
సస్పెండ్ అయినా తీరు మారలేదు
ఆరోపణలు ఎదుర్కొని సస్పెండైనా ప్రభుత్వ ఉద్యోగుల తీరు మారడంలేదు.
నల్లగొండ : ఆరోపణలు ఎదుర్కొని సస్పెండైనా ప్రభుత్వ ఉద్యోగుల తీరు మారడంలేదు. నిబంధనలను మీరి విధులు నిర్వర్తించడమే కాకుండా, లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడో తహశీల్దార్. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట తహశీల్దార్ సోమ్లా నాయక్ రూ.15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికారు. వివరాలు.. యాదగిరిగుట్ట తహశీల్దార్ సోమ్లానాయక్ ఓ కేసులో ఆరోపణలు ఎదుర్కొని వారం క్రితం సస్పెండ్ అయ్యారు. అయినా నింబంధనలను మీరి ఇంటిలో విధులు నిర్వర్తిస్తూ సదరు తహశీల్దార్ ఓ రైతు నుంచి లంచం డిమాండ్ చేశాడు. భూమి వాల్యువేషన్ పత్రాలను ఇవ్వాలని కోరిన మండలంలోని కాసారం గ్రామానికి చెందిన రైతు మల్లేష్ ను రూ. 25 వేలు అడిగాడు.దీంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం సోమ్లానాయక్ రైతు వద్ద నుంచి రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
(యాదగిరిగుట్ట)