ఆది నుంచీ.. అవినీతి మకిలే!      | Corrupted MRO In Rangareddy | Sakshi
Sakshi News home page

ఆది నుంచీ.. అవినీతి మకిలే!     

Published Fri, Jul 12 2019 1:15 PM | Last Updated on Fri, Jul 12 2019 1:15 PM

Corrupted MRO In Rangareddy - Sakshi

తన సమస్య పరిష్కరించాలని తహసీల్దార్‌ లావణ్య కాళ్లపై పడి వేడుకుంటున్న రైతు (ఫైల్‌)

సాక్షి, రంగారెడ్డి : కేశంపేట తహసీల్దార్‌ లావణ్య అవినీతి, అక్రమాల డొంక కదులుతోంది. ఆమె ఉద్యోగ జీవితమంతా అవినీతిమయమేనని తెలుస్తోంది. ఉన్నతాధికారుల ఆశీస్సులు, ప్రజాప్రతినిధుల అండదండలతో లంచావతారమెత్తినట్లు ఏసీబీ విచారణలో వెల్లడవుతోంది. పనిచేసిన ప్రతిచోటా కోటరీ ఏర్పాటు చేసుకుని తన దందాను దర్జాగా కొనసాగించేవారని బయటపడుతోంది. కాసులిస్తేనే  ఫైలు కదిలేది.. లేదంటే నెలల తరబడి పెండింగ్‌లో పెట్టేవారని బాధితులు పేర్కొంటున్నారు.

లావణ్య గతంలో పనిచేసిన మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని ఏసీబీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉండటం, వీఆర్‌ఓ లంచం తీసుకున్న కేసులో హస్తమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తహసీల్దార్‌ లావణ్య కేసును ఏసీబీ అధికారులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. గతంలో ఆయా మండలాల్లో చేసిన కార్యాకలాపాల కూపీ లాగుతున్నారు. హయత్‌నగర్‌లోని తన ఇంట్లో రూ.93.50 లక్షల నగదు, 43 తులాల బంగారు ఆభరణాలు, విలువైన భూపత్రాలు ఏసీబీ దాడుల్లో బయటపడటం తెలిసిందే.

కొందుర్గు వీఆర్‌ఓ అనంతయ్య బుధవారం ఓ రైతు నుంచి రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కగా.. ఇందులో లావణ్య ప్రమేయమున్నట్లు విచారణలో తేలింది. దీంతో తహసీల్దార్‌ నివాసంలో సోదాలు నిర్వహించగా.. నివ్వెరపోయే రీతిలో నగదు లభ్యంకావడంతో ఏసీబీ అధికారులు ఆమెను అరెస్ట్‌ చేశారు. నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో డీఎస్పీ సూర్య నారాయణ నేతృత్వంలో ఆమెను విచారించారు. గురువారం దాదాపు నాలుగైదు గంటలపాటు కూపీలాగగా.. పలు విస్తుగొలిపే అంశాలు వెల్లడించినట్లు సమాచారం. సాయంత్రం ఆమెను నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టారు.  

స్థానిక నేతల అండతో.. 
కేశంపేటకు బదిలీపై వచ్చాక తహసీల్దార్‌ లావణ్య తన అవినీతి విశ్వరూపాన్ని ప్రదర్శించారని స్థానికులు పేర్కొంటున్నారు. కేవలం లంచాలకే పరిమితం కాకుండా రియల్‌ వ్యాపారి అవతారమెత్తినట్లు తెలిసింది. భూముల ధరలు విపరీతంగా పెరగడంతో ఆమె కన్ను భూ క్రయవిక్రయాలపై పడినట్లు వినికిడి. ఇందుకు అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుల అండదండా సైతం ఉండటంతో మరింత రెచ్చిపోయారని ఏసీబీ విచారణలో తేలినట్లు సమాచారం.

చేతిలో అధికారం.. పైనుంచి నేతల ఆశీస్సులు ఉండటంతో తన అక్రమ కార్యకలాపాలకు ఎదురు లేకుండా పోయిందని ప్రచారం జరుగుతోంది. బినామీల పేర్లతో భూములను అగ్రిమెంట్‌ చేసుకోవడం.. కొంత ధర పెరగగానే ఇతరులకు విక్రయించేవారని ప్రతినోటా నానుతోంది. ముఖ్యంగా నాలుగైదు గ్రామాల్లోనే క్రయవిక్రయాలు బాగా జరిపారని తెలుస్తోంది. తన అవినీతి, అక్రమాలపై గట్టిగా ప్రశ్నిస్తే సదరు ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులను రంగంలోకి దించేవారని, చివరకు వాళ్లు సెటిల్‌ చేసేవారని తెలిసింది. 

ఫిర్యాదులు బుట్టదాఖలు.. 
తహసీల్దార్‌ లావణ్య  అవినీతి, అక్రమాలపై ఉన్నతాధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందినా.. అవి చివరకు బుట్టదాఖలుకాక తప్పలేదు. కేశంపేట మండలంలోని పాపిరెడ్డిగూడ గ్రామంలో ఓ నిరుపేదకు కేటాయించిన అసైన్డ్‌ భూమిలోంచి ఒక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి తారు రోడ్డు వేసినా ఆమె మిన్నకుండిపోయారు. స్థానికులు కొందరు ఆమెపై ఒత్తిడితేగా ఎట్టకేలకు సదరు రోడ్డుపై అడ్డుగా మట్టిపోశారే తప్ప.. తొలగించలేదు. ఇందుకుగాను ఆ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఆమెకు రూ.5 లక్షలు బహుమానంగా ఇచ్చినట్లు స్థానికంగా చర్చజరుగుతోంది.

అలాగే అల్వాల గ్రామానికి స్పెషల్‌ ఆఫీసర్‌గా పనిచేసిన సమయంలో కనీస నియమ నిబంధనలు పాటించని వెంచర్లకు అనుమతులిచ్చారు. పైగా ఓ బడా రియల్‌ వ్యాపారి ప్రభుత్వ భూములను, కుంటలను కబ్జా చేసినా చర్యలు తీసుకోకపోగా ఆయనకే వత్తాసు పలికినట్లు తెలుస్తోంది. దీనికి వెనక కూడా లక్షల రూపాయలు చేతులు మారినట్లు సమాచారం. ఇలా చెప్పుకుంటా పోతే.. లావణ్య అవినీతి బాగోతం చేంతాడంత బయటకు వస్తోంది.  

అప్పటి నుంచే ఏసీబీ కన్ను.. 
కేశంపేటకు లావణ్య 2016 నవంబర్‌లో బదిలీపై వచ్చారు. అప్పటివరకు మెదక్‌ జిల్లాలోని కొండాపూర్‌లో దాదాపు 8 నెలల కాలం పనిచేశారు. ఈ సమయంలోనూ పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా మట్టి దందాలో ఆమె పాత్ర ఉన్నట్లు సమాచారం. వ్యాపారులతో కుమ్మక్కై డబ్బులు దండుకున్నట్లు తెలిసింది. అంతేగాక అనుమతి లేకుండా బోరుబావి తవ్విన రైతుపై ప్రతాపం చూపిన ఆమె.. చివరకు రూ.20 వేలు తీసుకుని వెనక్కి మళ్లినట్లు ప్రచారంలో ఉంది.

అలాగే కేశంపేటకు బదిలీ కావడంతో ఇక్కడి విధుల నుంచి రిలీవ్‌ అయిన చివరి రోజున కూడా ఓ రైతు నుంచి లంచం తీసుకున్నట్లు సమాచారం. పాస్‌పుస్తకంపై సంతకం పెట్టినందుకు ఆమెకు రైతు రూ.2,500 సమర్పించుకున్నట్లు చర్చజరుగుతోంది. లావణ్య తీరు ఇలా ఉండటంతో భరించలేని పలువురు బాధితులు ఏసీబీని ఆశ్రయించినట్లు తెలిసింది. తాజాగా కొందుర్గులో ఏసీబీ దాడులు జరిగేకంటే ముందు మూడు నాలుగు రోజుల క్రితం అధికారులు ఇక్కడ ఆరా తీసినట్లు సమాచారం. 

ప్రతిచోటా ఆదే తీరు.. 
గ్రూప్‌–2  2007 బ్యాచ్‌కి చెందిన లావణ్య దాదాపు తొమ్మిదేళ్లు ఉమ్మడి మెదక్‌ జిల్లాలోనే విధులు నిర్వహించారు. తొలుత డిప్యూటీ తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమెకు.. కొంతకాలం తర్వాత తహసీల్దార్‌గా పదోన్నతి లభించింది. ఇక అప్పటి నుంచి ఆమె మరింత రెచ్చిపోయినట్లు, తన అవినీతికి ఎదురేలేకుండా పోయినట్లు ఆయా మండలాల్లోని బాధితులు పేర్కొంటున్నారు. ములుగు, దౌల్తాబాద్, కౌడిపల్లి, కొల్చారం, కొండాపూర్‌లో పనిచేశారు. కొల్చారంలో ఇసుక అక్రమ రవాణా పేరిట హల్‌చల్‌ చేసిన ఆమె.. వారం రోజులపాటు వ్యాపారులకు చుక్కలు చూపించారు. దీంతో మేడం చాలా స్ట్రిక్ట్‌ అనే భావన ఏర్పడ్డాక కాసుల దందా షురూ చేసినట్లు తెలుస్తోంది.

ఆన్‌లైన్‌లో నమోదుకు డబ్బులు ఇచ్చాను  
పాపిరెడ్డిగూడ గ్రామ శివారులో సర్వే నెంబర్‌ 41లో ఎకరం పొలాన్ని సంవత్సరం క్రితం కొనుగోలు చేశాం. రెవెన్యూ రికార్డుల్లో భూమిని పట్టా చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు తహసీల్దార్‌ కార్యాలయానికి గత ఏడాది కాలంగా తిరుగుతున్నాం. ఆన్‌లైన్‌లో నమోదు కోసం వీఆర్‌ఓ అనంతయ్య రూ.5వేలు డిమాండ్‌  చేసి తీసుకున్నాడు. అయినా ఆన్‌లైన్‌లో భూ వివరాలను నమోదు చేయలేదు.  
 – సూరమోని శంకర్, రైతు, పాపిరెడ్డిగూడ, కేశంపేట
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement