస్సు 65 సంవత్సరాలుగా ఉన్నందున అభయహస్తం పెన్షన్ ఐదు సంవత్సరాలు ముందుగా అందేది. ప్రసుతం ఆసరా అర్హత వయస్సు 57 సంవత్సరాలకు చేయడంతో ఈ పథకం కంటే ఆసరా పథకం ద్వారా ఎలాంటి చెల్లింపులు లేకుండా నేరుగా ఈ ఏడాది మార్చి నెల నుంచి రూ.2016 అబ్ధిదారులకు అందనున్నాయి.
2009 సంవత్సరంలో మొదలు..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి 2009 సంవత్సరంలో ఐకేపీ పెన్షన్, బీమా పథకం పేరుతో అభయహస్తం పథకాన్ని అమలులోకి తీసుకొచ్చారు. సంఘాల్లోని పేద మహిళలకు అన్ని విధాలుగా ఉపయోగ కరంగా ఉండడంతో ఈ పథకంలో పెద్ద సంఖ్యలు సభ్యులుగా చేరారు. వయస్సు 60 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ ఇవ్వడం, వారి కుటంబాలకు బీమాతో భరోసా కల్పించడం, పిల్లల చదువులకు ఆర్థికంగా అండగా ఉండటం పథకం ముఖ్య ఉద్దేశంగా ఉండేది.
బీమా ఉపకారం కూడా..
ఈ పథకాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకపోయినా సభ్యత్వాలు, వాటా ధనం చెల్లింపులు నిలిపి వేయడంతో అనధికారికంగా పథకం రద్దయినట్లు సంఘాల వారు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆసరా పథకంతో పెన్షన్ పెద్ద మొత్తంలో వస్తున్నప్పటికీ బీమా, ఉపకార వేతనాలు వంటివి మాత్రం మహిళా సంఘాలు కోల్పోయే అవకాశం ఉందని సభ్యులు అంటున్నారు. ఈ పథకం కొంత మార్పులతో అమలు చేస్తామని గతంలో ప్రభుత్వం చెప్పినా అలాంటి చర్యలు కార్యరూపం దాల్చలేదు.
వాటా ధనం సంగతి..?
అభయహస్తం పథకంలో 18 సంవత్సరాలు నిండిన వారు చేరారు. వారు నెలకు రూ.30 చెప్పున వాటా ధనం చెల్లిస్తూ వచ్చారు. పథకం ప్రారంభం నుంచి ఉన్న ఒక్కో మహిళ ఇప్పటివరకు(అంటే సుమారు 10 ఏళ్ల కాలంలో)తన వాటా ధనంగా రూ.3600 చెల్లించి ఉంటుంది. అంతే మొత్తంలో ప్రభుత్వం జమచేసింది. అంటే ఒక్కో మహిళ పేరుతో రూ.7200 జమ అయిఉంటాయి. ఈ డబ్బులు తిరిగి చెల్లిస్తారా.. చెల్లిస్తే ఏ విధంగా ఇస్తారనే విషయంలో స్పష్టత రావలసి ఉంది.
ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 3.74 లక్షల మంది ఉండగా వీరిలో సుమారు 18వేల మంది పెన్షనర్లు. ఒక్కొక్కరికి రూ.7200 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం ఏలా వస్తుందనే విషయమై సంఘాల సభ్యుల్లో కొంత ఆందోళన నెలకొంది. అలాగే పథకానికి సంబంధించిన క్‌లైములు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. అయితే జిల్లా అధికారులకు మాత్రం ఈ పథకం అమలు, రద్దు విషయంలో ఎలాంటి «అధికారిక సమాచారం అందలేదని అంటున్నారు.
పైసలిస్తలేరు..
అభయహస్తం పైసలు ఇస్తలేరు. 60 సంవత్సరాలు నిండిన మహిళలకు అండగా ఉండాలని వైఎస్ 2009 సంవత్సరంలో చేపట్టిన అభయహస్తం పథకాన్ని ఇచ్చిండ్లు.. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్లక్ష్యం చేసింది. గతంలో నెలకోసారి తప్పకుండా క్రమం తప్పకుండా అభయహస్తం పథకం ద్వారా పెన్షన్ మంజూరయ్యేది. ఇప్పుడు ఆరునెలలకోసారి కూడా రాట్లేదు. అధికారులు, ప్రభుత్వం జర పట్టించుకోవాలె. పింఛన్ అందించాలి. – కొయ్యడ మల్లికాంబ, పరకాల
Comments
Please login to add a commentAdd a comment